ఫలించిన ఆదివాసుల పోరాటం.. హైకోర్టు తీర్పుతో ఐదో షెడ్యూల్​లోకి మంగపేట మండలం

ఫలించిన ఆదివాసుల పోరాటం.. హైకోర్టు తీర్పుతో ఐదో షెడ్యూల్​లోకి మంగపేట మండలం
ములుగు జిల్లా మంగపేట మండలంలో పదిహేనేండ్లుగా లోకల్​ బాడీ ఎలక్షన్లు జరగలేదు. గ్రామ పంచాయతీలకు సర్పంచులు ఉండరు.. ఎంపీటీసీలు .. జడ్పీటీసీలు ఉండరు. అంతా స్పెషల్‌‌ ఆఫీసర్ల పాలనే. ఇక ఇప్పుడా పరిస్థితి ఉండదు.  మండలంలోని 23 రెవెన్యూ గ్రామాలు ఐదో షెడ్యూల్‌‌ పరిధిలోకి వస్తాయని హైకోర్టు చీఫ్‌‌ జస్టిస్‌ ఉజ్జల్‌‌ భూయాన్‌‌ బుధవారం ఉదయం తీర్పు చెప్పారు. గతంలో సింగిల్‌‌ జడ్జి ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ ఆదివాసేతరులు వేసిన పిటిషన్‌‌ కొట్టివేశారు. దీంతో ఆదివాసీల 73 యేండ్ల సుదీర్ఘ పోరాటానికి తెరపడినట్లైంది. చీఫ్‌‌ జస్టిస్​ తీర్పుతో మంగపేట మండలంలో ఆదివాసీలు సంబరాలు జరుపుకుంటున్నారు. తమ భూభాగంపై ఆదివాసేతరుల  పెత్తనాన్ని రద్దు చేస్తూ హై కోర్టు ఇచ్చిన తీర్పుపై  హర్షం వ్యక్తం చేస్తున్నారు.
  • 23 రెవెన్యూ గ్రామాలన్నీ ఇకపై ఆదివాసీ గ్రామాలే
  • ఎట్టకేలకు లోకల్​బాడీ ఎన్నికలకు లైన్​ క్లియర్​
  • 73 ఏండ్ల సుదీర్ఘ పోరాటానికి తెర సంబరాలు జరుపుకుంటున్న ఆదివాసీలు

జయశంకర్‌‌ భూపాలపల్లి, వెలుగు: మంగపేట మండలంలోని 23 రెవెన్యూ గ్రామాలు గతంలో  పాల్వంచ తాలుకాలో ఉండేవి.  కాలక్రమంలో ములుగు తాలుకాలో విలీనం చేయడం వల్ల ఈ గ్రామాలన్నీ నాన్‌‌ షెడ్యూల్‌‌ గ్రామాలే అని 1950 ఏప్రిల్‌‌లో ఆదివాసేతరులు హైకోర్టులో కేసు వేశారు. దీంతో  ఆదివాసీలంతా ఏకమై ఈ 23 రెవెన్యూ గ్రామాలు  భారత రాజ్యాంగం ప్రకారం ఐదో షెడ్యూల్‌‌ పరిధిలోకే వస్తాయని, ఇక్కడ ఉండే సంపద, ఉద్యోగాలపై అన్నీ హక్కులు ఆదివాసీలకే దక్కాలంటూ పోరాటం ప్రారంభించారు. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత భారత ప్రభుత్వానికి గతంలో నిజాం సర్కార్ పంపించిన జీవోలు, లేఖలు సంపాదించి కోర్టుకు సమర్పించారు.  సుదీర్ఘ వాదనల తర్వాత మంగపేట మండలంలోని 23 రెవెన్యూ గ్రామాలు ఐదో షెడ్యూల్‌‌ పరిధిలోకే వస్తాయని 2013లో హైకోర్టు సింగిల్‌‌ జడ్జీ తీర్పునిచ్చారు. అయినా వెనక్కి తగ్గని ఆదివాసేతరులు మళ్లీ హైకోర్టులో రెండోసారి పిటీషన్‌‌ దాఖలు చేశారు. దీనిపై కూడా పదేండ్లుగా సుదీర్ఘమైన వాదోపవాదనలు జరిగిన తర్వాత బుధవారం హైకోర్టు చీఫ్‌‌ జస్టిస్​ తుది తీర్పు ఇచ్చారు. 
 

పదిహేనేండ్లుగా లోకల్​ బాడీ ఎన్నికలకు బ్రేక్‌‌

మండలంలోని 23 రెవెన్యూ గ్రామాలపై  హైకోర్టులో కేసు ఉండడంతో పదిహేనేండ్లుగా ఈ మండలంలో లోకల్​ బాడీ ఎన్నికలు జరగడం లేదు. ఉమ్మడి వరంగల్‌‌ జిల్లాలో ఉన్న మంగపేట మండలంలో 2014 ఏప్రిల్​ 6న  మండల, జిల్లా పరిషత్​ ఎన్నికలు జరిగాయి. జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రొటేషన్​ పద్ధతిలో రిజర్వేషన్లు ప్రకటించారు. పోలింగ్‌‌ పూర్తి అయ్యి  విజేతలకు ఆఫీసర్లు సర్టిఫికెట్లు కూడా ఇచ్చారు. అయితే షెడ్యూల్​, నాన్​ షెడ్యూల్​ అంశం కోర్టు పరిధిలోనే ఉండడంతో ఎంపీటీసీలుగా గెలిచిన వారు కనీసం ప్రమాణ స్వీకారం కూడా చేయలేదు. దీంతో ఎంపీపీ ఎన్నిక జరగలేదు. 

