మైక్రోసాఫ్ట్​తో విషెస్ చెప్పండి

మైక్రోసాఫ్ట్​తో విషెస్ చెప్పండి

ఎవరికైనా విషెస్​ చెప్పాలంటే ఫొటోస్ ఎడిట్ చేసి, కార్డ్​లు డిజైన్​ చేయాలి. కానీ, డిజైన్ చేసేంత టైం అందరికీ ఉండదు. అలాంటప్పుడు ఆన్​లైన్ డిజైనింగ్​ టూల్స్ వాడొచ్చు. కాకపోతే వాటిలో మనకు నచ్చినట్లు డిజైన్ టెంప్లేట్​లో మార్పులు చేసే వీలుండదు. ఏవో చిన్న చిన్న మార్పులు మాత్రమే చేసుకోగలం. అయితే, మైక్రోసాఫ్ట్​ కంపెనీ కొత్త డిజైనర్ టూల్​ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేస్తుంది. దీన్ని యూజర్లు ఉచితంగా వాడుకోవచ్చు. పోయినేడాదే దీని గురించి ప్రకటించినా, లేటెస్ట్​గా అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో పోస్టర్స్, ప్రజెంటేషన్స్, డిజిటల్ పోస్ట్ కార్డ్స్, ఇన్విటేషన్లు, సోషల్ మీడియా పోస్టర్లు, గ్రాఫిక్ డిజైన్స్, ఇమేజ్ క్రియేషన్ వంటివి ఈజీగా చేయొచ్చు. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ డిజైనరల్ టూల్ వెబ్ వెర్షన్​లో మాత్రమే అందుబాటులో ఉంది. 

ఇలా వాడాలి

బ్రౌజర్​లో మైక్రోసాఫ్ట్​ డిజైనర్ అని టైప్ చేస్తే టూల్ వెబ్ పేజ్​ కనిపిస్తుంది. దాన్ని ఓపెన్ చేస్తే కుడి వైపు పైభాగంలో ఫ్రీ వెర్షన్ ట్రై చేయమని అడుగుతుంది. మైక్రోసాఫ్ట్ అకౌంట్ వివరాలు నమోదు చేసి లాగిన్ అవ్వాలి. తర్వాత క్రియేట్ చేయాలనుకుంటున్న డిజిటల్ కార్డ్​కి సంబంధించిన టెక్స్ట్​ను రాసి, సెర్చ్​​చేయాలి. ​అప్పుడు దానికి సంబంధించిన ఫొటోలు కింద కనిపిస్తాయి. వాటిలో నచ్చినదాన్ని సెలక్ట్ చేసుకుని, బ్యాక్​గ్రౌండ్ కలర్, ఫొటో, టెక్స్ట్​లో ఏవైనా మార్పులు చేయొచ్చు. లేదా వీటికోసం పక్కనే ఐడియాస్​ పేరుతో డిజైనర్​ కొన్ని సూచనలిస్తుంది. వాటిని వాడొచ్చు. అలానే వాటి సాయంతో ఇమేజ్​ డిజైన్ చేసి, దాన్ని డైరెక్ట్​గా సోషల్ మీడియాలో షేర్ చేయొచ్చు. త్వరలో ఇందులోనే మరిన్ని ఫీచర్స్​ అందుబాటులోకి తీసుకొస్తుందట మైక్రోసాఫ్ట్.

గూగుల్ డ్రైవ్​తో స్కాన్

ఇంతకుముందు ఏదైనా డాక్యుమెంట్ స్కాన్​ చేయాలంటే ఇంటర్నెట్ సెంటర్​కి వెళ్లేవాళ్లు. కానీ, ఇప్పుడు స్మార్ట్​ ఫోన్​తోనే స్కాన్ చేస్తున్నారు. అయితే, స్కాన్ చేయడానికి స్పెషల్ ఫీచర్స్, యాప్స్ ఏం అవసరం లేదు. గూగుల్ డ్రైవ్​తో కూడా స్కాన్ చేయొచ్చు. 

అదెలాగంటే...

