మేం ఎవరికీ తొత్తులం కాదు.. సర్వ స్వతంత్రులం: మొహమ్మద్ మొయిజ్జు

మేం ఎవరికీ తొత్తులం కాదు.. సర్వ స్వతంత్రులం: మొహమ్మద్ మొయిజ్జు

న్యూఢిల్లీ: 'మాల్దీవులు చిన్నదే కావచ్చు. కానీ మేం ఎవరికీ తొత్తులం కాదు. సర్వ స్వతంత్రులం. చిన్న దేశమనే తేలిక భావంతో మమల్ని వేధించాలని చూస్తూ ఊరుకోబోం' అని మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ మొయిజ్జు తేల్చిచెప్పారు. ఐదు రోజుల చైనా పర్యటన ముగించుకుని శనివారం ఆయన స్వదేశానికి తిరిగి వచ్చారు. అనంతరం మాలేలో మీడియాతో మాట్లాడారు.

భారత్, మాల్దీవుల మధ్య నేలకొన్న వివాదంపై పరోక్షంగా స్పందించారు."హిందూ మహాసముద్రం కేవలం ఒక నిర్దిష్ట దేశానికి మాత్రమే చెందినది కాదు. దాని సమీపంలోని అన్ని దేశాలకు చెందినది. మేం ఎవరి పెరట్లో లేము. మాది స్వతంత్ర, సార్వభౌమ రాజ్యం. మా సార్వభౌమత్వాన్ని కాపాడుకునే విషయంలో సాయం అందించేందుకు చైనా ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది. మాల్దీవుల అభివృద్ధికి చైనా 130 మిలియన్ డాలర్ల సాయం అందించింది. ఈ నిధులతో మాలెలో రోడ్లను డెవలప్ చేస్తం. మాల్దీవులకు 9 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తారమైన ప్రత్యేక ఆర్థిక మండలి ఉంది. ఈ సముద్రంలో అత్యధిక వాటాను కలిగి ఉన్న దేశాల్లో మాల్దీవులు ఒకటి" అని మొయిజ్జు పేర్కొన్నారు.