పాకిస్తాన్‌లో తీవ్ర విద్యుత్ అంతరాయం

పాకిస్తాన్‌లో తీవ్ర విద్యుత్ అంతరాయం

పాకిస్తాన్ లో తీవ్ర విద్యుత్ అంతరాయం ఏర్పడింది. ట్రాన్స్ మిషన్ లైన్లలో లోపం కారణంగా దేశంలోని పలు ప్రధాన నగరాల్లో విద్యుత్ నిలిచిపోయింది. దీంతో ముఖ్య నగరాలైన ఇస్లామాబాద్ తో పాటు, లాహోర్, కరాచీల్లోనూ అంధకారం అలుముకుంది. ఈ సమస్య ఈ రోజు ఉదయం 7.30 గంటల నుంచి ఉన్నట్లు పాకిస్తాన్ జర్నలిస్ట్ అసద్ అలీ టూర్ ట్వీట్ చేశారు. అయితే ఈ సమస్యను పరిశీలిస్తున్నామనిఎలక్ట్రిక్ ప్రతినిధి ఇమ్రాన్ రాణా ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ట్రాన్స్మిషన్ లో తలెత్తిన సమస్య కారణంగా క్వెట్టా సహా బలూచిస్థాన్‌లోని 22 జిల్లాల్లో విద్యుత్తు సరఫరా నిలిచిపోయినట్టు క్వెట్టా ఎలక్ట్రిక్ కంపెనీ తెలిపింది.

గుడ్డు నుంచి క్వెట్టాకు వెళ్లే రెండు ప్రధాన ట్రాన్స్ మిషన్ లైన్లు ట్రిప్ అవడంతో ఈ సమస్య తలెత్తిందని కంపెనీ పేర్కొంది. పాకిస్తాన్ ఇప్పటికే తీవ్ర స్థాయిలో ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. దీంతో ఇంధనం కొనుగోలు చేసేందుకు కూడా మారక నిల్వలు తగ్గిపోయాయి. ఈ కారణంగా అక్కడి విద్యుత్ పరిశ్రమ విపరీతమైన ఒత్తిడిని ఎదుర్కొంటుంది. గతేడాది అక్టోబరులోనూ పాకిస్తాన్ లో పెద్ద ఎత్తున విద్యుత్ అంతరాయం ఏర్పడింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాలు, ప్రావిన్షియల్ రాజధానులు కరాచీ, లాహోర్ లలో దాదాపు 12 గంటలు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.