Vaani Kapoor: మోడలింగ్ టూ స్టార్ హీరోయిన్.. ఇండస్ట్రీలో వరుస సినిమాలు.. ఎవరీ వాణీ కపూర్?

Vaani Kapoor: మోడలింగ్ టూ స్టార్ హీరోయిన్.. ఇండస్ట్రీలో వరుస సినిమాలు.. ఎవరీ వాణీ కపూర్?

ఒకప్పుడు బుల్లితెర నుంచి వెండితెరకు పరిచయమయ్యేవారు నటులు. ఇప్పుడు ట్రెండ్ మారింది. ఓటీటీ అనే కొత్త "ప్లాట్‌ఫాం" తెరమీదికి వచ్చాక దానికి సపరేట్ ఆడియెన్స్ క్రియేట్ అయ్యారు. దాంతో అటు సీరియల్, ఇటు సినిమా యాక్టర్లు రూటు మార్చారు. వాళ్ల ప్లాట్‌ఫాంలో అదరగొడుతూనే వెబ్ సిరీస్లోనూ నటిస్తున్నారు.

అలా ఓటీటీ ఆడియన్సు పరిచయమైన వాళ్లలో స్టార్లు కూడా ఉన్నారు. అదే బాటలో ఈ బాలీవుడ్ నటి అడుగులు వేస్తోంది. హిందీ సినిమాలతో నటన మొదలుపెట్టిన ఆమె ఇప్పుడు వెబ్ సిరీస్లో ప్రేక్షకుల ముందుకొచ్చింది. అదే 'మండల మర్డర్స్'. ఈ సిరీస్లో  కీలక పాత్ర పోషించిన ఆమె పేరు వాణీ కపూర్ (Vaani Kapoor).

వాణీకపూర్ కెరీర్:

వాణీకపూర్ ఢిల్లీలో పుట్టి పెరిగింది. వాళ్ల నాన్న శివ్ కపూర్ ఫర్నిచర్ ఎక్స్పోర్ట్ ఎంట్ర ప్రెన్యూర్. వాళ్ల అమ్మ డింపి కపూర్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్. వాణీ ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీలో టూరిజం స్టడీస్లో డిగ్రీ పూర్తి చేసింది. తర్వాత జైపూర్లో ఇంటర్న్షిప్ చేసింది. ఫ్యాషన్, క్రియేటివ్ ఫీల్డ్ మీద ఇంట్రెస్ట్తో మోడలింగ్ లోకి అడుగుపెట్టింది. ఆ రంగంలో వాణీకి ఫస్ట్ చాన్సే.. బెస్ట్ చాన్స్గా నిలిచిపోయింది.

మోడలింగ్లో పేరు తెచ్చుకున్న ఆమెకు యశ్ రాజ్ ఫిల్మ్స్ ప్రొడక్షన్ నుంచి సినిమాల్లో ఆఫర్ వచ్చింది. ఒకేసారి మూడు ప్రాజెక్ట్కు సైన్ చేసి కెరీర్ను గ్రాండ్గా బిగిన్ చేసింది. అలా హిందీ ఇండస్ట్రీలో వాణీ జర్నీ స్టార్ట్ అయింది. మొదట 'శుద్ధ దేశీ రొమాన్స్' అనే సినిమాకి సపోర్టింగ్ రోల్ కోసం ఆడిషన్ ఇచ్చింది. 2013లో రిలీజ్ అయిన ఆ సినిమా ఇచ్చిన గుర్తింపుతో తమిళంలో నాని నటించిన 'ఆహా కళ్యాణం' సినిమాలో చాన్స్ వచ్చింది. ఈ సినిమా తెలుగులోనూ రిలీజ్ అయింది.

మూడో సినిమా మళ్లీ హిందీలోనే 'బేఫికర్'లో కనిపించింది. ఆ తర్వాత మూడేండ్లు కెరీర్ గ్యాప్ వచ్చింది. 2019లో హృతిక్ రోషన్ నటించిన 'వార్' సినిమాతో మళ్లీ రీఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత అవకాశాలన్నీ అందిపుచ్చుకుంటూ సినిమాల్లో నటించింది. వాణీ మొదటి సినిమాకే 'బిగ్ స్టార్ ఎంటర్టైన్మెంట్ అవార్డు.. ఫిల్మ్ ఫేర్, ఐఫా, స్టార్ గిల్డ్, జీ సినీ అవార్డులు సొంతం చేసుకుంది.

వాణీ కపూర్ అవార్డులు:

'చండీగర్ కరే ఆషిఖీ' సినిమాకుగానూ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్.ఐకానిక్ గోల్డ్ అవార్డ్స్, పింక్ విల్లా స్టైల్ ఐకాన్స్ అవార్డులు దక్కాయి. లేటెస్ట్గా 'రెయిడ్ - 2' సినిమాలో కనిపించిన వాణీ ఈ ఏడాది మొట్టమొదటిసారి వెబ్ సిరీస్లో యాక్ట్ చేసింది. అదే ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమ్ అవుతోన్న 'మండల మర్డర్స్' సిరీస్. మరిన్ని విశేషాలు ఆమె మాటల్లోనే....

ట్రాన్స్ ఉమెన్ పాత్రలో..!

