సర్ ప్రైజ్.. అంత్యక్రియలు చేసిన రెండు రోజుల తర్వాత తిరిగొచ్చిన వ్యక్తి

సర్ ప్రైజ్.. అంత్యక్రియలు చేసిన రెండు రోజుల తర్వాత తిరిగొచ్చిన వ్యక్తి

ఒక వ్యక్తి మృతదేహానికి అతని కుటుంబసభ్యులు ఖననం చేసిన రెండు రోజుల తర్వాత మళ్ళీ తిరిగొచ్చిన ఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది. కాన్పూర్ కి చెందిన అహ్మద్ హసాన్ ఒక చిన్న విషయంలో తన భార్యతో గొడవపడి ఆగష్టు 2న ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అతడు రెండు రోజుల వరకు ఇంటికి తిరిగిరాలేదు. దాంతో అతని కుటుంబసభ్యులు చకేరి పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు. అయితే పోలీసులకు ఆగష్టు 5న గుర్తుపట్టలేని స్థితిలో ఉన్న ఒక మృతదేహం లభించింది. దాంతో హసాన్ కుటుంబసభ్యులను పిలిచి.. డెడ్ బాడీని గుర్తించాల్సిందిగా కోరారు. డెడ్ బాడీని చూసిన హసాన్ భార్య నగ్మా మరియు అతని సోదరులు ఆ డెడ్ బాడీ హసాన్ దేనని ధృవీకరించారు. దాంతో హాసాన్ కుటుంబసభ్యులు ఆ మృతదేహాన్ని తీసుకొని వెళ్లి అదేరోజు కల్నల్ గంజ్ ప్రాంతంలో అంత్యక్రియలు చేశారు. కాగా.. రెండు రోజుల తర్వాత అంటే ఆగష్టు 7న ఊహించని విధంగా హాసాన్ ఇంటికి తిరిగొచ్చాడు. దాంతో అతని కుటుంబసభ్యులు మరియు చుట్టుపక్కల వాళ్లు అయోమయానికి గురయ్యారు.

హసాన్ ఇంటికొచ్చే సమయానికి ఇంట్లో ఎవరూ లేరు. అయితే హసాన్ రాకను గమనించిన చుట్టుపక్కల వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు వచ్చి.. హసాన్ ను తీసుకెళ్లారు. ‘నేను నా భార్యతో గొడవపడి ఇంటి నుంచి వెళ్లిపోయాను. అయితే ఒక వ్యక్తి నాకు ఫ్యాక్టరీలో పని ఇప్పించడంతో అక్కడే ఉన్నాను. పని పూర్తయిన తర్వాత డబ్బులు తీసుకొని ఇంటికి వచ్చాను. అయితే నా కుటుంబసభ్యులు నేను చనిపోయాననుకొని ఒక మృతదేహానికి అంత్యక్రియలు చేశారని అప్పుడే తెలిసింది. నేను బతికే ఉన్నాను’ అని హాసాన్ పోలీసులతో తెలిపారు.

చనిపోయాడనుకున్న తన భర్త ఇంటికి తిరిగి రావడం సంతోషంగా ఉందని హసన్ భార్య నగ్మా అన్నారు. ‘నేను, నా భర్త ఒక చిన్న సమస్యపై గొడవపడ్డాం. పోలీసులు మమ్మల్ని పిలిచి మృతదేహాన్ని గుర్తించమన్నప్పడు నాకు అనుమానంగానే అనిపించింది. కానీ, నా భర్త సోదరులు కన్ఫర్మ్ చేయడంతో నేను కూడా ధృవీకరించాను. నా భర్త తిరిగి వచ్చినందుకు నేను, నా కుటుంబసభ్యులు చాలా సంతోషంగా ఉన్నాం’ అని ఆమె తెలిపింది.

ఈ విచిత్ర ఘటనపై కాన్పూర్ సీనియర్ పోలీస్ సూపరింటెండెంట్ మాట్లాడుతూ.. హసాన్ కుటుంబసభ్యులు మృతదేహాన్ని గుర్తించే అయోమయంలోనే ఈ పని చేశారు. అందుకే అతని కుటుంబంపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదని మేం భావిస్తున్నాం. అయితే హసాన్ కుటుంబం ఖననం చేసిన మృతదేహం ఎవరిదో గుర్తించడం ఇప్పుడు సవాలుగా మారింది. ఖననం చేసిన మృతదేహానికి సంబంధించిన పోస్టర్లను వివిధ ప్రదేశాలలో అతికిస్తున్నాం. మృతదేహానికి పోస్ట్‌మార్టం చేస్తున్నప్పుడు వైద్యులు డీఎన్‌ఏ పరీక్ష చేశారా లేదా తెలుసుకోమని ఎస్పీని ఆదేశించాను’ అని ఆయన తెలిపారు.

For More News..

నేడు రైతుల బ్యాంకు ఖాతాల్లోకి పీఎం కిసాన్ నగదు

దేశంలోనే మొదటిసారి అత్యధిక కరోనా కేసులు

విజయవాడలో కరోనా ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం