సోషల్ మీడియా ఫ్రెండ్.. రూ.45 లక్షలు కాజేశాడు..

సోషల్ మీడియా ఫ్రెండ్.. రూ.45 లక్షలు కాజేశాడు..

ముంబైకి చెందిన ఓ మహిళతో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో స్నేహం చేసి రూ. 45 లక్షల విలువైన నగదు, నగలను ఒక వ్యక్తి మోసగించినట్లు పోలీసులు తెలిపారు. సన్‌పడ ప్రాంతంలో నివాసముంటున్న ఈ మహిళ 2020లో తన భర్త నుంచి విడిపోయింది. ఆమెకు ఒక కుమారుడు కూడా ఉన్నాడు.

ముంబైలోని కఫ్ పరేడ్‌కు చెందిన ఓ వ్యక్తి.. ఆ మహిళకు ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయం అయ్యాడు. కాలక్రమేణా వారిద్దరి మధ్య కుదిరిన స్నేహం.. పెళ్లికి దారి తీసింది. ఎఫ్‌ఐఆర్‌ నివేదిక ప్రకారం ఆ వ్యక్తి తరచూ మహిళ ఇంటికి వెళ్లేవాడు, వారిద్దరూ వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత అతను, ఆమెను కొట్టడం, దుర్భాషలాడడం ప్రారంభించాడు. ఆమె కొడుకును చంపుతానని కూడా బెదిరించాడు. అంతేకాదు రూ.36 లక్షల నగదుతో సహా మొత్తం రూ.45 లక్షల విలువైన డబ్బు, బంగారు ఆభరణాలను కూడా తీసుకున్నాడని మహిళ ఫిర్యాదులో తెలిపినట్టు పోలీసులు చెప్పారు.

మహిళ ఫిర్యాదు ఆధారంగా నిందితుడిపై భారతీయ శిక్షాస్మృతి సెక్షన్ 406 (నేరపూరిత విశ్వాస ఉల్లంఘన), 323 (స్వచ్ఛందంగా గాయపరచడం), 494 (భర్త లేదా భార్య జీవితకాలంలో మళ్లీ పెళ్లి చేసుకోవడం), 504 కింద సంపాద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుపై ప్రస్తుతం విచారణ జరుగుతోందని పోలీసులు తెలిపారు.