
నస్పూర్, వెలుగు: వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ కోరారు. సోమవారం కలెక్టరేట్ లో బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్, డీసీపీ ఎ.భాస్కర్‌తో కలిసి వివిధ శాఖల జిల్లా అధికారులు, మున్సిపల్, పంచాయతీ, పోలీస్, విద్యుత్, సంబంధిత శాఖల అధికారులతో రివ్యూ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. వినాయక మండపాల ఏర్పాటుకు పోలీస్ శాఖ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలన్నారు.
అనుమతి ఉన్న మండపాలకు ఉచిత విద్యుత్ సౌకర్యం అందిస్తామని తెలిపారు. ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ లైన్ల సమీపంలో వినాయక మండపాలు నిర్మించవద్దని, రక్షణతో కూడిన వైరింగ్ వ్యవస్థను వినియోగించాలన్నారు. షార్ట్ సర్క్యూట్ లను నివారించేందుకు చర్యలు తీసుకోవాలని, ఇందుకు టోల్ ఫ్రీ నంబర్1912ను సంప్రదించాలని సూచించారు.
నిమజ్జనం రోజు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలన్నారు. డీసీపీ మాట్లాడుతూ.. మండపాల్లో రాత్రిపూట నిర్వాహకులు తప్పనిసరిగా ఉండాలని, భారీ విగ్రహాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.