ప్రాణం తీసిన క్రిప్టో కరెన్సీ

ప్రాణం తీసిన క్రిప్టో కరెన్సీ

ఖమ్మం / సూర్యాపేట, వెలుగు: క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టి నష్టపోయిన ఓ వ్యక్తి ప్రాణం తీసుకున్నాడు. ఖమ్మం నగరానికి చెందిన గుండెమెడ రామలింగస్వామి (36) బుధవారం సూర్యాపేటలోని ఓ లాడ్జిలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పార్ట్​నర్ల ఒత్తిళ్లు, బలవంతంగా చెక్కుల మీద సంతకాలు తీసుకోవడంతో కుంగిపోయిన ఆయన సూసైడ్​ చేసుకున్నాడు. ఖమ్మం బైపాస్​ రోడ్​లో ఉండే రామలింగస్వామి.. తన స్నేహితులు ఆనంద్​ కిషోర్​, నరేశ్​తో కలిసి ఇటీవల క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెట్టారు. ట్రస్ట్​ వాలెట్​ అనే యాప్​లో ముగ్గురు కలిసి తొలుత రూ.10 లక్షలు పెట్టి క్రిప్టోను కొన్నారు. కొద్ది రోజుల పాటు పెట్టిన దానికి రెట్టింపు సొమ్ము రావడంతో.. తెలిసినవాళ్లు, మరికొంతమంది స్నేహితులతోనూ రూ.కోటి 30 లక్షల దాకా ఇన్వెస్ట్​ చేయించారు. మొదటి మూడు వారాలు బాగానే లాభాలు వచ్చాయి. అయితే, డబ్బును డ్రా చేసుకోవడంలో చిక్కులు ఏర్పడ్డాయి. రూ.60 లక్షలు డ్రా అయినా.. రూ.70 లక్షలు తిరిగి రాలేదు. దీంతో ఇన్వెస్ట్​ చేసిన వాళ్లు తమ డబ్బును తిరిగిచ్చేయాలంటూ రామలింగస్వామిపై ఒత్తిడి చేశారు. ఏపీలోని కృష్ణా జిల్లా జొన్నలగడ్డ, శివాపురం గ్రామాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు తాము పెట్టిన రూ.23 లక్షలు తిరిగిచ్చేయాలని స్వామిపై ఒత్తిడి తెచ్చారు. దీనిపై వారి మధ్య మూడు రోజుల కిందట గొడవ జరిగినట్టు తెలుస్తోంది. వాళ్లిద్దరూ స్వామికి చెందిన రూ.40 లక్షల విలువైన కియా కారును లాక్కోవడంతో పాటు ఖాళీ చెక్కులపై సంతకాలు పెట్టించుకుని వెళ్లారని కుటుంబ సభ్యులు చెప్తున్నారు.  

హైదరాబాద్​ వెళ్తున్నానని..
హైదరాబాద్​కు మంగళవారం బైకుపై రామలింగస్వామి ఖమ్మం నుంచి బయల్దేరాడు. సూర్యాపేటలోని ఓ లాడ్జిలో రూమ్​ తీసుకున్నాడు. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. రూమ్​ నుంచి వాసన రావడంతో లాడ్జి నిర్వాహకులు.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. గదిలో సూసైడ్​ నోట్​తో పాటు ఆయన డైరీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. పోస్ట్​మార్టం తర్వాత మృతదేహాన్ని అప్పగించారు. రామలింగస్వామి తండ్రి వెంకటనారాయణ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. అయితే, రెండేండ్ల క్రితం ఖమ్మంలోని శ్రీనివాసనగర్​లో వివాన్​ పేరుతో రామలింగస్వామి స్కూల్​ను పెట్టారు. అప్పటికే కరోనా తీవ్రత పెరగడం..లాక్​డౌన్​ అమల్లోకి రావడంతో స్కూల్​ ప్రారంభం ఆలస్యమైంది. కరోనా తగ్గాక అడ్మిషన్లు తక్కువగా రావడం, అనుకున్నంతగా సక్సెస్​ కాకపోవడం వంటి కారణాలతోనూ ఆయన నష్టపోయినట్టు తెలుస్తోంది. దాంతో పాటు క్రిప్టో నష్టాలూ ఆయన్ను కుంగదీశాయని చెప్తున్నారు.  

ఒత్తిడి తట్టుకోలేకే..
క్రిప్టోలో ఇన్వెస్ట్​ చేసిన వారితో పాటు తానూ నష్టపోయానని, ఎవరికీ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని సూసైడ్​ లెటర్​లో రామలింగస్వామి రాశారు. ఎవరికివ్వాల్సినవి వాళ్లకు ఇచ్చేశానని పేర్కొన్నారు. పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని, ధైర్యంగా ఉండాలని తన భార్యకు సూచించారు. తన తండ్రి, నాగు, నర్సింహారావు సపోర్ట్​గా ఉంటారని చెప్పారు. ఇలా చేయాల్సి వస్తుందని కలలో కూడా అనుకోలేదని, ఒత్తిడి తట్టుకోలేకే ప్రాణం తీసుకుంటున్నానని రాశారు. స్కూల్  వల్ల కూడా నష్టపోయానని సూసైడ్​ లెటర్​లో పేర్కొన్నారు.