మహువా మొయిత్రాపై వేటు .. కక్షసాధింపేనని ప్రతిపక్షాల ఫైర్

మహువా మొయిత్రాపై వేటు .. కక్షసాధింపేనని ప్రతిపక్షాల ఫైర్
  • ప్రశ్నకు నోటు వ్యవహారంలో పార్లమెంట్ చర్యలు
  • లోక్ సభకు ఎథిక్స్ కమిటీ రిపోర్ట్​
  • కక్షసాధింపేనని ప్రతిపక్షాల ఫైర్

న్యూఢిల్లీ:   తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా లోక్ సభ నుంచి బహిష్కరణకు గురయ్యారు. సభలో ప్రశ్నలు అడిగేందుకు ఆమె డబ్బులు  తీసుకున్నారన్న(క్యాష్ ఫర్ క్వెరీ) ఆరోపణలను ధ్రువీకరిస్తూ పార్లమెంట్ ఎథిక్స్ కమిటీ శుక్రవారం నివేదికను సమర్పించింది. కమిటీ సిఫారసులను ఆమోదిస్తూ మహువాను లోక్ సభ బహిష్కరించింది. కమిటీ నివేదికపై చర్చ సందర్భంగా అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. మహువాను బహిష్కరించేందుకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి తీర్మానాన్ని ప్రవేశపెట్టగా, దానిని సభ వాయిస్ ఓట్ ద్వారా ఆమోదించింది. 

ఈ సందర్భంగా కేంద్రం రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతోందని, రూల్స్ కు విరుద్ధంగా కమిటీ వ్యవహరించిందంటూ ప్రతిపక్ష నేతలు ఆరోపించారు. మహువాకు సభలో మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదంటూ మండిపడ్డారు. అయితే, ఎథిక్స్ కమిటీ విచారణ సందర్భంగా తన  వాదనను తెలియజేసేందుకు మహువాకు అవకాశం ఇచ్చినా, ఆమె విచారణ మధ్య నుంచే వెళ్లిపోయారని బీజేపీ నేతలు స్పష్టం చేశారు. మహువాకు అండగా ఉంటామని కాంగ్రెస్ నేత సోనియా గాంధీ అన్నారు. బీజేపీపై యుద్ధంలో మహువా గెలుస్తుందని తృణమూల్ చీఫ్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. కక్ష సాధింపులకు పాల్పడుతున్న బీజేపీకి ప్రజలే బుద్ది చెప్తారన్నారు. బహిష్కరణ తర్వాత పార్లమెంట్ బయట మహువా మీడియాతో మాట్లాడారు. కమిటీ అన్ని రూల్స్ ను ఉల్లంఘించిందని ఆరోపించారు. రేపు తన ఇంటికి సీబీఐని కూడా పంపి వేధిస్తారేమోనని అన్నారు.

ఆయుష్మాన్ భారత్ లో 6 కోట్ల అడ్మిషన్లు

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఆయుష్మాన్ భారత్ యోజన కింద ఈ ఏడాది నవంబర్ 30 నాటికి దేశవ్యాప్తంగా వేలాది ఆస్పత్రుల్లో 6 కోట్ల మంది పేషెంట్లు అడ్మిషన్ పొందారని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్ సుఖ్ మాండవీయ శుక్రవారం లోక్ సభకు వెల్లడించారు. వీరందరి ట్రీట్మెంట్లకు సంబంధించి రూ. 77,298 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. డిసెంబర్ 2 నాటికి 26,774 దవాఖానలు ఈ స్కీంలో ఎంప్యానెల్ అయ్యాయని, వీటిలో 11,733 ప్రైవేట్ ఆస్పత్రులు ఉన్నాయన్నారు.

ఈ ఏడాది 2.34 లక్షల డెంగీ కేసులు

దేశవ్యాప్తంగా ఈ ఏడాది నవంబర్ 30 నాటికి 2,34,427 డెంగీ కేసులు నమోదు అయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి ఎస్పీ సింగ్ బాఘేల్ శుక్రవారం లోక్ సభకు వెల్లడించారు. ఏటా జనవరి నుంచి  జులై వరకు అధికంగా, ఆగస్ట్ నుంచి డిసెంబర్ వరకూ తక్కువగా కేసులు వస్తున్నాయన్నారు. 2021లో 1.93 లక్షలు, 2022లో 2.33 లక్షల మందికి డెంగీ సోకినట్లు పేర్కొన్నారు. 

నేవీలో 10,896 మంది స్టాఫ్ కొరత 

ఇండియన్ నేవీలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉందని, ప్రస్తుతం నేవీకి 10,896 మంది సిబ్బంది అవసరమని, వీరిలో 1,777 మంది ఆఫీసర్ లను నియమించాల్సి ఉందని రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ శుక్రవారం లోక్ సభకు తెలిపారు. నేవీలో మొత్తం 11,979 ఆఫీసర్, 76,649 సెయిలర్ (శాంక్షన్డ్) పోస్టులు ఉన్నాయన్నారు. గత రెండేండ్లలో 709 ఆఫీసర్‌‌‌‌ పోస్టులు, 10,718 సెయిలర్ పోస్టులను భర్తీ చేశామని తెలిపారు.

ఇదీ కేసు..

ప్రధాని మోదీని ఇరుకున పెట్టేలా ఇండస్ట్రియలిస్ట్ గౌతమ్ అదానీకి సంబంధించిన ప్రశ్నలు అడిగేందుకు బిజినెస్ మాన్ హీరానందాని నుంచి మహువా డబ్బులు, ఖరీదైన గిఫ్టులు తీసుకున్నారన్న ఆరోపణలపై ఎథిక్స్ కమిటీ విచారణ జరిపింది. మహువా పార్లమెంట్ లాగిన్ ఐడీ, పాస్ వర్డ్​లను వేరొకరికి అప్పగించారని, దుబాయి, అమెరికా నుంచి ఆ ఐడీ ద్వారా వేరే వ్యక్తులు 47 సార్లు లాగిన్ అయ్యారని ఎథిక్స్ కమిటీ తేల్చింది.