మణిపూర్ లో EVMలను తగలబెట్టారు..

మణిపూర్ లో EVMలను తగలబెట్టారు..

లోక్ సభ ఎన్నికలకు ఏప్రిల్ 19న  మొదటి విడత పోలింగ్  జరిగిన సంగతి తెలిసిందే. ఫస్ట్ ఫేజ్​లో  21 రాష్ట్రాలు, యూటీల్లోని 102 ఎంపీ సీట్లకు పోలింగ్ జరిగింది. అయితే  మణిపూర్ లోని  కొన్ని చోట్ల హింసాత్మక ఘటనలు జరిగాయి. చాలా చోట్ల కాల్పులు జరగ్గా..కొన్ని చోట్ల ఈవీఎంలను కాలబెట్టారు. మరికొన్ని చోట్ల పగలగొట్టారు. 

మణిపూర్  ఇంఫాల్ ఈస్ట్ జిల్లా మోయిరంగ్ కాంపూ సాజెబ్​లోని పోలింగ్ బూత్  దగ్గర కొందరు దుండగులు జరిపిన కాల్పుల్లో ఓ వృద్ధుడు గాయపడ్డాడు. మోయిరంగ్ సెగ్మెంట్​లోని తామ్నాపోక్పీ పోలింగ్ బూత్ వద్ద కూడా కొందరు గాలిలోకి కాల్పులు జరుపుతూ ఓటర్లను భయభ్రాంతులకు గురిచేశారు. ఖోంగ్‌‌‌‌మాన్ జోన్ 4 పోలింగ్ స్టేషన్​లో ఓటర్లు, సాయుధ దుండగులకు మధ్య జరిగిన ఘర్షణలో ఈవీఎంలు కాలిపోయాయి. ధ్వంసం అయ్యాయి.  మణిపూర్ బూత్ లలో ప్రజలను ఓట్లు వేయకుండా అడ్డుకుంటున్నారని ఆరోపణలు వచ్చాయి. సుంగులో ఓ వ్యక్తిని బీజేపీ నేతలు కొట్టి ఓటు వేయకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. 

క్షేత్రీగావ్ అసెంబ్లీ నియోజకవర్గంలోని బామోన్ కాంపు, కక్చింగ్‌లోని సెక్‌మైజిన్ ఖునావో మమాంగ్, ఇంఫాల్ ఈస్ట్‌లోని థోంగ్జు అసెంబ్లీ నియోజకవర్గం, ఇంఫాల్ వెస్ట్‌లోని ఇరోయిషెంబా మమాంగ్ లైకై , ఉరిపోక్ అసెంబ్లీ నియోజకవర్గం, థాంగ్‌మన్ జోన్ అసెంబ్లీ నియోజక వర్గంతో సహా ఇంఫాల్‌లోని  పలు  పోలింగ్ స్టేషన్‌లలో ఈవీఎంలను ధ్వంసం చేశారు. బిష్ణుపులోని మొయిరాంగ్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని థమ్నాపోక్పి పోలింగ్ కేంద్రం దగ్గర గుర్తు తెలియని వ్యక్తులు దాదాపు 30 రౌండ్లు కాల్పులు జరిపారు.

అయితే  ఇంఫాల్ తూర్పు జిల్లాలోని పోలింగ్ స్టేషన్ సమీపంలో కాల్పుల ఘటనలో పాల్గొన్న ముగ్గురు వ్యక్తులను మణిపూర్ పోలీసులు అరెస్టు  చేసినట్లు ఓ అధికారి తెలిపారు. అరెస్టయిన ముగ్గురు వ్యక్తులు   ఇంఫాల్ తూర్పు జిల్లాలోని మోయిరంగకంపు సాజేబ్ వద్ద కాల్పుల ఘటనలో పాల్గొన్నారని తెలిపారు.  కాల్పుల ఘటన తర్వాత ముగ్గురు అక్కడి నుంచి కారులో  పారిపోయారని చెప్పారు. ఘటనా స్థలానికి 5 కిలోమీటర్ల  దూరంలో  అరెస్టు చేసినట్లు తెలిపారు.  వారి దగ్గరి నుంచి నుంచి ఒక  పిస్టల్‌తో పాటు మందుగుండు సామాగ్రి, రూ.15 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నాం..  కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని అధికారి తెలిపారు.