
- వరంగల్ ఏనుమాముల మామిడి మార్కెట్లో వ్యాపారుల ఇష్టారాజ్యం
- సీజన్స్టార్టింగ్లో టన్ను రూ.1.22 లక్షలు.. ఇప్పుడు రూ.30 వేల లోపే
- అకాల వర్షాలతో తగ్గిన దిగుబడి
- గిట్టుబాటు కాక నష్టపోతున్నామంటున్న రైతులు
హనుమకొండ/ కాశీబుగ్గ, వెలుగు: వరంగల్ లో మామిడి రైతులను వ్యాపారులు నిండా ముంచుతున్నారు. ఇప్పటికే అకాల వర్షాలు, ఈదురుగాలులతో కాయ రాలి, దిగుబడి తగ్గిపోగా, దక్కిన పంటను తీసుకొస్తే మార్కెట్ లో నిలువు దోపిడీ చేస్తున్నారు. వ్యాపారులంతా సిండికేట్గా మారి క్వాలిటీ, సైజును సాకుగా చూపుతూ ఇష్టారీతిన ధర పడగొడుతున్నారు. దీంతో సరైన రేటు దక్కక రైతులు నష్టపోతున్నారు. కాగా, మార్కెట్ లో రైతులు తెచ్చిన కాయలకు కిలో సగటున రూ.20 చొప్పున ధర కట్టిస్తుండగా, అవే పండ్లు రిటైల్మార్కెట్లో రూ.వంద చొప్పున అమ్ముతుండటం గమనార్హం. ధర విషయంలో వ్యాపారులు దగా చేస్తుండగా, ఓవైపు దిగుబడి తగ్గి, మరోవైపు గిట్టుబాటు ధర లేక నష్టపోవాల్సి వస్తోందని రైతులు
వాపోతున్నారు.
దిగుబడిపై వాతావరణం ఎఫెక్ట్..
రాష్ట్ర వ్యాప్తంగా 2.85 లక్షల ఎకరాల మేర మామిడి తోటలు ఉండగా, అందులో ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే దాదాపుగా 34 వేల ఎకరాల వరకు మామిడి సాగు అవుతోంది. ఎక్కువ శాతం బంగినపల్లి సాగు చేస్తుండగా, ఆ తర్వాత కేసరి, హిమాయత్, తోతాపురి, సువర్ణరేఖ, నీలం, రసాలు తదితర రకాలు పండిస్తున్నారు. కాగా, ఉమ్మడి జిల్లాలో సగటున లక్ష టన్నులకుపైగానే దిగుబడి వస్తుందని అంచనా వేయగా, అకాల వర్షాలు, ఈదురుగాలులు, వాతావరణ పరిస్థితుల వల్ల 60 వేల నుంచి 80 వేల టన్నులే వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. ఎకరాకు 3 నుంచి 3.5 టన్నుల వరకు వస్తుందనుకున్న దిగుబడి ఒకటిన్నర, రెండు టన్నులకే పరిమితమైందని రైతులు చెబుతున్నారు.
వ్యాపారుల సిండికేట్ దందా..
సీజన్ నేపథ్యంలో వరంగల్ ఏనుమాముల సమీపంలోని ముసలమ్మకుంటలో ప్రత్యేకంగా మామిడి మార్కెట్ ఏర్పాటు చేశారు. ఉమ్మడి జిల్లాతోపాటు ఇతర ప్రాంతాల నుంచి మామిడి కాయలు తీసుకొస్తుండగా, ఇక్కడి నుంచి మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బిహార్, అస్సాం, హరియాణా, పంజాబ్, జమ్మూకశ్మీర్, చత్తీస్గడ్, ఢిల్లీ, రాజస్థాన్, గుజరాత్ తదితర రాష్ట్రాలకు వ్యాపారులు ఎక్స్పోర్ట్ చేస్తుంటారు. కాగా, వాతావరణ పరిస్థితుల వల్ల దిగుబడిరాక ఇబ్బందులు పడుతున్న రైతులను మార్కెట్లో వ్యాపారులంతా సిండికేట్గా మారి దగా చేస్తున్నారు.
