మాకు ఓటేస్తే ఫ్రీ.. ఫ్రీ.. ఫ్రీ .. ఉచితాలు, నగదు పంపిణీ పథకాలపైనే ప్రధాన పార్టీల ఫోకస్​

మాకు ఓటేస్తే ఫ్రీ.. ఫ్రీ.. ఫ్రీ .. ఉచితాలు, నగదు పంపిణీ పథకాలపైనే ప్రధాన పార్టీల ఫోకస్​
  • అలవికాని హామీలతో ఓటర్ల ముందుకు లీడర్లు
  • విద్య, వైద్యం వంటి మౌలిక వసతులకు నో ప్రయారిటీ
  • వ్యక్తిగతంగా లబ్ధిచేకూర్చే స్కీమ్​ల చుట్టే రాజకీయం
  • ఇప్పటికే రూ. 5 లక్షల కోట్ల అప్పుల్లో రాష్ట్రం
  • కిస్తీలకే ఏటా 25 శాతం ఆదాయం ఖర్చు
  • ఉద్యోగులకు టైమ్‌‌కు జీతాలు ఇయ్యలేని స్థితి
  • రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మరిచి పోటాపోటీ వాగ్దానాలు

హైదరాబాద్, వెలుగు: ఎన్నికల్లో గెలిపిస్తే.. రోడ్లు వేయిస్తం, దవాఖాన్లు కడ్తం, మంచి వైద్యం అందిస్తం, మంచి చదువు చెప్పిస్తం..’’ అనే వాగ్దానాలకు కాలం చెల్లిపోయింది. వ్యక్తిగతంగా లబ్ధి చేకూర్చే స్కీములు, నెలనెలా డబ్బులు పంచిపెట్టే పథకాలకే రాజకీయ పార్టీలు పెద్దపీట వేస్తున్నాయి. ‘‘గొర్రెలు ఇస్తం.. పైసలు ఇస్తం.. ఫ్రీగా బస్సులల్ల తిప్పుతం.. బీమా చేయిస్తం..’’ అంటూ క్యాష్​ ఓరియెంటెడ్​ స్కీమ్​లను కుమ్మరిస్తున్నాయి. గెలిచే స్థితిలో లేని పార్టీలు ఒకప్పుడు ఇలాంటి అలివికాని హామీలు ఇచ్చేవన్న పేరుంది. ఇప్పుడు గెలుపు రేసులో ఉన్న ప్రధాన పార్టీలు కూడా వీటినే నమ్ముకున్నాయి. రాష్ట్ర సంపదను, రాష్ట్ర ఆదాయాన్ని మరిచిపోయి.. ఉచితాలు, నగదు పంపిణీ పథకాలపైనే ఫోకస్​ పెట్టాయి.

నువ్వు రూపాయి ఇస్తే.. నీకంటే పది రూపాయలు ఎక్కువిస్త..’’ అన్నట్లుగా అధికార, ప్రతిపక్ష పార్టీలు పోటీ పడుతున్నాయి. నేరుగా ఓటర్లను ఆకట్టుకోవాలన్నదే లక్ష్యంగా వీటితోనే మేనిఫెస్టోలను నింపేస్తున్నాయి. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్​.. అధికారాన్ని నిలబెట్టుకునేందుకు బీఆర్​ఎస్ పోటా పోటీగా ప్రజలపై హామీలు కురిపించాయి. రేపోమాపో బీజేపీ విడుదల చేయబోయే మేనిఫెస్టోలోనూ ప్రజలకు వ్యక్తిగతంగా లబ్ధి చేకూర్చే స్కీములే ఉంటాయన్న చర్చ జరుగుతున్నది.

బీఎస్పీ కూడా దాదాపు ఇలాంటి మేనిఫెస్టోనే ప్రకటించింది. ఉచిత పథకాలు, డబ్బుల పంపిణీ ఆర్థిక సంక్షోభానికి దారి తీస్తాయని పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నా.. రాజకీయ పార్టీలకు మాత్రం అదేమీ పట్టడం లేదు. ఏ ఆసరా లేని వాళ్లకు ప్రభుత్వం ఆర్థికంగా చేయూతనివ్వడం, ఊతకర్రగా నిలబడటం మంచిదే.. కానీ, అదే సమయంలో విద్య, వైద్యం, రవాణా సౌకర్యాలు వంటి కనీస సదుపాయలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. కనీస సదుపాయాల కల్పనకు ఏం చేస్తామనే ప్రస్తావన ఏ ఒక్క పార్టీ మేనిఫెస్టోలోనూ పెద్దగా చోటు దక్కడం లేదు. 

