అయ్యో పాపం..! ఉప్పొంగిన వాగు.. దాటలేక వ్యక్తి మృతి.. ఆసిఫాబాద్ జిల్లాలో ఘటన

అయ్యో పాపం..!  ఉప్పొంగిన వాగు.. దాటలేక వ్యక్తి మృతి.. ఆసిఫాబాద్ జిల్లాలో ఘటన

 

  • వంతెన ఉంటే ప్రాణాలు దక్కేవని కుటుంబం, గ్రామస్తుల ఆవేదన 
  •  ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం జనకాపూర్ లో ఘటన

ఆసిఫాబాద్, వెలుగు: అనారోగ్యానికి గురైన వృద్ధుడిని ఆస్పత్రికి తీసుకెళ్తుండగా.. వాగు దాటేందుకు యత్నిస్తుండగా మధ్యలోనే ప్రాణాలు కోల్పోయిన ఘటన కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో జరిగింది. కెరమెరి మండలం జనకాపూర్ గ్రామానికి చెందిన పవార్ బిక్కునాయక్(78)కు చాతిలో నొప్పి రావడంతో గురువారం మధ్యాహ్నం కుటుంబీకులు, గ్రామస్తులు ఆటోలో ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించారు.  

భారీ వర్షాల కారణంగా అనార్ పెల్లి వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో దాటలేక తిరిగి ఇంటికి వెళ్లిపోయారు.  శుక్రవారం ఉదయం మళ్లీ అతనికి చాతి నొప్పి తీవ్రం కావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు బయలుదేరారు. వాగు ప్రవాహం తగ్గకపోవడంతో భుజాలపై మోసుకుంటూ దాటేందుకు ప్రయత్నిస్తుండగా మధ్యలోనే బిక్కు నాయక్ చనిపోయాడు.  వాగుపై వంతెన ఉండి ఉంటే ప్రాణాలు దక్కేవని కుటుంబ సభ్యులు బోరున విలపించారు.