గ్లామర్ ప్రపంచానికి దూరంగా మందాకిని

గ్లామర్ ప్రపంచానికి దూరంగా మందాకిని

మందాకిని.. ఈ పేరు వినగానే హిందీ ప్రేక్షకులకి ‘రామ్ తేరీ గంగా మైలీ’ గుర్తొస్తుంది.
తెలుగు ప్రేక్షకుల మనసుల్లో ‘సింహాసనం’ సినిమా మెదులుతుంది.
గాజుకళ్లు గిరగిరా తిప్పేది.  అందమైన నవ్వుతో అందరినీ తనవైపు తిప్పుకునేది.
చేసింది కొద్ది సినిమాలే అయినా అందరికీ గుర్తుండిపోయింది. 
ఇవాళ తన పుట్టినరోజు (జులై 30) కావడంతో మరోసారి వార్తల్లోకి వచ్చింది మందాకిని.

1963లో మీరట్‌లో మందాకిని జన్మించింది. ఆమె అసలు పేరు యాస్మీన్ జోసెఫ్. తండ్రి బ్రిటిషర్. తల్లి కశ్మీర్ మహిళ. దాంతో రెండు కల్చర్స్ మధ్య మందాకిని పెరిగింది. ఆమెకి ఇరవై రెండేళ్లు ఉన్నప్పుడు అనుకోకుండా రాజ్‌ కపూర్ కళ్లలో పడింది. దాంతో తాను తీస్తున్న ‘రామ్‌ తేరీ గంగా మైలీ’ మూవీలో హీరోయిన్‌గా తీసుకున్నారు. యాస్మీన్ అనే పేరును మందాకినిగా మార్చింది కూడా ఆయనే. రాజ్‌ కపూర్ కొడుకు రాజీవ్ కపూర్ హీరోగా నటించిన ఈ రొమాంటిక్ మూవీ అప్పట్లో చాలా పెద్ద హిట్టయ్యింది. ముఖ్యంగా రవీంద్ర జైన్ అందించిన పాటలు దేశమంతా మారుమోగాయి. ఎక్కడ చూసినా ఈ సినిమా టాపికే. మొదటి సినిమాయే అయినా కాస్త బోల్డ్ గా కూడా కనిపించి మందాకిని సెన్సేషన్ క్రియేట్ చేసింది. గ్లామర్‌‌కి తోడు మంచి నటన కూడా ప్రదర్శించడంతో అందరి కళ్లలోనూ పడింది. అదే యేడు ‘మేరా సాథీ’ అనే సినిమాలోనూ నటించింది. ఇది కృష్ణంరాజు నటించిన ‘ధర్మాత్ముడు’ మూవీకి రీమేక్. తెలుగులో భాస్కరరావు డైరెక్ట్ చేస్తే, హిందీలో కె.రాఘవేంద్రరావు తెరకెక్కించారు. అలా మందాకిని తెలుగువారి కళ్లలో పడింది. వెంటనే టాలీవుడ్‌ నుంచి ఆమెకి ఆహ్వానం అందింది.

తెలుగులోనూ...    

కృష్ణ రాసి, నటించి, నిర్మించి, డైరెక్షన్, ఎడిటింగ్ కూడా చేసిన ‘సింహాసనం’ సినిమాతో తెలుగునాట అడుగు పెట్టింది మందాకిని. ‘వహ్వా నీ యవ్వనం’ అంటూ కృష్ణ పాటందుకుంటే.. ‘వహ్వా నీ రాజసం’ అంటూ శ్రుతి కలిపింది. కూల్‌గా, క్యూట్‌గా కనిపించి తెలుగు ప్రేక్షకుల మనసుల్లోనూ చోటు సంపాదించింది. తర్వాత హిందీలో వరుసగా జీవా, ఆగ్ ఔర్ షోలా, జాల్, అప్నే అప్నే, లోహా, ప్యార్‌‌ కర్‌‌కే దేఖో లాంటి సినిమాలు చేసి మరోసారి తెలుగులోకి వచ్చింది. బాలకృష్ణతో ‘భార్గవరాముడు’ మూవీ చేసింది.  ఇక ఆ తర్వాత తెలుగులో ఇక కనిపించలేదు. బాలీవుడ్‌లోనే బిజీ అయిపోయింది. డ్యాన్స్ డ్యాన్స్, హవాలత్, జీతే హై షాన్‌సే, కమాండో, మాలామాల్, అగ్ని, తేజాబ్, జంగ్‌బాజ్, శేష్‌నాగ్, దుష్మన్‌ లాంటి చిత్రాల్లో యాక్ట్ చేసింది. 

చుట్టుముట్టిన వివాదాలు..

ఆమె ఇంకా చాలా సినిమాల్లో నటించి ఉండేది. చాలా యేళ్ల పాటు ఇండస్ట్రీలో ఉండేది. కానీ ఒక ఊహించని అడుగు ఆమె కెరీర్‌‌కి ఫుల్‌స్టాప్ పెట్టింది. వ్యక్తిగత జీవితమూ వివాదాల పాలయ్యింది. గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీమ్‌తో మందాకినికి పరిచయమయ్యింది. అతనితో ప్రేమలో పడిందని, పెళ్లి చేసుకుందని వార్తలు రావడంతో ఒక్కసారిగా చిక్కుల్లో పడింది మందాకిని. అతనిని కలిసిన మాట వాస్తవమే కానీ ఎలాంటి అఫైర్ లేదని వాదించింది. కొందరు నమ్మారు. కొందరు నమ్మలేదు. దాంతో ఆమె కెరీర్‌‌పై, లైఫ్‌పై ఒక బ్లాక్ మార్క్ పడింది. అవకాశాలూ తగ్గిపోయాయి. కెరీర్ డల్ అయిపోయింది. దాంతో డాక్టర్ కేటీఆర్‌‌ ఠాకూర్‌‌ అనే మాజీ బుద్ధిస్ట్ మాంక్‌ని పెళ్లి చేసుకుని సెటిలైపోయింది. తర్వాత ఒకట్రెండు సినిమాలు చేసింది.1996లో ‘జోర్దార్’ మూవీ చేసిన తర్వాత ఇక నటించడమే మానేసింది. కొడుకునీ కూతురినీ పెంచుకుంటూ గడిపేసింది. బౌద్ధమతం స్వీకరించింది. టిబెటన్ యోగా క్లాసులు చెప్పడం మొదలుపెట్టింది. ఆమె భర్త ఒక టిబెటన్ హెర్బల్ సెంటర్ నడుపుతున్నారు. 

ఇదీ మందాకిని లైఫ్‌స్టోరీ. ఇందులో విజయాలు ఉన్నాయి. అపజయాలూ ఉన్నాయి. పొగడ్తలే కాదు తెగడ్తలూ ఉన్నాయి. విశేషాలతో పాటు వివాదాలూ ఉన్నాయి. అన్నింటినీ దాటుకుంటూ ఇంతవరకు వచ్చిందామె. గ్లామర్ ప్రపంచానికి దూరంగా ఎక్కడో తనకు నచ్చినట్టు జీవిస్తున్నా.. ఒకనాడు అందరికీ ఇష్టమైన నటిగా ఇప్పటికీ జ్ఞాపకాల్లో కదలాడుతోంది.