మునుగోడులో పోలింగ్ సరళిపై ప్రధాన పార్టీల కుస్తీ  

మునుగోడులో పోలింగ్ సరళిపై ప్రధాన పార్టీల కుస్తీ  

నల్గొండ, వెలుగు :  మునుగోడు ఉప ఎన్నికలో ఏ పార్టీ అభ్యర్థి గెలుస్తాడనే దాని పైన ప్రధాన రాజకీయ పార్టీలు లెక్కలేసుకుంటున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠత రేపిన మునుగోడు బైపోల్​లో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. 298 పోలింగ్ కేంద్రాల్లో 80 నుంచి 98 శాతం ఓట్లు పోలయ్యాయి. పల్లె, పట్నం అనే తేడా లేకుండా ఓటర్ల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. మొత్తం ఓటర్లు 2,41,805 మంది కాగా, 2,25,192 మంది ఓటేశారు. పోలింగ్ (పోస్టల్ బ్యాలెట్ల ఓట్లతో కలిపి) 93.41 శాతం నమోదైంది. 2018 ఎన్నికలతో పోలిస్తే బైపోల్​లో 2.11 శాతం పోలింగ్ పెరిగింది. 2018లో పోలింగ్ 91.30 శాతం మాత్రమే. ఆరు మండలాలు, రెండు మున్సిపాలిటీల్లో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదు కావడంతో ప్రధాన రాజకీయ పార్టీల్లో ఆందోళన నెలకొంది. గురువారం ఓటర్లు క్యూ లైన్లలో ఉండగానే ఎగ్జిట్ పో ల్స్ వెల్లడి కావడం, టీఆర్ఎస్, బీజేపీ మధ్యే గట్టిపోటీ ఉందని సర్వేలు చెప్తున్న నేపథ్యంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. పోలింగ్ హడావుడి ముగియడంతో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీ లీడర్లు, కార్యకర్తలు గ్రామాల వారీగా ఏ పార్టీకి ఎన్ని ఓట్లు పోలయ్యాయనే దానిపై కుస్తీ పడుతున్నారు. గ్రామాల వారీగా పోలైన ఓట్లను ముందేసుకుని పార్టీల వారీగా లెక్కలు కడుతున్నారు. పోలింగ్ జరిగే రోజు కూడా ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడం, డబ్బులిస్తేనే ఓట్లు వేస్తామని పలుచోట్ల ఓటర్లు తిరగబడడం, నాన్ లోకల్ ఓటర్లు మధ్యాహ్నం తర్వాత పోలింగ్ కేంద్రాలకు చేరుకోవడం, ప్రచారంలో భాగంగా పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలన్నింటినీ పరిగణలోకి తీసుకుంటున్నారు. ప్రధాన రాజకీయ పార్టీలకు దీటుగా ఈసారి బీఎస్పీ, డీఎస్పీ, టీజేఎస్ లాంటి పార్టీల ప్రభావం కూడా ఎన్నికల్లో కనిపించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల పైన ఫోకస్ పెట్టిన ఈ పార్టీలు ఏ మేరకు ఓట్లు చీలు స్తాయనే దానిపైనే ప్రధాన పార్టీల్లో టెన్షన్ నెలకొంది. 

బూత్​ల వారీగా లెక్కలు..

