
జైపూర్: స్నేహితుల మధ్య వాగ్వాదం ఓ మహిళ ప్రాణం తీసింది. రాజస్థాన్ జైపూర్‌లోని జవహర్ సర్కిల్ ప్రాంతంలోని ఓ హోటల్ వద్ద మంగళవారం ఉదయం ఈ ఘటన జరిగింది. మంగేశ్ అనే యువకుడు తన స్నేహితురాలితో కలిసి డ్రింక్స్ తాగాడు. ఆపై ఏంజరిగిందో తెలియదు కానీ, వాళ్లిద్దరూ కలిసి ఉమా సుతార్ అనే యువతిపై కామెంట్ చేయడం మొదలు పెట్టారు. దీనికి ఉమ స్నేహితుడైన రాజ్‌కుమార్ అడ్డు చెప్పాడు. దీంతో మంగేశ్, అతని స్నేహితురాలు వాగ్వాదానికి దిగారు. ఆపై అక్కడి నుంచి కారులో వెళ్లిపోయేందుకు ప్రయత్నిస్తుండగా ఉమతో పాటు ఆమె ఫ్రెండ్ కారును అడ్డుకునేందుకు ప్రయత్నించారు. మంగేశ్ కారు ఆపకుండా వాళ్లిద్దరినీ ఢీకొట్టి వెళ్లిపోయాడు. దీంతో అక్కడికక్కడే ఉమ ప్రాణాలు కోల్పోగా, రాజ్‌కుమార్ గాయాలతో ఆస్పత్రిలో ట్రీట్మెంట్ పొందుతున్నాడు. పరారీలో ఉన్న మంగేశ్ కోసం గాలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.