రోస్టర్ పాయింట్లతో మాలలకు తీవ్ర అన్యాయం : మధుబాబు

రోస్టర్ పాయింట్లతో మాలలకు తీవ్ర అన్యాయం : మధుబాబు

నల్గొండ అర్బన్, వెలుగు : ఎస్సీ వర్గీకరణ రోస్టర్ పాయింట్ల కేటాయింపుల్లో మాలలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు లకుమాల మధుబాబు అన్నారు. రోస్టర్ విధానాన్ని వెంటనే సవరించాలని కోరుతూ మాల మహానాడు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం నల్గొండ కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుప్రీంకోర్టు సూచనలను పట్టించుకోకుండా 2011 జనాభా లెక్కలను తీసుకొని జస్టిస్ షమీమ్​ అక్తర్​ ఇచ్చిన తప్పుడు నివేదిక ఆధారంగా ఎస్సీలను కులాలవారీగా వర్గీకరించడం సరికాదన్నారు. మాలలతోపాటు 25 కులాలను గ్రూప్ –3 లో చేర్చి ఐదు శాతం రిజర్వేషన్ ను కల్పించడం అన్యాయమన్నారు. 

గ్రూప్ –1 లో అత్యంత వెనుకబడిన 15 కులాలకు ఒక పర్సెంట్ రిజర్వేషన్ కల్పించారని చెప్పారు. దళితుల జనాభా ప్రకారం ఇచ్చిన హామీ మేరకు 18 శాతం రిజర్వేషన్లు వెంటనే పెంచాలని, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అభయ హస్తం పథకాన్ని ప్రారంభించి అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి జంగాల భిక్షం, మహిళా రాష్ట్ర కార్యదర్శి పాలపాటి సుమలత, జిల్లా నాయకులు రాయల మౌనిక, బూరుగు శ్రీలత, జంగాల శ్రీనివాస్, సల్వాది ప్రభాకర్, సల్వాది రజినీకాంత్, తిరగమల్ల రమేశ్, బూరుగు అంజయ్య, గంటల భిక్షం, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్ పాల్గొన్నారు.