
- వీ6 వెలుగుతో ‘కరీంనగర్ ’ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమరయ్య
- ఒక్క చాన్స్ ఇవ్వండి.. టీచర్ల గొంతుకగా మండలిలో ప్రశ్నిస్త
- కేజీబీవీ, కాంట్రాక్టు టీచర్లకు ఎంటీఎస్ అమలుకుకృషి చేస్తానని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన సీపీఎస్ రద్దు హామీ అమలు కోసం ఆమరణ నిరాహార దీక్షకు సైతం సిద్ధంగా ఉన్నానని కరీంనగర్ – నిజామాబాద్ – ఆదిలాబాద్ – మెదక్ జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమరయ్య స్పష్టం చేశారు. టీచర్లందరికీ పాత పింఛన్ విధానం అమలుకు శక్తి వంచన లేకుండా పోరాడుతానని చెప్పారు.
రాష్ట్రంలో పదేండ్లు పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం, తాజాగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం టీచర్ల సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు. టీచర్లు, లెక్చరర్లు ఆశ్వీర్వదించి 27న జరిగే పోలింగ్ రోజు ఫస్ట్ ప్రియార్టీ ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కరీంనగర్ సెగ్మెంట్ లో ప్రచారం నిర్వహిస్తున్న బీజేపీ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి ‘వీ6 వెలుగు’ కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
వీ6: రాజకీయాల్లోకి ఎందుకొస్తున్నారు ?
మల్క: ఉద్యమాల గడ్డ కరీంనగర్‌కు చెందిన పెద్దపల్లి జిల్లాలోని ఓ మారుమూల గ్రామంలో పుట్టిన. ట్యూషన్ టీచర్ నుంచి తన కష్టార్జితంతో వందలాది మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించే విద్యాసంస్థలు పెట్టేస్థాయికి ఎదిగిన. బీసీ కులానికి చెందిన నేను.. సేవ చేసే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చాను.
ప్రచారం ఎలా సాగుతోంది ?
ఉమ్మడి నాలుగు జిల్లాల పరిధిలో ప్రచారం ముమ్మరంగా సాగుతున్నది. టీచర్ల నుంచి మంచి స్పందన వస్తున్నది. ఇప్పటికే 20 సంఘాల వరకు నాకు మద్దతు ఇచ్చాయి. బీజేపీ అనుబంధ సంఘాలు మద్దతుగా ప్రచారం చేస్తున్నాయి. ఎక్కడికి వెళ్లినా.. సమస్యలు ఏకరువు పెడుతున్నారు. ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని, వారి తరఫున పోరాటం చేస్తానని భరోసా ఇస్తూ ప్రచారంలో ముందుకు సాగుతున్నా.
పోటీలో పీఆర్టీయూ వాళ్లున్నారు..మీకు ఎవరు పోటీ ?
ఎన్నికల్లో పీఆర్టీయూ నుంచే ముగ్గురు పోటీలో ఉన్నారు. వాళ్లలో ఉన్న అంతర్గత.. ఆధిపత్య పోరు నాకు కలిసొస్తున్నది. పీఆర్టీయూ అభ్యర్థి మహేందర్‌రెడ్డి రూ.12 కోట్లు ఇచ్చి సీటు కొనుకున్నారని సిట్టింగ్ ఎమ్మెల్సీ, మరో అభ్యర్థి ఆ సంఘం నేత రఘోత్తంరెడ్డి బహిరంగంగానే ఆరోపణలు చేశారు. ఎన్నికల్లో టికెట్ రాకపోవడంతో పీఆర్టీయూకు రాజీనామా చేసి మరో నేత పోటీలో ఉన్నారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి తొత్తులుగా మారిపోయారంటూ టీచర్లే ఆరోపిస్తున్నారు. పీఆర్టీయూ కేడర్ అంతా నాకే మద్దతిస్తున్నది.
కార్పొరేటు అనే ముద్రపై.. ఏం అంటారు ?
రాజకీయాల్లో ఉన్న చాలామంది రెడ్డిలు విద్యావ్యాపారాల్లో ఉన్నారు. మాజీ మంత్రి మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి, తీగల కృష్ణారెడ్డి.. ఇలా చాలా మందికి విద్యాసంస్థలున్నాయి. కానీ, కేవలం బీసీ కులం నుంచి వచ్చిన నన్ను మాత్రమే కార్పొరేట్ అనడం కరక్టేనా? 37 మందితో స్కూలు ప్రారంభించి.. తల్లిదండ్రుల విశ్వాసంతో విస్తరించిన పల్లవి విద్యాసంస్థలు కార్పొరేట్ అవుతాయా? అనాథలు, ప్రతిభ ఉన్న పేద పిల్లలకు పైసా ఫీజు తీసుకోకుండా చదువు చెప్తున్నాం.
సరిగా మాట్లాడట్లేదనే కామెంట్లపై మీరేమంటారు. ?
ఇప్పటి వరకు గెలిచిన పీఆర్టీయూ ఎమ్మెల్సీలంతా బాగా మాట్లాడేవారే కదా.. మరి వాళ్లు టీచర్ల సమస్యలు ఎందుకు పరిష్కరించలేదు? మభ్యపెట్టి పబ్బం గడుపుకునే వ్యక్తిని కాదు. మాటలతో నాకు పనిలేదు. చేతల్లోనే చేసి చూపుతా. గెలిచాక ఈ విషయం అందరికీ అర్థమవుతుంది. నేను స్పందిస్తున్న తీరుతోనే నాకు మద్దతు లభిస్తున్నది. గెలిపిస్తే మండలిలో టీచర్ల గొంతుకగా మారుతా.
గెలిస్తే ఏం చేస్తారు.?
టీచర్లందరికీ 4 డీఏలు, మెడికల్ బిల్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్.. ఏండ్ల నుంచి పెండింగ్‌లో ఉన్నాయి. టీచర్ల బిల్స్ వెంటవెంటనే రిలీజ్ చేయించేలా కృషి చేస్త. ప్రతిఏటా బదిలీలు, ప్రమోషన్లు కల్పించేలా పోరాడుతా. కేజీబీవీ, యూఆర్ఎస్ టీచర్లకు ఎంటీఎస్ అమలు, గురుకులాలు–మోడల్ స్కూళ్లు, ఎయిడెడ్ స్కూళ్లలో 010 పద్దు కింద జీతాలు వచ్చేలా కృషి చేస్త.