ఎంపీటీసీలుగా గెలిచిన వారంతా ఎలాంటి ప్రోటోకాల్‌‌ పొందలేదు. జడ్పీటీసీకి మాత్రం ప్రభుత్వ ప్రొటోకాల్‌‌ ఇచ్చారు. అన్ని ప్రభుత్వ కార్యక్రమాల్లో జడ్పీటీసీ పాల్గొనేవారు.  ఫండ్స్​ కేటాయింపు లేదు. జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా ఈ మండలంలో వాయిదా పడ్డాయి.  

  • 2018‒19లో 25 గ్రామ పంచాయతీలుండగా 25 సర్పంచ్​ స్థానాలతో పాటు ప్రతీ పంచాయతీలో 50 శాతం వార్డు  స్థానాలను ఆదివాసీలకు కేటాయించడంతో  ఆదివాసేతరులు మరోసారి  కోర్టును ఆశ్రయించారు. నామినేషన్ల స్వీకరణ, పరిశీలన పూర్తి అయ్యాక కోర్టు స్టే ఇవ్వడంతో  ఆఫీసర్లు గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌‌ నిర్వహించలేదు. అప్పటికే నర్సాయిగూడెం సర్పంచ్‌, వార్డుమెంబర్లు ఏకగ్రీవం అయ్యాయి. కానీ బాధ్యతలు స్వీకరించలేదు. 
  •  ములుగు కొత్త జిల్లాగా ఆవిర్భవించాక జిల్లా పరిషత్‌‌ ఏర్పాటులో భాగంగా మంగపేట జడ్పీటీసీని జనరల్‌‌ మహిళకు  కేటాయించారు.  ఎంపీపీని ఎస్టీ మహిళకు, 14 ఎంపీటీసీ స్థానాలలో 7 గిరిజనులకు, మిగతా 7 గిరిజనేతరులకు రిజర్వేషన్లు ప్రకటించారు. రిజర్వేషన్ల విషయమై ఆదివాసీ, ఆదివాసేతరులు వేర్వేరుగా కోర్టును ఆశ్రయించగా కోర్టు స్టే ఇచ్చింది. దీంతో ఎన్నికల కమిషన్‌‌ విడుదల చేసిన నోటిఫికేషన్‌‌లో ఈ మండలం పేరును పక్కన పెట్టింది. ఇక్కడ పరిషత్‌ ‌ఎన్నికలు వాయిదా వేసినట్లు ప్రకటించింది. దీంతో రాష్ట్రంలోనే స్థానిక ప్రజాప్రతినిధుల ప్రాతినిధ్యం లేని ఏకైక మండలంగా మంగపేట నిలిచింది. 

మంగపేటలో ఆదివాసీల సంబరాలు

మండలంలోని 23 రెవెన్యూ గ్రామాలు  ఐదో షెడ్యూల్  పరిధిలోకి వస్తాయని  హైకోర్టు చీఫ్‌‌ జస్టిస్​ ఉజ్జల్‌‌ భూయాన్‌‌ బెంచ్‌‌ తీర్పు ఇచ్చిన నేపథ్యంలో బుధవారం ఆదివాసీ అనుబంధ సంఘాల నాయకులు మంగపేటకు చేరుకుని సంబరాల్లో మునిగి పోయారు. 73 ఏండ్ల సుదీర్ఘ పోరాట ఫలితంగానే తమ హక్కులను తాము సాధించుకున్నామని ఆదివాసీ ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు.  స్వీట్లు పంచి పెట్టారు.  కార్యక్రమంలో ఆదివాసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గొప్ప వీరయ్య తదితరులు పాల్గొన్నారు. 

ఐదో షెడ్యూల్​లో ఏముంది? 

రాజ్యాంగంలోని ఐదో షెడ్యూల్‌‌ ప్రకారం.. గ్రామాల్లో ఆదివాసీల స్వయం పరిపాలన  కొనసాగుతుంది.  వీరికి రాష్ట్రపతి బాస్‌‌. ఇక్కడ ఏదీ చేయాలన్నా ఆదివాసీలే ఏకమై నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది.  పెసా గ్రామ కమిటీలు సాయపడ్తాయి.  గిరిజనుల(ఆదివాసీల) ఆచార సంప్రదాయాలు, భూములు, ఆస్తులకు రక్షణ ఉంటుంది. ఈ గ్రామాల్లో భూములు కొనాలంటే గిరిజనులకు తప్ప గిరిజనేతరులకు అవకాశం ఉండదు.  ఇక్కడ ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో గిరిజనులకే ప్రాధాన్యత.  లోకల్​ బాడీ ఎలక్షన్లలో వంద శాతం రిజర్వేషన్లు గిరిజనులకే దక్కుతాయి. 

సర్పంచ్‌‌లు, ఎంపీటీసీలంతా వీళ్లే ఉంటారు.  తెలంగాణలో 9 జిల్లాలు ఐదో షెడ్యూల్‌‌ పరిధిలో ఉన్నాయి. ఆదిలాబాద్, కుమ్రంభీం -ఆసిఫాబాద్, మంచిర్యాల, ములుగు, వరంగల్, మహబూబాబాద్, భద్రాద్రి -కొత్తగూడెం, ఖమ్మం, నాగర్ కర్నూల్ జిల్లాలలో కలిపి  85 మండలాల్లో 1,180 షెడ్యూల్డ్ గ్రామాలున్నాయి.