ఓటేయకుంటే ఉద్యోగాలు ఇచ్చేది లేదు: మేనకా గాంధీ

ఓటేయకుంటే ఉద్యోగాలు ఇచ్చేది లేదు: మేనకా గాంధీ

ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర మహిళా, శిశు సంక్షేమ మంత్రి మేనకా గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ(శుక్రవారం) ఉత్తర ప్రదేశ్ సుల్తాన్‌పూర్‌లో ముస్లింలు ఎక్కువగా ఉన్న తురబ్‌ ఖానీ గ్రామంలో పర్యటించి…ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా  ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ముస్లింలు తనకు ఓటు వేయకుంటే వారికి ఉద్యోగాలు ఇచ్చేది లేదన్నారు. ఓటు వేయకుండా ఉద్యోగాలు ఎలా అడుగుతారని ప్రశ్నించారు. ఇది ఇచ్చి పుచ్చుకునే పద్ధతి అనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. అంతేకాదు  మీ మద్దతు లేకుండా నేను ఎన్నిక కావాలనుకోవడం లేదన్నారు. పిలిభిత్‌లో ఎలాంటి అభివృద్ధి పనులు చేసానో మీరు అడిగి తెలుసుకోండి అని అన్నారు. సరిగా పని చేయలేదని మీరు భావిస్తే నాకు ఓటు వేయొద్దంటూ ఆమె ముస్లింలకు సూచించారు. అయితే దీంతో మతం పేరుతో ఓట్లు అడగడం, ఉద్యోగాలివ్వమని బెదరించడం ఏంటని విపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మేనకా గాంధీ 2014లో యూపీలోని పిలిభిత్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. అయితే ఈసారి ఆమెకు సుల్తాన్‌పూర్ కేటాయించింది.