సిటిజన్ షిప్ యాక్ట్ ను మేం అమలు చేయం

సిటిజన్ షిప్ యాక్ట్ ను మేం అమలు చేయం

న్యూఢిల్లీ / కోల్‌కతా / తిరువనంతపురం / చండీగఢ్​:   సిటిజన్​షిప్ యాక్ట్​ను మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న వెస్ట్ బెంగాల్ సీఎం మమత బెనర్జీ.. ఆ చట్టాన్ని తమ రాష్ర్టంలో అమలు చేసేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోబోమని స్పష్టం చేశారు. పౌరసత్వ చట్టాన్ని వ్యతిరేకిస్తూ రాష్ర్టవ్యాప్తంగా ర్యాలీలు చేయనున్నట్లు ప్రకటించారు. ‘‘పార్లమెంట్​లో పాస్ అయినా సరే.. సిటిజన్​షిప్ చట్టాన్ని బెంగాల్​లో అనుమతించం. బీజేపీయేతర రాష్ట్రాలపై రాజ్యాంగ విరుద్ధమైన చట్టాన్ని రుద్దేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది” అని మమత ఆరోపించారు. ‘‘ఇండియాను పౌరసత్వ చట్టం విభజిస్తుంది. మేం అధికారంలో ఉన్నంత వరకూ.. రాష్ర్టంలోని ఏ ఒక్క వ్యక్తి కూడా దేశం విడిచి వెళ్లాల్సిన పరిస్థితి రానివ్వం” అని చెప్పారు. ఢిల్లీలో జరగనున్న మహాత్మా గాంధీ 150వ జయంతి వేడుకలకు వెళ్లబోనని ఆమె చెప్పారు. ప్రత్యేకంగా ఓ కమ్యూనిటీకి చెందిన వ్యక్తులపై వివక్ష చూపే రాజ్యాంగ విరుద్ధమైన చట్టానికి తమ రాష్ట్రంలో స్థానం లేదని కేరళ సీఎం పినరయి విజయన్ స్పష్టం చేశారు. ‘‘మతం, కులం, భాష, సంస్కృతి, జెండర్, వృత్తి వంటి వాటితో సంబంధంలో లేకుండా దేశంలోని ప్రతి వ్యక్తికి పౌరసత్వ హక్కును రాజ్యాంగం కల్పిస్తుంది. ఇప్పుడు తెచ్చిన చట్టం.. పౌరసత్వ హక్కును చెల్లనిదానిగా మారుస్తోంది. మతం ఆధారంగా పౌరసత్వాన్ని నిర్ణయించే చర్య రాజ్యాంగాన్ని తిరస్కరించడంతో సమానం’’ అని  ఆయన అన్నారు.

రాష్ర్ట అసెంబ్లీలో తమ పార్టీకి ఉన్న మెజారిటీతో సిటిజన్​షిప్ చట్టం అమలు కాకుండా అడ్డుకుంటామని పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ చెప్పారు. ‘‘ఈ చట్టం ఉద్దేశం విభజించడమే. దేశ ప్రజలను మతపరమైన మార్గాల్లో విభజించడానికి ప్రయత్నించే ప్రతి చట్టం కూడా.. ఇల్లీగల్, అనైతికం” అని చెప్పారు. మరోవైపు,  సిటిజన్​షిప్ (సవరణ) యాక్ట్​ను అన్ని రాష్ర్టాలు అమలు చేయాల్సిందేనని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ చట్టం అమలును నిలిపేసే అధికారం రాష్ర్టాలకు లేదని స్పష్టం చేశాయి. పౌరసత్వ చట్టంపై ఈశాన్య రాష్ర్టాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో క్లారిటీ ఇచ్చాయి. ‘‘రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్​లో పేర్కొన్న కేంద్ర జాబితా కింద ఏర్పాటు చేసిన చట్టాన్ని అమలు చేయబోమని చెప్పే అధికారం రాష్ర్టాలకు లేదు” అని హోంశాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.