ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

విద్యుత్​ ఏడీఈని సస్పెండ్ చేయాలని డిమాండ్

చిట్యాల, వెలుగు: జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలకేంద్రంలో శనివారం నిర్వహించిన మండల సభను సర్పంచ్​లు బైకాట్ చేశారు. విద్యుత్ ఏడీఈని సస్పెండ్ చేయాలని నేలపై కూర్చొని ధర్నా చేశారు. ఎంపీపీ దావు వినోద అధ్యక్షతన జరిగిన ఈ మీటింగ్​లో విద్యుత్ అంశం చర్చకు వచ్చింది. ఈక్రమంలో మండలంలో కరెంట్ సమస్యలను ఆఫీసర్లు పట్టించుకోవడం లేదని సర్పంచులు భగ్గుమన్నారు. జీపీలకు గతంలో కరెంట్ బిల్లులు లేవని ఇప్పుడు రూ.40వేల నుంచి రూ.50వేల వరకు కడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని జీపీల్లో మీటర్లు లేకున్నా కరెంట్ బిల్లులు వేశారని ఫైర్ అయ్యారు. చిట్యాలకు ఏఈ లేడని, ఏడీఈనే పెద్ద దిక్కుగా ఉన్నాడని, ఆయన కూడా  మీటింగ్​కు రాలేదని మండిపడ్డారు. అతన్ని సస్పెండ్ చేయాలని తీర్మానం చేసినా ఎందుకు అమలు చేయడం లేదని ఎంపీపీని ప్రశ్నించారు. అక్కడే కూర్చొని ధర్నా చేసి, సభను బహిష్కరించారు. ఇదిలా ఉండగా.. గ్రామ సభలో జడ్పీటీసీ సాగర్ ఏడీఈకి ఫోన్ చేసి రావాలని కోరగా.. ఆయన రానని  చెప్పాడు. దీంతో ఆ జడ్పీటీసీ అడిషనల్ కలెక్టర్​కు  ఫోన్ చేసి, ఏడీఈ తీరుపై ఫిర్యాదు చేశారు.

మేనమామ పిల్లనివ్వడం లేదని..అల్లుడు సూసైడ్!

పాలకుర్తి, వెలుగు: మేనమామ పిల్లనివ్వడం లేదని మనస్తాపానికి గురైన అల్లుడు బావిలో దూకి సూసైడ్​ చేసుకున్నాడు. ఈ సంఘటన జనగామ జిల్లా పాలకుర్తి మండలంలో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. కొడకండ్ల మండలం లక్ష్మక్కపల్లి గ్రామం జైత్య తండాకు చెందిన వాంకుడోతు చంటి(26) డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. పాలకుర్తి మండలం టీఎస్​కే తండా జీపీ పరిధిలోని దుబ్బ తండాలో తన మేనమామ గుగులోత్ మహేందర్ నివాసం ఉంటున్నాడు. అయితే రెండేండ్ల కింద తన కూతురుని చంటికి ఇచ్చి పెండ్లి చేస్తానని మేనమామ మహేందర్ చెప్పాడు. చదువు పూర్తయ్యాక పెండ్లి చేస్తానని మాటిచ్చాడు. ఇటీవల మహేందర్ మాట మార్చడంతో చంటి ఆవేదనకు గురయ్యాడు. తరచూ మేనమామ ఇంటికి వచ్చి, మరదలును ఇచ్చి పెండ్లి చేయాలని కోరారు. ఈ నెల 15న ఇలాగే ఇంటికి రాగా.. మేనమామ ఒప్పుకోలేదు. అప్పటి నుంచి కనిపించకుండా పోయాడు. కుటుంబసభ్యులు ఎంత వెతికినా ఆచూకీ దొరకలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. శనివారం టీఎస్ కే తండా సమీపంలోని మల్లంపల్లి శివారులోని వ్యవసాయ బావిలో శవమై కనిపించాడు. పోలీసులు అక్కడికి చేరుకుని డెడ్ బాడీని వెలికి తీశారు. అయితే చంటి మృతిపై అనుమానాలు ఉన్నాయని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్సై తాళ్ల శ్రీకాంత్ అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు.

​‘బీఆర్ఎస్ లోకి వస్తేనే దళితబంధు’