సైజ్చిన్నగా ఉందని, క్వాలిటీ సరిగా లేదని సాకులు చెబుతూ ఇష్టమొచ్చినట్లు ధర డిసైడ్చేస్తూ మేలు రకం పండ్లకు కూడా ధర కట్టియ్యకుండా మోసం చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఆశించిన దిగుబడి రాకపోవడం, వచ్చిన పంటకు వ్యాపారులు సరైన ధర నిర్ణయించక నష్టపోవాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్ లో హమాలీ ఛార్జీలు, కమీషన్ పేరిట కూడా దోపిడీ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.
మొదట్లో రూ.1.2 లక్షలు.. ఇప్పుడు 30 వేల లోపే..
ఈ ఏడాది సీజన్ప్రారంభంలో వరంగల్ ఏనుమాముల ముసలమ్మకుంటలోని మామిడి మార్కెట్ లో బంగినపల్లి రకానికి రికార్డు స్థాయి ధర దక్కింది. మార్చి 20న టన్ను బంగినపల్లి మామిడి రూ.1.22 లక్షల రికార్డు ధర దక్కించుకోగా, గడిచిన మూడు, నాలుగు రోజుల్లో వ్యాపారులంతా కుమ్మక్కై రేటు తీవ్రంగా తగ్గిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ నెల 3న మార్కెట్ కు 329 టన్నుల మామిడి రాగా అత్యధికంగా ఒక రైతుకు రూ.50 వేల ధర దక్కింది. 4న 340 టన్నులు, 5న 280 టన్నులు రాగా, కొంతమందికి టన్నుకు రూ.30 వేల వరకు ధర కట్టించి, మిగతా వారికి రూ.10 వేల లోపు మాత్రమే ఇస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.
మరోవైపు వ్యాపారుల మాయాజాలంతో మామిడి రైతుకు సగటున కిలోకు రూ.20 మాత్రమే దక్కుతుండగా, బహిరంగ మార్కెట్లో మాత్రం మామిడి పండ్ల ధర రూ.80 నుంచి రూ.100 వరకు పలుకుతోంది. వాస్తవానికి వ్యాపారుల సిండికేట్ దందాకు చెక్ పెట్టేందుకు అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉండగా, దాదాపు మూడు నెలలుగా ఏనుమాముల మార్కెట్ సెక్రటరీ పోస్ట్ ఖాళీగా ఉంది. ఆ స్థానంలో నర్సంపేట మార్కెట్ సెక్రటరీకి ఇన్చార్జి బాధ్యతలు ఇచ్చినా పెద్దగా ఫలితం ఉండటం లేదనే ఆరోపణలున్నాయి. ఇప్పటికైనా మార్కెట్ లో సిండికేట్ వ్యాపారానికి చెక్ పెట్టి, తమకు గిట్టుబాటు ధర కల్పించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని మామిడి రైతులు వేడుకుంటున్నారు.
రైతులను ముంచుతుండ్రు..
నేను మార్కెట్ కు రెండు టన్నుల మామిడి తీసుకొచ్చిన. టన్నుకు రూ.20 వేలు మాత్రమే పడింది. దళారుల కమీషన్, ఇతర ఖర్చులు పోనూ రూ.30 వేలు మిగుల్తాయి. ఇందులో కూలీలు, ట్రాన్స్పోర్టు ఖర్చు రూ.15 వేల వరకు పోతున్నయ్. మిగిలిన రూ.15 వేలతో తోటకు మందులు, దున్నకం, ఇతర ఖర్చులు ఎలా ఎల్తయ్. ఈసారి మామిడి రైతులకు ఏం మిగిలేటట్టు లేదు. మార్కెట్ లో అందరూ కుమ్మక్కై రైతులను ముంచుతున్నరు. మధు, మామిడి రైతు, గోవిందరావుపేట
డిమాండ్ లేక ధర డౌన్..
అకాల వర్షాలు, ఈదురుగాలుల వల్ల మామిడి పంటకు నష్ట వాటిల్లింది. దాంతో క్వాలిటీ కూడా దెబ్బతింటోంది. ఇతర రాష్ట్రాల మార్కెట్ లో సరైన డిమాండ్లేక ధర తగ్గుతోంది. మార్కెట్ లో సిండికేట్ వ్యాపారానికి ఆస్కారం లేకుండా తగిన చర్యలు తీసుకుంటాం.
రెడ్డినాయక్, ఏనుమాముల మార్కెట్ ఇన్చార్జి సెక్రటరీ