ఆమనగల్లు, వెలుగు: కడ్తాల్ మండలం మైసిగండి మైసమ్మ ఆలయంలో బుధవారం అమ్మవారి జాతర ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ప్రతి ఏటా కార్తీక పౌర్ణమి రోజున ప్రారంభమయ్యే ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు అమ్మవారికి క్షీరాభిషేకం, తైలాభిషేకం చేసి వివిధ రకాల పూలతో అమ్మవారిని అలంకరించారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్ఛారణ నడుమ అమ్మవారికి కుంభహారతి నిర్వహించారు.
ఉత్సవాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. కందుకూర్ ఆర్డీవో జగదీశ్వర్ రెడ్డి, షాద్నగర్ ఏసీపీ లక్ష్మీనారాయణ, రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, దశరథ నాయక్, పీసీసీ సభ్యుడు శ్రీనివాస్ గౌడ్, తహసీల్దార్ జ్యోతి, సీఐ గంగాధర్, ఎస్సై వరప్రసాద్ పాల్గొన్నారు.
