
- ఒకటి ల్యాండింగ్.. మరొకటి టేకాఫ్
- రెండు విమానాల మధ్య కేవలం వంద మీటర్ల దూరం
- విచారణకు ఆదేశించిన డీజీసీఏ
ముంబై: ఆర్థిక రాజధాని ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో పెద్ద ప్రమాదం తప్పింది. ఒకే రన్‌వేపై రెండు విమానాలు ప్రయాణించాయి. ఇండిగో విమానం ల్యాండ్ అవుతుండగా.. ఎయిరిండియా ఫ్లైట్ అదే రన్ వే నుంచి టేకాఫ్ అవుతున్నది. అప్పుడు ఈ రెండు విమానాల మధ్య కేవలం కొన్ని వంద మీటర్ల దూరమే ఉంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ (ఏటీసీ) తప్పిదం వల్లే శనివారం ఈ ఘటన జరిగిందని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) అధికారులు తేల్చారు. దీనికి బాధ్యులైన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బందిని విధుల నుంచి తప్పించి.. విచారణకు ఆదేశించినట్టు చెప్పారు. కాగా, ఆర్డబ్ల్యూ 27 రన్ వేపై గంటకు సుమారు 46 విమానాల రాకపోకలు సాగుతుంటాయి. శనివారం సాయంత్రం ఇండోర్ నుంచి వచ్చిన ఇండిగో విమానం ల్యాండ్ అవుతుండగా.. అదే టైమ్‌లో ఎయిర్ ఇండియా విమానం ముంబై నుంచి తిరువనంతపురం వెళ్లేందుకు గాల్లోకి ఎగిరింది.
మా పైలెట్ల తప్పిదం లేదు: ఇండిగో, ఎయిరిండియా
ఈ ఘటనపై ఇండిగోతో పాటు ఎయిరిండియా సంస్థలు స్పందించాయి. ‘‘6ఈ 6053 అనే విమానం ఇండోర్ నుంచి ముంబైకు బయల్దేరింది. ఏటీసీ ముంబై ఎయిర్‌పోర్టు నుంచి ల్యాండింగ్‌కు పర్మిషన్ ఇవ్వడంతో పైలెట్ అవే సూచనలు పాటించారు. ఇందులో మా పైలెట్ తప్పిదం ఏమీ లేదు. మాకు మా ప్యాసింజర్ల సేఫ్టీనే ముఖ్యం. ప్రొసిజర్ ప్రకారం ఈ ఘటనపై మేం రిపోర్టు చేశాం’’అని ఇండిగో తెలిపింది. ఎయిరిండియా స్పందిస్తూ.. ‘‘ఏఐ657 విమానం ముంబై నుంచి తిరువనంతపురం వెళ్లేందుకు సిద్ధమైంది. ఏటీసీ నుంచి క్లియరెన్స్ వచ్చిన తర్వాతే మా విమానం బయల్దేరింది. ఏటీసీ సూచనలనే మేము పాటించాం. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు. అసలు అధికారులు ఎలా క్లియరెన్స్ ఇచ్చారనేది తెలియాల్సి ఉంది. మా పైలెట్ తప్పిదం లేదు’’ అని ఏఐ అధికారు తెలిపారు.
ఏటీసీ తప్పిదం వల్లే.. : ఏఏఐ
ఏటీసీ నిబంధనల ప్రకారం.. ఒక విమానం రన్‌వే చివరకు వెళ్లాలి లేదంటే టర్న్ తీసుకోవాలని, ఆ తర్వాతే వేరే విమానం టేకాఫ్/ల్యాండింగ్‌కు పర్మిషన్ ఇవ్వాలని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) తెలిపింది. ఈ ఘటనలో నిబంధనలు పాటించలేదని, రెండు విమానాలు ఒకే రన్ వేపై ట్రావెల్ చేశాయని వివరించింది. ఏటీసీ తప్పిదం వల్లే ఇదంతా జరిగిందని తెలిపింది. ముంబై ఎయిర్‌పోర్టుకు వందల సంఖ్యలో విమానాల రాకపోకలు సాగుతాయని, అలాంటప్పుడు ఏటీసీ ఎంతో జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఒకే రన్‌వేపై గంట వ్యవధిలోని పదుల సంఖ్యలో ల్యాండింగ్, టేకాఫ్ అవుతుంటాయని తెలిపింది. ఈ ఘటనపై డీజీసీఏ విచారణకు ఆదేశించిందని ఏఏఐ చెప్పింది.