
గౌహతి: మణిపూర్‌లో హింసాత్మక ఘటనలు ఇంకా ఆగడం లేదు. గురువారం ఓ స్కూలు బయట నిలబడి ఉన్న మహిళను గుర్తుతెలియని దుండగులు కాల్చి చంపారు. ఇంఫాల్ వెస్ట్ డిస్ట్రిక్ట్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. స్కూళ్లను రీ ఓపెన్‌చేసిన మరుసటి రోజే ఈ ఘటన జరగడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఆ రాష్ట్రంలో జాతుల మధ్య ఏర్పడిన వైరంతో రెండు నెలలుగా స్కూళ్లను మూసివేసి.. బుధవారమే రీఓపెన్చేశారు.
మృతిచెందిన మహిళ ఎవరన్నది ఇంకా తెలియలేదని పోలీసులు తెలిపారు. మరో ఘటనలో.. తౌబల్ జిల్లాలో ఇండియన్ రిజర్వ్ బెటాలియన్(ఐఆర్బీ)కు చెందిన ఓ జవాన్ ఇంటిని అల్లరిమూకలు దహనం చేశాయి. పోలీసు ఆయుధశాల నుంచి తుపాకులను దోచుకెళ్లకుండా అడ్డుకున్నందుకు ఈ చర్యకు పాల్పడ్డారు. ఈ సందర్భంగా జరిగిన ఘర్షణలో 11 మందికి గాయాలయ్యాయి. ఇందులో రొనాల్డో(27) అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని ఇంఫాల్‌లోని హాస్పిటల్‌కు తీసుకెళ్తుండగా మరణించాడు. మరో 10 మంది ట్రీట్మెంట్ పొందుతున్నారు. అందులో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది.