స్ట్రీట్​ లైట్లు వెలుగుతలేవ్ .. సిటీలో మెయిన్ రోడ్ల నుంచి కాలనీ రోడ్ల వరకు ఇదే పరిస్థితి 

స్ట్రీట్​ లైట్లు వెలుగుతలేవ్ .. సిటీలో మెయిన్ రోడ్ల నుంచి కాలనీ రోడ్ల వరకు ఇదే పరిస్థితి 
  • లైట్ల స్టాక్ మెయింటెన్ చేయని ఏజెన్సీలు రూ. కోట్లలో ఫైన్లు వేసినా మారడంలేదు
  • ఎక్కడా సమస్య లేదంటున్న అధికారులు
  • రివ్యూ మీటింగ్ లో ఇన్ చార్జ్ మంత్రిని తప్పుదోవ పట్టించిన వైనం

హైదరాబాద్, వెలుగు: సిటీలో స్ట్రీట్​లైట్ల నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైంది.  కొన్నిచోట్ల టైమర్లు పని చేయక 24 గంటలు వెలుగుతుంటే.. ఇంకొన్ని చోట్ల రాత్రి పూట అసలే వెలగట్లేదు. ఆరుదాటితే ఆ ప్రాంతాల్లోని కాలనీలు, బస్తీల రోడ్లు చీకట్లో ఉంటున్నాయి.  2 నుంచి5 శాతం స్ట్రీట్​లైట్లు మాత్రమే పని చేయడంలేదని అధికారులు చెబుతుండగా.. దాదాపు 15 నుంచి 20 శాతం లైట్లు పని చేయడంలేదు.

 వీధిలైట్లు లేక జనం ఇబ్బందులు పడుతున్నారు. చాలా చోట్ల యాక్సిడెంట్లు కూడా చోటు చేసుకుంటున్నాయి. రూ.217.12 కోట్లతో ఎల్ఈడీ లైట్లను బల్దియా ఏర్పాటు చేసింది. వీటిని టెక్నాలజీతో పర్యవేక్షించే  అధికారులు 98 శాతం వెలుగుతున్నాయని చెబుతుండగా ఆ పరిస్థితి ఎక్కడా కనిపించడంలేదు.  రద్దీగా ఉండే రోడ్లలో కనీసం వీధిలైట్లు, ప్రధాన జంక్షన్లలో హైమాస్ట్​ లైట్లు కూడా వెలగడంలేదు. వీటి నిర్వహణ బాధ్యతలను చూసే ఈఎస్ఎల్ సంస్థ సరిగా మెయింటెనెన్స్ చేయడం లేదు. గతేడాది సంస్థకు రూ.6.50 కోట్ల ఫైన్లు బల్దియా అధికారులు వేశారు.

 అయితే ఎక్కడ కూడా ప్రస్తుతం సమస్యలేదని ఇటీవల జరిగిన రివ్యూ మీటింగ్ హైదరాబాద్ ఇన్ చార్జ్​ మంత్రి పొన్నం ప్రభాకర్ కు అధికారులు చెప్పి తప్పుదోవ పట్టించారు. ఏజెన్సీ30 సర్కిల్స్ కు కేవలం 15మందిని మెయింటెనెన్స్ కు ఉంచిందని తెలిపారు.   జీహెచ్ఎంసీ ఎలక్ట్రికల్ విభాగంలో ఏఈలు 40 మందికి 16 మంది ఉన్నారని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. మరో రెండేండ్లు  ఏజెన్సీలకు టైం ఉందని, పేమెంట్స్ అందకపోవడం కూడా ఓ సమస్య అయిందని చెప్పారు. ఇలా అధికారులు తమకు  అనుకూలంగా మంత్రి చెప్పుకోగా.. వాస్తంగా అందుకు భిన్నంగా పరిస్థితులు ఉన్నాయి. 

వీటిపైనే ఎక్కువగా కంప్లయింట్లు

 లైట్ల సమస్యపై రోజుకు వెయ్యి నుంచి 1,800 వరకు  ప్రజల నుంచి బల్దియాకు ఫిర్యాదులు వస్తున్నాయి.  కొత్తగా ఏర్పాటు చేసిన వార్డు ఆఫీసులకు కూడా స్ర్టీట్ లైట్లపై ఎక్కువగా కంప్లయింట్లు చేస్తున్నారు.  అగ్రిమెంట్ లోని విధంగా లైట్ల స్టాక్ కు ఈఎస్ఎల్ మెయింటెన్  చేయడంలేదు. అగ్రిమెంట్ ప్రకారం 26,398 ఎల్ఈడీ లైట్ల స్టాక్ మెయింటెన్ చేయాల్సి ఉంది.  చాలా చోట్ల పోల్స్ ఏర్పాటు చేసినా  ఎల్ఈడీ లైట్లు లేకపోగా ఇన్ స్టాలేషన్ చేయడంలేదు. 35 వాట్స్, 70 వాట్స్ ఎల్ఈడీ లైట్లు చాలా షార్టేజ్ ఉంది. వారాల తరబడి ఏజెన్సీలు పనిచేయకపోయినా బఫర్ స్టాక్ ను మెయింటెన్ చేయకపోయినా సంబంధిత అధికారులు పట్టించుకోని పరిస్థితి ఉంది.  రూల్స్ మేరకు సిటీలో 98 శాతం  లైటింగ్ ఉండాలి. కానీ లైట్లు వెలగకపోయినా నెలకు రూ.8 కోట్ల బిల్లులు చెల్లిస్తున్నారు.  
  
6 లక్షల స్ర్టీట్​ లైట్లు.. 

సిటీలో  9,103 కి.మీ రోడ్లు ఉండగా 5,45, 484  స్ర్టీట్​ లైట్లు ఉన్నాయి. వీటిలో 4 లక్షలకు పైగా మెయిన్ రోడ్లు, వీధుల్లో ఉండగా, 54 వేలకుపైగా లైట్లు  ఇతర ప్రాంతాల్లో ఉన్నాయి. వీటితో పాటు హైమాస్ట్  లైట్లు 6,531ఉన్నాయి. బల్దియాకు  వచ్చే  ఫిర్యాదుల్లో 20 నుంచి 30 శాతం వరకు స్ర్టీట్​ లైట్లవే ఉంటున్నాయి.  డార్క్  స్పాట్లుగా గుర్తిస్తున్న అధికారులు లైట్లను మాత్రం ఏర్పాటు  చేయకుండానే చేసినట్లు చూపుతున్నారు. దీంతో నైట్​సమయంలో రోడ్లపై ప్రయాణించేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ట్రాఫిక్ పోలీసులు బల్దియా అధికారులకు చెబుతున్నా కూడా సమస్యని పరిష్కరించలేకపోతున్నారు.