ప్లీజ్ ఒక్కసారి కలవాలి: సల్మాన్ ఖాన్‎ అపార్ట్‎మెంట్‎లోకి దూరిన ఆగంతకుడు

ప్లీజ్ ఒక్కసారి కలవాలి: సల్మాన్ ఖాన్‎ అపార్ట్‎మెంట్‎లోకి దూరిన ఆగంతకుడు

ముంబై: లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపుల నేపథ్యంలో బాలీవుడ్ కండల వీరుడు, స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇంట్లోకి ఆగంతకుడు దూరడం తీవ్ర కలకలం రేపింది. మంగళవారం (మే 20) ముంబై బాంద్రాలోని సల్మాన్ ఖరీదైన గెలాక్సీ అపార్ట్‌మెంట్‌లోకి  ఓ యువకుడు అక్రమంగా ప్రవేశించాడు. వెంటనే అప్రమత్తమైన హీరో భద్రతా సిబ్బంది యువకుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. 

పోలీసుల వివరాల ప్రకారం.. 2025, మే 20వ తేదీ ఉదయం ఛత్తీస్‌గఢ్‌కు చెందిన జితేంద్ర కుమార్ సింగ్ ముంబైలోని సల్మాన్ గెలాక్సీ అపార్ట్‌మెంట్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించాడు. సల్మాన్ Y+ భద్రతా విభాగంలోని పోలీసులు యువకుడు అడ్డుకుని అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించారు. దీంతో ఆగ్రహానికి గురైన జితేంద్ర సింగ్ పోలీసులతో వాగ్వాదానికి దిగి తన ఫోన్ నేలకేసి కొట్టి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కానీ రాత్రి మళ్లీ  జితేంద్ర కుమార్ సింగ్ సల్మాన్ నివాసం వద్దకు వచ్చాడు. 

గెలాక్సీ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న మరొక వ్యక్తికి చెందిన కారులో అక్రమంగా సల్మాన్ నివాసంలోకి వెళ్లేందుకు ప్రయత్నించాడు. కానీ మరోసారి జితేంద్రను సల్మాన్ భద్రత సిబ్బంది అడ్డుకున్నారు. వద్దని వారిస్తున్నా పదే పదే అక్రమంగా సల్మాన్ ఇంట్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తుండటంతో యువకుడిని అదుపులోకి తీసుకుని బాంద్రా పోలీసులకు అప్పగించారు. 

సల్మాన్ భద్రతా సిబ్బంది ఫిర్యాదు మేరకు జితేంద్రపై బాంద్రా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పదే  పదే సల్మాన్ ఇంట్లోకి ప్రవేశించాడనికి గల కారణం ఏంటన్న దానిపై ఆరా తీశారు. సల్మాన్‌ను ఒక్కసారి మాత్రమే కలవాలని అనుకున్నానని, కానీ ఆయన భద్రతా సిబ్బంది కలిసేందుకు అనుమతించలేదని.. అందుకే దాక్కొని వెళ్లడానికి ప్రయత్నిస్తు్న్నానని నిందితుడు పోలీసులతో చెప్పాడు. 

కాగా, కృష్ణ జింకల వేట కేసులో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‎తో సల్మా్న్ ఖాన్‎కు థ్రెట్ ఉండటంతో పోలీసులు ఈ ఘటనను సీరియస్‎గా తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సల్మాన్ నివాసం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇప్పటికే సల్మాన్ ఖాన్‎కు కేంద్ర ప్రభుత్వం వై ప్లస్ సెక్యూరిటీ కల్పిస్తోన్న విషయం తెలిసిందే. జితేంద్ర కుమార్ సింగ్‎కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‎తో ఏమైనా లింకులు ఉన్నాయా అన్న దానిపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.