'చండీగర్ కరే ఆషిఖీ' సినిమాలో ట్రాన్స్ ఉమెన్ పాత్రలో నటించడానికి ముందు చాలా రీసెర్చ్ చేశా. గ్లోబల్ సినిమాలతోపాటు ఎన్నో డాక్యుమెంటరీలు కూడా చూశా. అంతకుమించి డైరెక్టర్ అభిషేక్ కపూడ్కి నా పాత్ర (మాన్వి) ఎలా ఉండాలో ఒక క్లియర్ విజన్ ఉంది. దాంతో నాకు చాలా ఈజీ అయిపోయింది. అంతేకాకుండా ఒక యాక్టర్గా నేను డైరెక్టర్ని నమ్మాను. ఆయన నేను చేయగలనని నమ్మారు. ఈ పాత్రద్వారానేను ప్రత్యేకమైన బాట వేశాను. హిందీ సినిమాలో ఇలాంటిది ఎప్పుడూ జరగలేదు. దాంతో నాకు ఇంకా ఎగ్జెట్మెంట్ పెరిగింది. ఇది చేస్తున్నప్పుడే నాకు తెలుసు. దీని గురించి చర్చలు మొదలవుతాయని. కానీ, మార్పు తీసుకురావడానికి ఇదొక మొదటి అడుగుమాత్రమే అనుకున్నా.

ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. వాళ్లు నిజంగా ఆ క్యారెక్టర్కి కనెక్ట్ అయ్యారు. ఒక రచన, పాత్ర, నటన వల్ల ఒక చర్చ మొదలైతే మంచిదే కదా. నేను ఇప్పటివరకు చేసిన సినిమాల్లో నా క్యారెక్టర్స్ అన్నీ దాదాపు ఒకేలా ఉంటాయి. 'బేఫికర్' సినిమాలో మాత్రం నా పాత్రకు చాలా కనెక్ట్ అయ్యా.

వాళ్లే నా సపోర్ట్:

ప్రతిసారీ నా బర్త్ డేకి మా పేరెంట్స్ని కలవడానికి ఇంటికి వెళ్తా. మా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ విషయంలో ఏది అనుకుంటే అది చేస్తా, అస్సలు వెనక్కి తగ్గను. వాళ్లతో కలిసి టైం స్పెండ్ చేయడం నాకు చాలా పెద్ద విషయం. వాళ్లతో కలిసి ఉన్నప్పుడు నేను పొందే ఆనందమే నా మోటివేషన్. లైఫ్ నన్ను ముందుకు నడిపించేది వాళ్లు ఇచ్చిన ఎనర్జీనే.

ఫెయిల్యూర్స్ ద్వారా నేర్చుకున్నా..

దేన్నీ మనసులోకి తీసుకోకూడదు అనే విషయం నా ఫెయిల్యూర్స్ ద్వారా నేర్చుకున్నా. మంచిని మాత్రమే తీసుకోవాలి. రిజల్ట్ ఎలా ఉన్నా దానికి విలువనివ్వాలి. ఆ తర్వాత మళ్లీ సక్సెస్ కోసం ప్రయత్నిస్తూనే ఉండాలి. ఒకవేళ నా వల్ల ఏమైనా తప్పు జరిగిందా? అనేది కూడా ఆలోచిస్తాను. సినిమా అనేది ఒక్కరితో సాధ్యమయ్యే పనికాదు.

మొదట డైరెక్టర్, కథను నమ్మి క్యారెక్టర్స్ అందర్నీ ఒక చోట చేర్చి సినిమా పూర్తి చేస్తారు. ఎడిటింగ్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వంటివన్నీ జరుగుతాయి. ఎంతోమంది కలిసి పని చేస్తేనే సినిమా అవుతుంది. కానీ నేను ఈ విషయంలో బాగా ఒత్తిడికి గురయ్యేదాన్ని ఫెయిల్యూర్స్ తర్వాత నుంచి సినిమాలో నటించడం వరకే ఆలోచించాలి. రిజల్ట్ గురించి నాకు నేను ఒత్తిడి తీసుకోవడం మంచిదికాదు. కాస్త దూరంగా ఉండాలని ప్రయత్నించా. ఈరోజు నేను ఇక్కడ ఉన్నానంటే దానికి కారణం గతంలో జరిగిన సంఘటనలే. నేనేంటో నాకు తెలిసేలా చేశాయి.

ఆ అవకాశం దొరికింది:

నేను ఇప్పటికీ కొత్తగా వచ్చిన అమ్మాయిలానే ఫీల్ అవుతా. అలానే టెన్షన్ పడుతుంటా. ఏ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినా నా ఎనర్జీ, ఎగ్జెట్మెంట్ ఒకేలా ఉంటాయి. ఎంతో కొంత నేర్చుకుంటూ ఒక మనిషిగా ఎదగాలి. ఒక ఆర్టిస్ట్్న కావడం వల్ల ఎప్పుడూ నేర్చుకునే అవకాశం దొరుకుతుంది. అది నాకు ఎదగడానికి చాలా హెల్ప్ అవుతుంది.

వర్క్ లైఫ్ బ్యాలెన్స్:

మా పని ఎలా ఉంటుందంటే.. ఒక్కోసారి తెలియకుండానే పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్ కలిసిపోతుంటాయి. కానీ, మనం ఒక గిరి గీసుకోవడం అవసరం. ఎందుకంటే మీకు తెలుసు మీరు ఎక్కడికి వెళ్లాలో? ఎవరితో ఏం షేర్ చేసుకోవాలో? ఎంతవరకు దాచుకోవాలో? ఈ విషయంలో నాకు ఆ బ్యాలెన్స్ సరిగానే ఉంది.