వాడి పారేసిన ప్లాస్టిక్‍ బాటిల్స్‌‌ నుంచి టీషర్ట్‌‌ల దారాలు తయారీ

వాడి పారేసిన ప్లాస్టిక్‍ బాటిల్స్‌‌ నుంచి టీషర్ట్‌‌ల దారాలు తయారీ
  • కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్​లో ఉత్పత్తి ప్రారంభం   
  • వాటర్​ క్యాన్​ల నుంచి నవార్​, పాల ప్యాకెట్ల నుంచి టార్పాలిన్​లు తయారీ
  • రోజూ 60 లక్షల పెట్ బాటిల్స్ తో దారాలు 
  • అమెరికా, జర్మనీ, జపాన్ వంటి దేశాలకూ ఎగుమతి
  • సౌత్ ఏషియాలోనే అతి పెద్ద యూనిట్​ వరంగల్​లో పెట్టిన గణేశ్​ ఏకో కంపెనీ
  • పార్కుకు ‘పీఎం మిత్ర’ స్కీంలో అవకాశం కల్పించిన కేంద్రం

వరంగల్‍, వెలుగు: వాడి పారేసిన ప్లాస్టిక్‍ బాటిల్స్‌‌ నుంచి టీషర్ట్‌‌ల దారాలు.. పగిలిన పీవీసీ పైపుల నుంచి బూట్లు తయారు చేసేందుకు వాడే రెగ్జిన్‍.. క్యారీ బ్యాగ్ లతో మ్యాట్ లు.. ఆయిల్, వాటర్‍ క్యాన్లతో మంచం నవార్‍.. పాల ప్యాకెట్‍ కవర్లతో టార్పాలిన్ తయారీ.. ఇలా వరంగల్‍ లోని కాకతీయ మెగా టెక్స్​టైల్ పార్క్ (కేఎంటీపీ)లో ప్లాస్టిక్‍ వ్యర్థాల రీసైక్లింగ్ ప్రారంభమైంది. కేఎంటీపీలో గణేశా ఎకో కంపెనీ ఏర్పాటు చేసిన దక్షిణాసియాలోనే అతిపెద్ద ప్లాస్టిక్ రీసైక్లింగ్ యూనిట్ లో ఇటీవలే ఉత్పత్తిని ప్రారంభించారు. వరంగల్ నుంచి ఆస్ట్రియా, అమెరికా, జర్మనీ, జపాన్ వంటి దేశాలకు బ్రాండెడ్ దుస్తుల తయారీ కోసం దారాలను ఎగుమతి చేస్తున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం కేఎంటీపీకి 2017లో శంకుస్థాపన చేయగా.. ‌ఆరేండ్ల తర్వాత ఇటీవల గణేశా ఎకో కంపెనీ యూనిట్ ను ప్రారంభించింది. దేశవ్యాప్తంగా పబ్లిక్‍ వాడి పడేసిన వాటర్, కూల్‍డ్రింక్‍ బాటిల్స్, పెట్‍ బాటిల్స్, కవర్ లను సేకరిస్తూ వీరు ముడిసరుకుగా వాడుకుంటున్నారు. కేఎంటీపీలో 50 ఎకరాల్లో ఈ యూనిట్ ను ఏర్పాటు చేశారు. ఇందులో 95 శాతం పనులను ఇటలీ, ఆస్ట్రియా వంటి దేశాల నుంచి తీసుకొచ్చిన అధునాతన మెషీన్ ల ద్వారానే చేస్తున్నారు. దేశవ్యాప్తంగా జనం రోడ్లపై పారేసే ప్లాస్టిక్‍ చెత్త బ్రోకర్ల ద్వారా వందలాది లారీల్లో వీరికి చేరుతోంది.  

దారాల తయారీ ఇలా..   

కంపెనీ యూనిట్ కు చేరిన ప్లాస్టిక్ చెత్తను ముందుగా ఓ మెషీన్ లో వేస్తారు. అది కూల్ డ్రింక్ బాటిల్స్, వాటర్ క్యాన్ లు, పీవీసీ పైపులు, పాల ప్యాకెట్లు, ప్లాస్టిక్ సీసాల వంటి వాటిని సపరేట్ చేస్తుంది. ఆ తర్వాత బాటిల్ పై ఉండే కవర్, మూతలను తొలగించి సెకన్ల వ్యవధిలో వేర్వేరుగా పంపిస్తుంది. ఈ ప్రాసెస్ లో ఎక్కడా మట్టి లేకుండా శుభ్రం చేస్తుంది. అనంతరం సలసల కాగే వేడినీళ్లు, కెమికల్ ఉండే కంటైనర్ లోకి ప్లాస్టిక్ బాటిల్స్, క్యాన్స్ చేరి, అక్కడ పూర్తిగా క్లీన్ అవుతాయి. అక్కడి నుంచి మరో యూనిట్‍కు వెళ్లి ప్లాస్టిక్ అంతా చిన్నచిన్న ముక్కలుగా తయారై బయటకొస్తుంది. ఈ ముక్కలను మరో మెషీన్ రీసైక్లింగ్‍ చేసి చిన్న చిన్న ప్లాస్టిక్ బాల్స్ గా మారుస్తుంది. చివరగా ఆ బాల్స్ నుంచే మరో మెషీన్ ద్వారా దారాలను తీస్తారు.   