ఆండ్రాయిడ్ ఫోన్​లో గూగుల్ డ్రైవ్​ యాప్​ను ఓపెన్ చేయాలి. కింద కుడి వైపున ఉన్న ప్లస్ గుర్తును ట్యాప్ చేయాలి. అప్పుడు మెనూలో కొన్ని ఆప్షన్లు కనిపిస్తాయి. వీటిల్లో స్కాన్ ఆప్షన్​ని సెలక్ట్ చేయాలి. దాంతో కెమెరా దానంతట అదే ఆన్ అవుతుంది. తర్వాత కెమెరా అడిగిన వాటికి (Allow)  అనుమతి ఇవ్వాలి. డాక్యుమెంట్ పూర్తిగా ఫ్రేమ్​లో కనిపించేలా సెట్ చేయాలి. తర్వాత ఫొటో తీయాలి. అప్పుడు ఆ ఫొటోని సేవ్ చేయడానికి కన్ఫర్మ్ (confirm) చేయాలి. అందుకోసం చెక్ మార్క్​ మీద ట్యాప్ చేయాలి. దాంతో గూగుల్ డ్రైవ్ దానంతట అదే క్రాప్ చేసి, లైట్​ను అడ్జస్ట్ చేసుకుంటుంది. అవసరమైతే మాన్యువల్​గా అడ్జస్ట్​ చేయొచ్చు. తర్వాత నెక్స్ట్ బటన్ మీద ప్రెస్ చేయాలి. ఫైల్​కి పేరు పెట్టి, సేవ్​ చేసుకునే ఫోల్డర్​ను సెలక్ట్​ చేయాలి. అప్పుడది పీడీఎఫ్​ రూపంలో సేవ్ అవుతుంది. 

స్పామ్​ కాల్స్ ఇక రావు!

స్పామ్ కాల్స్​ వల్ల చాలామంది ఇబ్బంది పడుతుంటారు. ఆ కాల్స్ గురించి కాస్త అవగాహన ఉన్న కొందరే వాటి నుంచి బయటపడతారు. కానీ, ఇప్పుడు ప్రతి ఒక్కరు ఆ ప్రాబ్లమ్​కి చెక్ పెట్టొచ్చు. అందుకోసం టెలికాం నియంత్రణ సంస్థ (TRAI) ఒక కొత్త రూల్ తీసుకొచ్చింది. దాంతో మొబైల్ యూజర్లు సేఫ్​గా ఉండొచ్చు అంటోంది.

మామూలుగా ఒక వ్యక్తి కాంటాక్ట్​ లిస్ట్​లో లేని నంబర్ నుంచి ఫోన్ వచ్చినా, వెంటనే ఫోన్ లిఫ్ట్ చేస్తారు. అలాంటప్పుడు అవతలి వాళ్లు ఏదైనా బ్యాంక్​ పేరు చెప్పి, లోన్, క్రెడిట్ కార్డ్ ఇస్తాం అంటారు. క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ టైం అయిపోయింది అని చెప్తుంటారు. అది విన్నాక, స్పామ్ కాల్ అని తెలుస్తుంది. మరి ఈ కాల్స్ నుంచి బయటపడాలంటే ట్రాయ్ పెట్టిన రూల్ పాటించాలి. దాన్ని మే 1, 2023 తేదీన అమల్లోకి తీసుకొచ్చారు. 

పనితీరు ఇలా..

ఈ రూల్ ప్రకారం టెలికాం నెట్​వర్క్​ ఆపరేటర్లు (ఎయిర్​టెల్, జియో, వొడాఫోన్ ఐడియా, బీఎస్ఎన్ఎల్) ఫోన్ కాల్స్, మెసేజ్​ సర్వీస్​ల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) బేస్డ్ స్పామ్ ఫిల్టర్స్ వాడాలి. ఈ ఫిల్టర్స్ వేర్వేరు వ్యక్తులు లేదా కంపెనీల నుంచి వచ్చే నకిలీ ఫోన్ కాల్స్​, మెసేజ్​లను గుర్తించి అడ్డుకుంటాయి. దాంతో యూజర్లు స్పామ్ కాల్స్ నుంచి సేఫ్​గా ఉంటారు. ప్రస్తుతం ఎయిర్​టెల్​, జియో కంపెనీలు ఆ సేవలు నడుస్తాయి.