
- యూపీలో దారుణం
లక్నో: తాగుడుకు బానిసైన ఓ తండ్రి తన కన్న కూతుర్లిద్దరిని బండరాయితో కొట్టి దారుణంగా చంపేసిన ఘటన యూపీలో జరిగింది. సంత్కబీర్ నగర్ జిల్లాలోని జైనాబ్ అనే 40 ఏళ్ల వ్యక్తి తన ఇద్దరు మైనర్ కుమార్తెలను బండరాయితో కొట్టి చంపేశాడని పోలీసులు మీడియాకు వెల్లడించారు. ఆదివారం రాత్రి బెల్హెర్ పోలీసు సర్కిల్ పరిధిలోని బాబెతు గ్రామంలో ఈ ఘటన జరిగిందని తెలిపారు. జైనాబ్ తాగుడుకు బానిస కావడంతో భార్య విడాకులు తీసుకుని వెళ్లిపోయింది. కూతుర్లు అల్లుమిన్ నిషా(5), రూబీ(3) తో కలిసి నివాసం ఉంటున్నాడు. ఆదివారం రాత్రి పీకలదాకా తాగి వచ్చి ఇద్దరు చిన్నారులను బండరాయితో కొట్టి హత్య చేశాడని పోలీసు సూపరింటెండెంట్ బ్రిజేష్ సింగ్ చెప్పారు. పిల్లలు రక్తపు మడుగులో కొన ఊపిరితో కొట్టుకుంటుండగా జైనాబ్ చలనం లేకుండా ఉన్నాడని, అతడ్ని అరెస్టు చేశామని చెప్పారు.