ప్రజావాణి అర్జీలను త్వరగా పరిష్కరించాలి

ప్రజావాణి అర్జీలను త్వరగా పరిష్కరించాలి

మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల హమాలివాడ, సూర్యనగర్ కాలనీలకు కొన్ని రోజులుగా నల్లా నీళ్లు రావడం లేదు. వెంటనే వచ్చేలా చూడాలని కాలనీ వాసులు కోరారు. సోమవారం కలెక్టరేట్​లో జరిగిన గ్రీవెన్స్​లో అడిషనల్​ కలెక్టర్ పి.చంద్రయ్యకు ఫిర్యాదు చేశారు. అలాగే, వివిధ సమస్యలపై పలువురు దరఖాస్తులు అందజేయగా క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించాలని అడిషనల్ కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

కొడుకు ఇంట్లో నుంచి వెళ్లగొట్టిండు..

తన కొడుకు భూములు లాక్కొని తనను ఇంట్లో నుంచి వెళ్లగొట్టాడని నెన్నెల మండలం నందులపల్లికి చెందిన ఇందూరి కిష్టయ్య అడిషనల్​ కలెక్టర్ ఎదుట ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు న్యాయం చేయాలని వేడుకున్నాడు. తన తండ్రి చనిపోయినందున ఆయన పేరిట ఉన్న భూమిని తనకు పట్టా చేయాలని మంచిర్యాలకు చెందిన భూపతి జగన్మోహన్ విన్నవించారు. భూ హద్దుల కొలత కోసం దరఖాస్తు చేశానని, త్వరగా సర్వే చేయించాలని వేంపల్లికి చెందిన రాయిలి సత్యం కోరారు. సేంద్రియ ఉత్పత్తుల అవుట్ లెట్​కోసం స్థలం కేటాయించాలని బెల్లంపల్లి రైతు ఉత్పత్తిదారుల కంపెనీ ప్రతినిధులు విన్నవించారు.

ఆసిఫాబాద్, వెలుగు: ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని అడిషనల్ కలెక్టర్  దీపక్ తివారి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లోని జి1 కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో అర్జీదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఆసిఫాబాద్ మండలం రౌటసంకేపల్లికి చెందిన పోతిని చిన్న వెంకటస్వామి తన భూమిలో ఆయిల్ పామ్ సాగు చేశానని, గెలలను విక్రయించేందుకు రోడ్డు సౌకర్యం కల్పించాలని కోరాడు. పెంచికలపేట మండల కేంద్రానికి చెందిన పాముల నందు తాను గతంలో ఎల్లూర్ శివారులో కొనుగోలు చేసిన భూమికి పట్టా మంజూరు చేయాలని విన్నవించాడు. 

చింతలమానేపల్లికి చెందిన ఇప్ప కోసం తన పేరిట ఉన్న భూమికి పట్టా పాసుపుస్తకం ఇవ్వాలని కోరాడు. కాగజ్ నగర్ పట్టణం ద్వారకా నగర్ కాలనీకి చెందిన కత్తెరపాక ప్రమీల తనకు గతంలో ఆసరా పింఛన్ వచ్చేదని, ఆరేండ్లుగా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. లింగాపూర్ కు చెందిన బానోత్ అనూష బాయి తనకు వృద్ధాప్య పింఛన్ మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేసింది. 

కౌటాల మండలం ముత్యంపేటకు చెందిన పాలకుర్తి సంతరక్క ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరింది. రెబ్బెన మండలం కొండపల్లి గ్రామంలోని బుద్ధ నగర్ లో తాము 20 కుటుంబాలు నివాసం ఉంటున్నామని, ఓటరు జాబితాలో పేర్లు నమోదు చేయాలని విన్నవించారు. 

ఇంద్రవెల్లి(ఉట్నూర్), వెలుగు: ప్రజావాణికి వచ్చే అర్జీలను త్వరగ పరిష్కరించాలని ఉట్నూరు ఐటీడీఏ పీవో ఖష్బూ గుప్తా ఆదేశించారు. సోమవారం ఐటీడీఏ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణికి వివిధ సమస్యలపై వచ్చిన బాధితుల నుంచి దరఖాస్తులు తీసుకున్నారు. బేలా మండలం బోదిడి గ్రామానికి చెందిన కుమ్రం దేవరావు తనకు ఆర్ వోఎఫ్ఆర్ పట్టా మంజూరు కోరాడు. గుడిహత్నూర్ మండలానికి చెందిన వెంకటమ్మ తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని వేడుకుంది. మంచిర్యాల మండలం రెబ్బెన గ్రామానికి చెందిన శిరీష తనకు ఎంబీబీఎస్ చదువు కోసం ఫీజు మంజూరు చేయాలని కోరింది.