యూట్యూబ్​లో చూసి ఫేక్​నోట్ల తయారీ

యూట్యూబ్​లో చూసి ఫేక్​నోట్ల తయారీ

ఊళ్లలో వ్యాపారులే టార్గెట్​గా సరఫరా
నకిలీ నోట్లను సరఫరా చేస్తున్న రెండు ముఠాల అరెస్ట్​
రూ.17 లక్షల విలువైన ఫేక్​ కరెన్సీ సీజ్​
తప్పించుకు తిరుగుతున్న పాత నేరస్తుడు కూడా అరెస్ట్​

హైదరాబాద్, వెలుగునకిలీ నోట్లు తయారు చేయడమెలాగో యూట్యూబ్​లో చూశారు. ఓ ఆన్​లైన్​ సైట్​లో సెకండ్​ హ్యాండ్​ కలర్​ ప్రింటర్లు, స్కానర్లు కొన్నారు. రూ.100, రూ.200 నోట్లను ప్రింట్​ చేశారు. ఊళ్లలోని వ్యాపారులే టార్గెట్​గా వాటిని చెలామణీ చేశారు. చివరకు పోలీసులకు చిక్కి కటకటాలు లెక్కబెడుతున్నారు. మరో కేసులో హైదరాబాద్​లో రూ.500, రూ.2000 నకిలీ నోట్లను చెలామణీ చేస్తున్న మరో ముఠా పోలీసులకు చిక్కింది. మొత్తంగా రెండు ముఠాల్లోని 13 మందిని అరెస్ట్​ చేసిన పోలీసులు రూ.17.77 లక్షల విలువైన నకిలీ నోట్లు, స్కానర్లు, ప్రింటర్లు, కట్టర్లు, వైట్​ పేపర్​ బండిళ్లను స్వాధీనం చేసుకున్నారు. సంగారెడ్డి, మెహిదీపట్నం, అబిడ్స్​ జగదీశ్​ మార్కెట్​లలో ఫేక్​ కరెన్సీని సరఫరా చేస్తున్న ఆ ముఠాల వివరాలను మంగళవారం టాస్క్​ఫోర్స్​ డీసీపీ రాధాకిషన్​రావుతో కలిసి హైదరాబాద్‌ సీపీ అంజనీ కుమార్​ వెల్లడించారు.

రూ.30 వేలకు రూ.లక్ష నకిలీ నోట్లు

సంగారెడ్డి టౌన్​ బసవేశ్వర్​నగర్​కు చెందిన ఇషాఖ్​ బిన్​ సలే (33), బండారి గౌతమ్​ (28)లు యూట్యూబ్​ వీడియోలు చూసి నకిలీ నోట్లను తయారు చేయడం నేర్చుకున్నారు. ఓ ఆన్​లైన్​ సైట్​లో కలర్​ ప్రింటర్లు, స్కానర్లు కొన్నారు. రూ.100, రూ.200 నకిలీ నోట్లను తయారు చేసి, ఊళ్లలోని వ్యాపారులను టార్గెట్​ చేసుకున్నారు. ఏజెంట్ల ద్వారా రూ.30 వేలకు రూ.లక్ష విలువైన నకిలీ నోట్లను సరఫరా చేశారు. జహీరాబాద్​, సదాశివపేట్​ చుట్టుపక్కల ఉన్న ఊళ్లలో దొంగనోట్లను చలామణీ చేశారు. సంగారెడ్డికి చెందిన మహ్మద్​ సోహైల్​ అలీ (22), టోలీచౌకీకి చెందిన మహ్మద్​ గౌసియుద్దీన్​ (21), అక్బర్​ ఖాన్​ (26), సయీద్​ కాశిఫ్​ బహదూర్​(19)తో పాటు మరో ముగ్గురు మైనర్లతో కలిసి జగదీశ్​ మార్కెట్​లోనూ ఫేక్​ నోట్లను సప్లై చేశారు. అయితే, దొంగనోట్లు మారుస్తున్నారన్న సమాచారం అందుకున్న టాస్క్​ఫోర్స్​ పోలీసులు, మంగళవారం ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. సంగారెడ్డి కేంద్రంగా సాగుతున్న దందాకు చెక్​పెట్టారు. ప్రధాన నిందితులైన ఇషాఖ్​, బండారి గౌతమ్​ను అరెస్ట్​ చేసి రూ.9.27 లక్షల విలువైన ఫేక్​ కరెన్సీతో పాటు ప్రింటింగ్​ సామాన్లను స్వాధీనం చేసుకున్నారు.

డబుల్​ కమీషన్​

హైదరాబాద్​లోని మెహిదీపట్నం కేంద్రంగా రూ.2000, రూ.500 నకిలీ నోట్లను సరఫరా చేస్తున్న మరో ముఠానూ టాస్క్​ఫోర్స్​ పోలీసులు అరెస్ట్​ చేశారు. నకిలీ నోట్లను ప్రింట్​ చేస్తున్న బి.వి. శివసందీప్​ (30), డబుల్​ కమీషన్​కు వాటిని సరఫరా చేస్తున్న అక్బర్​ పాషా (30), మహ్మద్​ మోయిన్​(44),  మహ్మద్​ రజీయుద్దీన్​ (30)ను అరెస్ట్​ చేశారు. వాళ్ల నుంచి రూ.8.5 లక్షల విలువైన ఫేక్​ కరెన్సీతో పాటు ఆరు సెల్​ఫోన్లు, ప్రింటింగ్​ సామాన్లను స్వాధీనం చేసుకున్నారు. ఆ రెండు ముఠాలతో పాటు బంగ్లాదేశ్​ నుంచి నకిలీ నోట్లను సరఫరా చేస్తున్నాడన్న సమాచారంతో పశ్చిమబెంగాల్​ మాల్దాకు చెందిన అమీన్​ ఉల్​ రెహ్మాన్​ అలియాస్​ బబ్లూ (40)ను టాస్క్​ఫోర్స్​ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిపై ఇప్పటికే 8 కేసులు నమోదయ్యాయి. పోయినేడాది ఫిబ్రవరి 15న రూ.4 లక్షల ఫేక్​ కరెన్సీని చలామణీ చేస్తూ దొరికిపోయిన కేసులో నిందితుడిగా ఉన్న అతడు, తప్పించుకు తిరుగుతున్నాడు. మంగళవారం హైదరాబాద్​ పాతబస్తీకి వచ్చాడన్న సమాచారంతో టాస్క్​ఫోర్స్​ పోలీసులు అరెస్ట్​ చేశారు.

మరిన్ని వార్తల కోసం..