మండల, గ్రామ స్థాయిలో పోలింగ్ బూత్​ల వారీగా తమకు ఎన్ని ఓట్లు పోలయ్యాయి ? ఏ గ్రామం అనుకూలంగా ఉంది ? అనే లెక్కలను అంచనా వేసే పనిలో రాజకీయ పార్టీల నేతలున్నారు. ప్రధాన పార్టీలన్నీ బైపోల్ ఎందుకు వచ్చిందో కారణాలు చెప్తూనే హామీలుచ్చాయి. దీంతో పాటు పెద్దమొత్తంలో ప్రలోభాలకు గురిచేశాయి. కానీ, అవి ఎక్కడ ఏ విధంగా పనిచేశాయనే దాని మీదే చర్చ జరుగుతోంది. ఎక్కడెక్కడ తమకు అనుకూలంగా ఓటింగ్ జరిగింది? ఎక్కడ ఇబ్బంది కలిగింది? ఏ సామాజిక వర్గాలు ఎటు వైపు మొగ్గు చూపాయి? దీనికి గల కారణాలు ఏంటి? అనే కోణంలో విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా నాంపల్లి, మర్రిగూడ, నారాయణ పురం, మునుగోడు మండలాల్లో జరిగిన పోలింగ్ పై ఆసక్తి నెలకొంది. చండూరు, చౌటప్పుల్ మున్సిపాలిటీల్లో అర్బన్, రూరల్ ఓటర్లు బీజేపీ, టీఆర్ఎస్ మధ్య చీలిపోయినట్లు తెలుస్తోంది. నారాయణపురం మండలంలో బీజేపీ, టీఆర్ఎస్​, కాంగ్రెస్​ నడుమ ట్రై యాంగిల్ వార్ జరిగినట్లు చెప్తున్నారు. గొడవలు జరిగిన నాంపల్లి, మర్రిగూడ, మునుగోడు మండలాల్లో రెండు పార్టీల ఓట్లు భారీగానే క్రాస్ అయినట్లు తెలుస్తోంది. మంత్రులు, ముఖ్యనేతలు ఇన్​చార్జిలుగా ఉన్న గట్టుప్పుల్, మునుగోడు, నాంపల్లి మండలాల్లో టీఆర్ఎస్ పార్టీ పోలింగ్ ముందు రోజు రాత్రి భారీగానే డబ్బులు పంచినట్లు సమాచారం. బీజేపీ డబ్బు పంపిణీని అడ్డుకోవడంలో అధికార పార్టీ సక్సెస్ అయిందని, పోలింగ్ రోజున రెండో విడత డబ్బులు పంచడం వంటి పలు అంశాలు టీఆర్ఎస్​కు అనుకూలంగా మారాయని ఆ పార్టీ ముఖ్యనేత ఒకరు తెలిపారు.  

 సైలెంట్ ఓటింగ్ ఎవరికి అనుకూలం?

పోలింగ్ పర్సంటేజీని బట్టి చూస్తే పంచాయతీ ఎన్నికల తరహాలో పోలింగ్ జరిగిందని ఎన్నికల ఆఫీసర్లు చెప్తున్నారు. ఏడు మండలాల్లో కూడా 80 శాతం నుంచి 98 శాతం వరకు ఓట్లు పోలయ్యాయి. మెజార్టీ ఓటర్లు తమ వైపే ఉన్నారని టీఆర్ఎస్ నమ్మకంతో ఉంది. కానీ సైలెంట్ ఓటింగ్ జరగడంతో అది తమకే అనుకూలిస్తుందని  బీజేపీ అంచనా వేస్తోంది. రెండు పార్టీల దగ్గర డబ్బులు తీసుకున్న ఓటర్లు చాలా వరకు క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారని అంటున్నారు. దీనివల్ల ఏ పార్టీకి ప్రయోజనం చేకూరుతుందనేది కచ్చితంగా చెప్పలేకపోతున్నారు. కాంగ్రెస్ మహిళా సెంటిమెంట్ ప్రభావం కూడా ఈ ఎన్నికల్లో కనిపించింది. మహిళలకు బొట్టుపెట్టి, గాజులు తొడగడం, కొంగుపట్టి ఓట్లు అడగటం వంటి పలు అంశాలు కాంగ్రెస్​కు కలిసొస్తా యని చెప్తున్నారు. కాంగ్రెస్​కు నియోజకవర్గంలో 50 వేల పైచిలుకు ఓటు బ్యాంకు ఉండగా బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల వైపు ఎంతో కొంత ఓట్లు చీలిపోయినా, 30 వేల వరకు ఓట్లు పోలవుతాయనే ధీమాతో ఉన్నారు. 

అత్యధికంగా నారాయణపురంలో.. తక్కువగా మర్రిగూడలో..  

నారాయణపురం మండలంలో అత్యధిక శాతం పోలింగ్‌ నమోదైంది. ఇక్కడ మొత్తం 36,430 మంది ఓటర్లు ఉండగా, 34,157 మంది ఓటు హక్కును వినియోగించుకోవడంతో 93.76 శాతం పోలింగ్‌ నమోదైంది. అతి తక్కువగా మర్రిగూడ మండలంలో పోలింగ్‌ నమోదైంది. మొత్తం ఓటర్లు 28,309 మంది ఉండగా 25,877 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక్కడ 91.41 శాతం పోలింగ్‌ నమోదైంది. చండూర్‌లో 93.51 శాతం పోలింగ్‌ నమోదు కాగా, చౌటుప్పల్‌లో 93.68 శాతం, గటుప్పల్‌లో 92.61, మునుగోడులో 93.50 , నాంపల్లిలో 92.37 శాతం పోలింగ్‌ నమోదుకావడం విశేషం.