పోటా పోటీ ఉచితాలు

తమ పార్టీని గెలిపిస్తే ప్రతి నిరుద్యోగికి నెలకు రూ.3,016 చొప్పున ‘నిరుద్యోగ భృతి’ ఇస్తామని బీఆర్ఎస్​ 2018 ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చి అమలు చేయలేదు. ఇప్పుడు ఆ పార్టీ అర్హులైన మహిళలకు నెలకు రూ.3 వేల గౌరవ భృతి ఇస్తామని హామీ ఇచ్చింది. ఇలాంటి స్కీమ్‌ను బీఆర్‌‌ఎస్ కంటే ముందే కాంగ్రెస్ (నెలకు రూ.2,500) ఇస్తామని ప్రకటించింది. కాంగ్రెస్​ రూ.500కు గ్యాస్​ సిలిండర్​ ఇస్తామని చెప్తే.. బీఆర్ఎస్​ రూ.400కే సిలిండర్​ అని హామీ ఇచ్చింది. కాంగ్రెస్​ అన్ని పెన్షన్లు రూ.4 వేలు ఇస్తామని చెప్తే.. బీఆర్ఎస్​ ఆసరా పింఛన్లను రూ.5 వేలకు​, దివ్యాంగుల పింఛన్లను రూ.6 వేలకు పెంచుతామని మేనిఫెస్టోలో చేర్చింది.

కాంగ్రెస్​ రైతులకు రూ.15 వేలు ఇస్తామంటే.. రైతుబంధు సాయం రూ.16 వేలకు పెంచుతామని బీఆర్ఎస్​ హామీ ఇచ్చింది. ఆర్థిక స్థితి, వయసుతో సంబంధం లేకుండా మహిళలందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసే సౌకర్యాన్ని కల్పిస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. ఇప్పటికే ఆర్టీసీ పుట్టెడు అప్పుల్లో కూరుకుపోయింది. కార్మికులకు జీతాలు కూడా ఇవ్వలేని స్థితిలో ఉన్న ఆ సంస్థను ఇటీవలే ప్రభుత్వంలో విలీనం చేశారు.

కాగా, బీజేపీ కూడా దాదాపు ఇదే తరహా మేనిఫెస్టోతో ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందన్న చర్చ సాగుతున్నది. పోటా పోటీగా పార్టీలు ఉచితాల చుట్టూ, నగదు పంపిణీ చుట్టూ రాజకీయం నడిపిస్తున్నాయి. ఎట్లయినా గెలువాలన్నదే లక్ష్యంగా రాజకీయ పార్టీలు గుప్పిస్తున్న ఈ ఉచిత పథకాల అమలు సాధ్యాసాధ్యాలపై ప్రజల్లో జోరుగా చర్చ జరుగుతున్నది. నిరుద్యోగులు, యువత, విద్యావంతులు ఈ ఉచితాలను వ్యతిరేకిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. విద్య, వైద్యం ఉచితంగా అందజేస్తే చాలని, ఇంకేమీ అవసరం లేదని అంటున్నారు.  

ఇప్పటికే అప్పుల కుప్ప

రాష్ట్రంలో ఇప్పటికే రైతుబంధు, దళిత బంధు, బీసీల్లోని కులవృత్తుల వారికి సాయం లాంటి రకరకాల పేర్లతో నగదు పంపిణీ పథకాలు అమలులో ఉన్నాయి. వీటిని అమలు చేసే క్రమంలో ప్రస్తుత సర్కార్‌‌‌‌.. ఉద్యోగులకు టైమ్‌‌కు జీతాలు కూడా ఇవ్వలేకపోతున్నది. శాలరీలు ఇవ్వడానికి ఆర్బీఐ నుంచి చేబదులు (వేస్ అండ్ మీన్స్‌‌) తీసుకుంటున్నది. రాష్ట్రం ఏర్పడే నాటికి రూ. 70 వేల కోట్ల అప్పు ఉండగా ఎఫ్​ఆర్​బీఎం పరిధిలో తీసుకున్న లోన్లు, వాటికి అదనంగా కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న లోన్లను కలిపితే మొత్తం అప్పు రూ.5 లక్షల కోట్లకు చేరింది.

రాష్ట్రానికి వచ్చే ఆదాయంలో 25 నుంచి 30 శాతం ఈ అప్పుల రీపేమెంట్లకే ఖర్చు చేయాల్సి వస్తున్నది. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీలు పోటాపోటీగా ఇస్తున్న ఉచితాలు, నగదు పంపిణీ హామీలను ఎట్ల అమలు చేస్తారనేది ప్రశ్నగా మారింది. ఆర్థికవేత్తలు, రిటైర్డ్​ ఉన్నతాధికారులు కూడా ఈ హామీల అమలుపై సందేహాలు లేవనెత్తుతున్నారు.