రీసైక్లింగ్ లో నో వేస్టేజీ  

గణేశా ఎకోకు దేశవ్యాప్తంగా నాలుగు రీసైక్లింగ్ యూనిట్లు ఉన్నాయి. దేశంలోని ప్లాస్టిక్ వేస్ట్ లో 20 శాతం వరకూ ప్లాస్టిక్‍ బాటిల్స్, వాటర్‍, కూల్‍ డ్రింక్‍ బాటిల్స్, పగిలిన పీవీసీ పైపులు, నూనె క్యాన్ ల వంటి ముడిసరుకు కంపెనీ యూనిట్లకు చేరుతోంది. లారీల్లో వచ్చే పెట్‍ బాటిల్స్ రా మెటీరియల్‍ను 250 కిలోల చొప్పున బేల్స్ రూపంలో మార్చి మెషినరీలో వాడుతున్నారు. గణేశా ఎకో కంపెనీ నాలుగు యూనిట్లలో కలిపి సగటున రోజూ 60 లక్షల పెట్‍ బాటిల్స్ ను రీసైక్లింగ్‍ చేసి దారం తయారు చేస్తున్నారు. రీసైక్లింగ్ తర్వాత వ్యర్థాల రూపంలో 01 శాతం కూడా వేస్ట్ ఉండదు. క్వాలిటీ ఆధారంగా షర్టులు, టీషర్ట్ లు, మాస్కులు, డాక్టర్లు వాడే యాప్రాన్స్, రెయిన్‍ కోట్లు, షూస్‍ తయారీకి అవసరమయ్యే రెగ్జిన్ ను తయారు చేస్తున్నామని, అంతర్జాతీయ బ్రాండెడ్ కంపెనీలకు సైతం ఎక్స్ పోర్ట్ చేస్తున్నామని సిబ్బంది వెల్లడించారు. చివరగా క్వాలిటీ తక్కువగా ఉండే శుద్ధి చేసిన పెట్ బాటిల్స్ ను ప్లాస్టిక్ కుర్చీల తయారీకి పంపిస్తామన్నారు.   

‘పీఎం మిత్ర’లో చేర్చిన కేంద్రం  

కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ ను ‘పీఎం మిత్ర స్కీంలో చేర్చుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ప్రకటించింది. 2021 నుంచి 2028 వరకూ రూ. 4,445 కోట్ల నిధులతో తెచ్చిన పీఎం మిత్ర స్కీంలో ఇప్పటివరకూ తెలంగాణ సహా ఏడు రాష్ట్రాల్లోని మెగా టెక్స్ టైల్ పార్కులను చేర్చినట్లు ప్రధాని మోడీ ఈ నెల 18న వెల్లడించారు. 5ఎఫ్ (ఫార్మ్ టు ఫైబర్ టు ఫ్యాక్టరీ టు ఫ్యాషన్ టు ఫారిన్) విజన్ తో చేపట్టిన ఈ స్కీంతో తెలంగాణ, తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో టెక్స్ టైల్ సెక్టార్ కు బూస్ట్ లభిస్తుందని ప్రధాని ట్వీట్ చేశారు. 

పీఎం మిత్రలో చాన్స్ ఇవ్వడం సంతోషం  

కేంద్రం పీఎం మిత్ర స్కీంలో కేఎంటీపీకి అవకాశం కల్పించడం సంతోషంగా ఉంది. అలాగే పూర్తి స్థాయి డెవలప్‍మెంట్‍ కోసం గ్రీన్‍ ఫీల్డ్ లో రూ.500 కోట్లు కేటాయించాలి. కేఎంటీపీ కోసం1,350 ఎకరాలు సేకరించినం. ఇప్పటివరకు రూ.366.75 కోట్లతో పనులు చేపట్టాం. కొంత లేటైనా పరిశ్రమలు మొదలవుతున్నాయి.   
–చల్లా ధర్మారెడ్డి, పరకాల ఎమ్మెల్యే    

దక్షిణాసియాలో ఇదే అతి పెద్దది  

వాడి పారేసిన ప్లాస్టిక్ బాటిల్స్ ద్వారా పొల్యూషన్ లేకుండా క్వాలిటీ దారం తీయడమే గణేశా ఎకో ప్రత్యేకత. దేశవ్యాప్తంగా మాకు ఇలాంటివి నాలుగు ఇండస్ట్రీలు ఉన్నాయి. వరంగల్​లో ఏర్పాటైన మా రీసైక్లింగ్ యూనిట్ దక్షణాసియాలోనే అతి పెద్దది. ఇక్కడ రోజూ 60 లక్షల బాటిల్స్ రీసైక్లింగ్‍ చేస్తున్నాం.  
–రాకేశ్‍, మేనేజర్‍, గణేశా ఎకో పెట్‍ ప్రైవేట్‍ లిమిటెడ్‍