- ఐద్వా జాతీయ నాయకురాలు పుణ్యవతి
ముషీరాబాద్, వెలుగు: తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని నడిపించిన ధీర వనిత మల్లు స్వరాజ్యం అని, ఆమె జీవితమే ఒక పోరాటమని ఐద్వా జాతీయ నాయకురాలు ఎస్.పుణ్యవతి కొనియాడారు. ఐద్వా ఆధ్వర్యంలో మల్లు స్వరాజ్యంపై రూపొందించిన ది ఫైర్ ఆఫ్ డిఫెన్స్ పుస్తకాన్ని ఆదివారం బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆవిష్కరించారు. భూమిక ఎడిటర్ సత్యవతి మాట్లాడుతూ.. స్వరాజ్యం ఎన్నో గ్రామాలు, తండాల్లో కాలినడకన తిరుగుతూ ఉయ్యాల పాటలతో ప్రజలను చైతన్యం చేశారని చెప్పారు. ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి మాట్లాడుతూ.. స్వరాజ్యం జీవిత చరిత్రపై ఇంగ్లిష్లో పుస్తకం రావడం సంతోషకరమని, దీని ద్వారా ఆమె గురించి దేశవ్యాప్తంగా తెలుస్తుందన్నారు. రాష్ట్ర అధ్యక్షురాలు అరుణజ్యోతి, సరళ, జ్యోతి, ఇందిర, రత్నమాల, వినోద, శశికళ, వరలక్ష్మి, షబానా బేగం, విమల తదితరులున్నారు.
