ధాన్యం సేకరణ స్పీడప్ .. మంచిర్యాల జిల్లాలో 2.21 లక్షల టన్నులు టార్గెట్

ధాన్యం సేకరణ స్పీడప్  .. మంచిర్యాల జిల్లాలో 2.21 లక్షల టన్నులు టార్గెట్
  • ఇప్పటికి 72 వేల టన్నుల కొనుగోలు
  • కమిషనర్ ఆదేశాలతో పెరిగిన వేగం
  • రోజూ 380 లారీల ద్వారా వడ్ల తరలింపు
  • కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ మానిటరింగ్
  • 15 రోజుల్లో సెంటర్లు క్లోజ్ చేసేలా చర్యలు

మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లాలో కొద్దిరోజులపాటు స్లోగా సాగిన ధాన్యం సేకరణ స్పీడ్​ అందుకుంది. వరికోతలు లేట్​కావడం, అకాల వర్షాలు పడుతుండడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కొనుగోళ్ల ప్రక్రియను స్పీడప్​చేశారు. సివిల్​ సప్లయీస్ కమిషనర్ డీఎస్ చౌహాన్​ప్రతిరోజు ఉదయం 9 గంటలకు అన్ని జిల్లాల అధికారులతో టెలీకాన్ఫరెన్స్​ నిర్వహిస్తూ కొనుగోళ్ల తీరును స్వయంగా మానిటరింగ్ ​చేస్తున్నారు. అడిషనల్​కలెక్టర్లతో పాటు సంబంధిత అధికారులతో మాట్లాడుతూ డెయిలీ ప్రోగ్రెస్​ను తెలుసుకుంటున్నారు. అవసరమైన ఆదేశాలు జారీ చేస్తున్నారు. కలెక్టర్ కుమార్​దీపక్, అడిషనల్​కలెక్టర్, ​సంబంధిత అధికారులు మార్కెటింగ్​ఆఫీసర్​తో రోజూ సాయంత్రం ధాన్యం కొనుగోళ్లపై రివ్యూ చేస్తున్నారు. అకాల వర్షాల వల్ల రైతులకు నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలంటూ  అలర్ట్​ చేస్తున్నారు. ఫలితంగా జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ స్పీడ్​ అయ్యింది. 

రోజూ 4 వేల నుంచి 6 వేల టన్నుల కాంటా 

జిల్లాలో ఈ ఏడాది యాసంగి సీజన్​లో 1.20 లక్షల ఎకరాల్లో వరిపంట సాగైంది. 3.30 లక్షల మెట్రిక్​టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అగ్రికల్చర్​ఆఫీసర్లు అంచనా వేసినప్పటికీ దిగుబడి తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో జిల్లావ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల ద్వారా 2.21 లక్షల టన్నుల ధాన్యం సేకరించాలని టార్గెట్​ పెట్టుకున్నారు. ఇందుకోసం 345 సెంటర్లను ఓపెన్​ చేయగా, ఇప్పటివరకు 265 సెంటర్ల ద్వారా 76,301.16 మెట్రిక్​ టన్నుల ధాన్యాన్ని 9,249 మంది రైతుల నుంచి కొనుగోలు చేశారు. 
ప్రస్తుతం రోజుకు 4 వేల నుంచి 6 వేల టన్నులు కాంటా వేస్తున్నారు. నిర్దేశిత టార్గెట్​ ప్రకారం ఇంకా 1.44 లక్షల టన్నుల ధాన్యం సేకరించాల్సి ఉంది. దీంతో కొనుగోళ్లు మరింత స్పీడప్​ చేసి 10, 15 రోజుల్లోగా సెంటర్లను క్లోజ్​ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

 మంచిర్యాల నియోజకవర్గంలో వరి కోతలు పూర్తికావడంతో మరో నాలుగైదు రోజుల్లో ధాన్యం సేకరణ ముగిసే అవకాశం ఉంది. దీంతో జన్నారం, దండేపల్లి, లక్సెట్టిపేట, హాజీపూర్​ మండలాల్లోని సెంటర్లను ఈ నెల 15లోగా క్లోజ్​ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. చెన్నూర్, బెల్లంపల్లి నియోజకవర్గాల్లో కోతలు ఆలస్యం అవుతుండడంతో ధాన్యం కొనుగోళ్లు లేట్​అవుతున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. ఈ ప్రాంతంలోని జైపూర్, భీమారం, చెన్నూర్, కోటపల్లి, వేమనపల్లి, బెల్లంపల్లి, తాండూర్, కాసిపేట, భీమిని, కన్నెపల్లి, నెన్నెల మండలాల్లోని సెంటర్లకు ఈ నెల 25 వరకు గడువు ఇచ్చారు. 

కరీంనగర్​ జిల్లాకు తరలింపు

జిల్లాలో 19 బాయిల్డ్, 35 రా రైస్​ మిల్లులున్నాయి. వీటిలో 23 మిల్లుల్లో దాదాపు రూ.130 కోట్ల విలువైన సీఎమ్మార్​ పెండింగ్​ ఉంది. దీంతో వీటిపై రెవెన్యూ రికవరీ (ఆర్ఆర్) యాక్ట్​ ప్రయోగించి క్రిమినల్ కేసులు నమోదు చేశారు. సంబంధిత మిల్లులను ఈ సీజన్​లో బ్లాక్​ లిస్టులో చేర్చి ధాన్యం సరఫరా నిలిపివేశారు. ప్రభుత్వం విధించిన రూల్స్​ ప్రకారం డిపాజిట్లు చెల్లించిన, బ్యాంక్​ ష్యూరిటీ ఇచ్చిన 16 మిల్లులకు మాత్రమే ట్యాగింగ్​ ఇచ్చారు. దీంతో మిగిలిన వడ్లను కరీంనగర్​ జిల్లాలోని 56 మిల్లులకు కేటాయించారు. 

ట్రాన్స్​పోర్టేషన్​ కోసం నాలుగు సెక్టార్లను ఏర్పాటుచేసి రోజుకు 380 లారీల ద్వారా ధాన్యాన్ని తరలిస్తున్నారు. మొన్నటివరకు అన్​లోడింగ్​కు నాలుగైదు రోజులు టైమ్​పట్టింది. దీంతో హమాలీల సంఖ్యను పెంచి 24 గంటల్లోనే అన్​లోడింగ్​జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. 

నాణ్యమైన ధాన్యం తీసుకొస్తే త్వరగా కొనుగోళ్లు పూర్తి

రైతులు అన్ని రకాల రూల్స్​పాటిస్తూ నాణ్యమైన ధాన్యాన్ని సెంటర్లకు తీసుకొస్తే కొనుగోళ్ల ప్రక్రియ త్వరగా పూర్తవుతుంది. జిల్లాలోని 140 సెంటర్లలో ప్యాడీ క్లీనింగ్​ మెషీన్లు అందుబాటులో ఉన్నప్పటికీ రైతులు వినియోగించుకోవడం లేదు. ధాన్యంలో తప్ప, తాలు తీయకుండానే సెంటర్లకు తీసుకురావడం, మాయిశ్చర్​ రాకపోవడం వల్ల కాంటా లేట్ ​అవుతోంది. రైతులు త్వరగా కోతలు పూర్తిచేసి నాణ్యమైన ధాన్యం తీసుకురావాలి. గడువులోగా కొనుగోళ్లు పూర్తయ్యేందుకు సహకరించాలి.   

సబావత్​మోతీలాల్, అడిషనల్​కలెక్టర్