
- నేతల హామీలు అమలు కావట్లే..
- 30ఏండ్లుగా మున్సిపాలిటీకి ఎన్నికల్లేవ్
- ఏజెన్సీ హక్కులను రక్షించాలంటే పంచాయతీ చేయాలి
- మూడు గ్రామాల ప్రజల డిమాండ్
- ఎన్నికలు దగ్గరకొస్తుండడంతో హోరెత్తుతున్న నిరసనలు
కోల్‌బెల్ట్, వెలుగు: మందమర్రి మున్సిపాలిటీలో 30 ఏండ్లుగా స్థానిక ఎన్నికలు నిర్వహించడంలేదు. తమ సాదకబాధకాలు తీర్చడానికి ప్రతినిధి లేకుండా పోయారని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. తమను గెలిపిస్తే స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు కృషి చేస్తామని హామీలిచ్చిన ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదు. స్వయంగా ముఖ్యమంత్రులు ఇచ్చిన హామీలు అమలు కాలేదు. సింగరేణి బొగ్గుగనులతో పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన మందమర్రి మున్సిపాలిటీ ప్రజలకు మూడు దశాబ్దాలుగా స్థానిక ఎన్నికల్లో పాల్గొనే అవకాశమే రాలేదు. మరోవైపు మున్సిపాలిటీలో ఏజెన్సీ యాక్ట్ అమలులో ఉన్నప్పటికీ చట్టాలు అమలు కావడంలేదు. గిరిజనులను మచ్చిక చేసుకొని అధికార, ప్రతిపక్ష పార్టీల లీడర్లు గుట్టుచప్పుడు కాకుండా తక్కువ ధరలకు భూముల కొని రియల్ ఎస్టేట్ దందా సాగిస్తున్నారు. దీంతో వారు హక్కులు, ఉద్యోగాలు కోల్పోతున్నారు. విచ్చలవిడిగా నిర్మాణాలు సాగుతున్న ఆఫీసర్లు అడ్డుకునే పరిస్థితి లేదు. మందమర్రి పంచాయతీగా ఉన్నప్పుడే హక్కులు కాపాడుకున్నామని, మున్సిపాలిటీని మళ్లీ పంచాయతీగా మార్చాలని కొన్నాళ్లుగా మూడు గ్రామాల ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు.
బాల్క సుమన్‌ను గెలిపిస్తే ఎన్నికలు జరిపిస్తా..
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా 2018 నవంబర్ 29న మందమర్రి సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ చెన్నూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న బాల్క సుమన్‌ను గెలిపిస్తే నియోజకవర్గ అభివృద్ధి బాధ్యతను తీసుకుంటాడని, మందమర్రి మున్సిపాలిటీకి తాను ఎన్నికలు జరిపిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. సమైక్య ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు హామీ ఇచ్చిన ఎన్నికలు మాత్రం నిర్వహించలేదు. ఎమ్మెల్యే బాల్క సుమన్ కొద్ది రోజుల కింద ఏజెన్సీ యాక్ట్ ఉందని, ఎన్నికల నిర్వహణకు కేంద్రం చొరవ చూపాలని చెప్పారు. ఇటీవల ఆత్మీయ సమ్మేళనంలో మందమర్రి పాలకవర్గం ఎన్నికలు, అభివృద్ధికి ఏజెన్సీ యాక్ట్ అడ్డుగా ఉందని, డిలిమిటేషన్ తోనే అవన్నీ సాధ్యమని పేర్కొనడంపై గిరిజన సంఘాలు మండిపడుతున్నాయి.
పంచాయతీగా మార్చాలని ఉద్యమం..
మందమర్రి మున్సిపాలిటీని ఏజెన్సీ ప్రాంతంగా గుర్తించిన తమకు గిరిజన చట్టాలు, హక్కులు అమలు కావడం లేదని గిరిజన కుటుంబాలు వాపోతున్నాయి. తమ భూములను గిరిజనేతరులు అన్యాక్రాంతం చేస్తున్నారని, అక్రమ నిర్మాణాలను ఆఫీసర్లు అడ్డుకోవడంలేదని ఆరోపిస్తున్నారు. ఏజెన్సీ యాక్టు, రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడుకోవడం కోసం ఊరు మందమర్రి, నార్లాపూర్, ఊరురామకృష్ణాపూర్ గ్రామాలను కలిపి మున్సిపాలిటీని తిరిగి మందమర్రి పంచాయతీగా మార్చాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు చేపడ్తున్నారు. మూడు గ్రామాల గ్రామస్తులు, యూత్ పంచాయతీ సాధన కమిటీ పేరిట ధర్నాలు, నిరసనలు హోరెత్తిస్తున్నారు. సుమారు 4వేల జనాభా కలిగిన మూడు గ్రామాల్లోని అన్ని వర్గాలు నిరసనలకు మద్దతు పలుకుతున్నారు.
పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా..
1992 వరకు గ్రామ పంచాయతీగా కొనసాగిన మందమర్రిని 1993లో నోటిఫైడ్ ఏరియాగా గుర్తించారు. చైర్మన్‌గా మాజీ ఎమ్మెల్యే సోత్కు సంజీవరావును ప్రభుత్వం నియమించింది. 1995 ఆగస్టులో గ్రేడ్ మున్సిపాలిటీ హోదా కల్పిస్తూ జీవో జారీ చేసింది. 1998 జూన్‌లో ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. మూడు వారాల పాటు నామినేషన్ల ప్రాసెస్కొనసాగి ఎన్నికల సందడి ప్రారంభమైంది. కాని మున్సిపల్ చైర్మన్ పదవిని ఎస్సీలకు రిజర్వ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం వివాదానికి తెరలేపింది. ఏజెన్సీ ఏరియా పరిధిలోని మందమర్రిలో 1/70 చట్టం అమలులో ఉండడంతో ఇక్కడ ఎన్నికలు జరపడానికి వీలు లేదని, లేని పక్షంలో చైర్మన్ పదవిని ఎస్టీలకు కేటాయించాలంటూ మందమర్రి మాజీ సర్పంచ్ మద్దిరాంచందర్ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఎన్నికలు నిలిపివేస్తూ హైకోర్టు స్టే జారీ చేసింది. ఏజెన్సీ యాక్ట్ విషయంలో పార్లమెంటు జోక్యం చేసుకోవాల్సి ఉంది. మందమర్రి మున్సిపాలిటీ ఎన్నికలు జరిపించాలని అన్ని వర్గాలు ఏండ్లుగా ఉద్యమిస్తున్నారు. మున్సిపాలిటీ పరిధిలో 24 వార్డులు ఉన్నాయి. 2011 లెక్కల ప్రకారం 52,352 జనాభా ఉంది. ప్రస్తుతం 64వేలకు చేరింది. వార్డుల్లో కొన్నింట్లో సింగరేణి మేనేజ్మెంట్, కొన్నింట్లో మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి.
రాజ్యాంగం ఇచ్చిన హక్కులు కాపాడాలి..
మందమర్రి మున్సిపాలిటీలో ఏజెన్సీ యాక్ట్ అమలు కావడంలేదు. రాజ్యాంగం కల్పించిన హక్కులు, చట్టాల రక్షణ కోసం మందమర్రిని తిరిగి పంచాయతీగా మార్చాలి. అప్పటిదాక మా పోరాటం ఆగదు.
- మేషినేని అరుణ్, ముజాహిద్ పంచాయతీ సాధన కమిటీ బాధ్యులు