హనుమకొండ, వెలుగు: సమస్యలు, సంక్షేమ పథకాల గురించి నిలదీసిన ప్రజలను బీఆర్ఎస్​లోకి రావాలని, లేదంటే దళితబంధు ఇవ్వరంటూ ఆ పార్టీ నేత చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ‘బీఆర్ఎస్​లోకి వస్తేనే దళితబంధు ఇస్తరు.. బీజేపోళ్లకు ఇయ్యరు’ అంటూ ఒకటికి రెండు సార్లు చెప్పడంతో దళితబంధు కేవలం బీఆర్ఎస్​ కార్యకర్తలు, నేతలకేనా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. ​ వరంగల్ మేయర్ గుండు సుధారాణి ప్రాతినిధ్యం వహిస్తున్న 29వ డివిజన్​లో సమస్యలు ఎక్కువగా ఉన్నాయని కొంతమంది స్థానికులు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేశ్​రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఈ నెల 8న రాకేశ్​ రెడ్డి 29వ డివిజన్​ ను విజిట్​ చేసి.. సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ ​విప్​దాస్యం వినయ్​భాస్కర్ తీరు పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నెల 15న రాకేశ్​రెడ్డి తీరును నిరసిస్తూ బీఆర్ఎస్​ కార్పొరేటర్​ వేముల శ్రీనివాస్, పార్టీ 29వ డివిజన్ ప్రెసిడెంట్ సదంత్ ప్రెస్​మీట్లు పెట్టి, రాకేశ్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. దీంతో తమకు అండగా నిలిచిన రాకేశ్ రెడ్డిపై విమర్శలు చేయడం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం సాయంత్రం ఖాళీ కుండలతో 29వ డివిజన్​లోని సదంత్​ ఇంటి ఎదుట నిరసనకు దిగారు. తాగునీటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నామని, దళితబంధు కూడా అందడం లేదని సదంత్​ను నిలదీశారు. ఈ క్రమంలో ఆయన స్థానికులతో వారించారు. బీఆర్ఎస్​ లోకి వస్తేనే దళితబంధు ఇస్తారని, బీజేపీ పార్టీ వాళ్లకు మాత్రం ఇవ్వరని చెప్పారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ప్రెసిడెంట్ టూర్ కు ఏర్పాట్లు

ములుగు, వెలుగు: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 28న యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయానికి రానున్నారు. ఈమేరకు ఆఫీసర్లు ఏర్పాట్లు చేస్తున్నారు. శనివారం ములుగు కలెక్టరేట్​లో కలెక్టర్ కృష్ణ ఆదిత్య ప్రెసిడెంట్ టూర్​పై ఎస్పీ సంగ్రాం సింగ్ జీ పాటిల్ తో కలిసి రివ్యూ చేశారు. మూడు హెలీక్యాప్టర్లు ల్యాండ్ అయ్యేలా మైదానాన్ని చదును చేయాలన్నారు. పార్కింగ్ ఏరియాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయాలన్నారు. బైరవ ఆలయం, రామప్ప ఉప ఆలయాలు, గర్భగుడిని సుందరీకరించాలన్నారు. పిచ్చి మొక్కలు తొలగించి శానిటేషన్ పనులు చేపట్టాలన్నారు. ఆలయం చుట్టూ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని ఎస్పీకి సూచించారు. కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ కోఆర్డినేటర్ ప్రొ.పాండురంగారావు, అడిషనల్ కలెక్టర్​ వైవీ గణేశ్, ఏఎస్పీ సుధీర్ రాంనాథ్​ కేకన్, డీఆర్వో రమాదేవి తదితరులున్నారు.

‘లంచం అడిగితే చెప్పుతో కొట్టండి’

 ఏటూరునాగారం, వెలుగు: దళితబంధు కోసం లంచం అడిగితే చెప్పుతో కొట్టాలని ములుగు జడ్పీ చైర్మన్ జగదీశ్వర్ దళితులకు పిలుపునిచ్చారు. శనివారం ఆయన ములుగు జిల్లా ఏటూరునాగారంలో 17మందికి కల్యాణలక్ష్మి చెక్కులు అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. విడతల వారిగా అందరికీ దళితబంధు వస్తుందన్నారు. అనంతరం ఎంపీడీవో ఆఫీసును ఆకస్మికంగా తనిఖీచేశారు. సిబ్బంది డ్యూటీకి రాకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. జడ్పీ సీఈవోకు ఫోన్ చేసి సిబ్బంది పనితీరుపై కంప్లయింట్ చేశారు. కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ లైబ్రరీ చైర్మన్ పోరిక గోవింద్ నాయక్, జిల్లా కోఆప్షన్ మెంబర్ ఎండీ వలియాబీ సలీం, ఆత్మ చైర్మన్ దుర్గం రమణయ్య తదితరులున్నారు.

దేశానికి రోల్ మోడల్ తెలంగాణ

బచ్చన్నపేట, వెలుగు: దేశానికి తెలంగాణ రోల్ మోడల్ అని, ఇక్కడి పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శమని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. శనివారం జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం చిన్నరామచర్ల గ్రామంలో ఎమ్మెల్యే పర్యటించారు. 31మందికి కల్యాణలక్షి చెక్కులు అందజేశారు. దళితవాడలో దళితులతో కలిసి భోజనం చేశారు. గ్రామంలో మురికి కాలువులను స్వయంగా శుభ్రం చేశారు. సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని దేశ ప్రజలందరూ కోరుకుంటున్నారని తెలిపారు. బీఆర్ఎస్ రైతు సర్కారుగా నిలుస్తుందన్నారు. తహశీల్దార్ వినయలత, సర్పంచ్​ఎండీ ఖలీలా బేగం, రైతుబంధు కన్వీనర్​ఇర్రి రమణారెడ్డి, జడ్పీ వైస్​ చైర్మర్​గిరబోయిన భాగ్యలక్ష్మి, ఎంపీపీ బావండ్ల నాగజ్యోతి తదితరులున్నారు.