
కాగజ్ నగర్, వెలుగు : తనకు పెండ్లి చేయాలని అన్న, తల్లితో పోరు పెట్టాడు. తన ఆస్తి తనకు ఇవ్వాలని పట్టుబట్టాడు. దీంతో ఆ అన్న తమ్ముడిని సోమవారం మంచం పట్టేతో కొట్టి చంపేశాడు. సీఐ రవీందర్ కథనం ప్రకారం...కాగజ్‌నగర్‌లోని నౌగామ్బస్తీ ముదిరాజ్కాలనీకి చెందిన రాజు , వెంకటేశ్(29) అన్నదమ్ములు. ఇద్దరికీ పెండ్లిళ్లు కాలేదు. వెంకటేశ్ గోదావరిఖనిలో ఉంటూ పని చేసుకుంటున్నాడు. ఆదివారం సాయంత్రం కాగజ్‌నగర్‌లోని ఇంటికి వచ్చాడు. అన్న, తల్లితో తనకు పెండ్లి చేయాలని కోరాడు. ఈ క్రమంలో అన్నాదమ్ముళ్ల మధ్య మాటామాట పెరిగింది. సోమవారం ఉదయం కూడా ఈ విషయమై వాదులాడుకున్నారు. దీంతో తమ్ముడు పెండ్లి చేయాలని అడుగుతున్నాడని, అలా జరిగితే సగం ఆస్తి పోతుందని భావించి మంచం పట్టేతో తలమీద కొట్టాడు. దీంతో వెంకటేశ్అక్కడికక్కడే కుప్పకూలి చనిపోయాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు. ఘటన స్థలాన్ని డీఎస్పీ కరుణాకర్ పరిశీలించారు.