మణిపూర్ అల్లర్లు ఇంకానా?.. అసలు కారణాలు.

మణిపూర్ అల్లర్లు ఇంకానా?.. అసలు కారణాలు.

ఈశాన్య రాష్ట్రాల్లో రత్నాల భూమిగా, సిట్జర్లాండ్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన మణిపూర్​లో​ హింస ఇంకా కొనసాగుతున్నది. ఈ ఏడాది మే 3 నుంచి మొదలైన జాతుల మధ్య ఘర్షణ వందల మందిని బలిగొంది. ఇదీగాక మణిపూర్‌‌‌‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన వెలుగులోకి వచ్చి దేశం మొత్తం ఆ చర్యను తీవ్రంగా ఖండించగా.. పార్లమెంట్​సమావేశాల ముందు ఎట్టకేలకు ప్రధాని మోడీ స్పందించారు. మణిపూర్ ఘటన సిగ్గుపడాల్సిన విషయంగా ఆయన పేర్కొన్నారు. అమానవీయ ఘటనలకు ఎవరు పాల్పడినా ఉపేక్షించబోమని తేల్చి చెప్పారు. అయితే నెలల తరబడి మణిపూర్ అల్లకల్లోల వాతావరణంలో అట్టుడికితే.. ప్రధాని ఇప్పుడా స్పందించేదంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సుప్రీంకోర్టు కూడా తీవ్ర స్థాయిలో స్పందించింది. 

అసలు కారణాలు..

మణిపూర్​లో సంక్షోభం తలెత్తడానికి అనేక తక్షణ, దీర్ఘకాలిక కారణాలు ఉన్నాయి. సుమారు 35 గిరిజన తెగలున్నప్పటికీ ప్రధాన తెగలు మూడే. వీరు మైటీ, నాగా, కుకీ తెగలు. మొత్తం జనాభాలో 53% గా ఉన్న మైటీలు అధిక సంఖ్యాకులే గాక రాష్ట్రం మధ్యలో గల ఇంఫాల్ లోయలో నివసిస్తున్నారు. వీరు రాష్ట్రంలో ప్రభావవంతమైన వర్గంగా ఉన్నారు. నాగా కుకీ ఇతర తెగలన్నీ కలిపి 47% గా ఉన్న వీరు ఇంఫాల్ లోయ చుట్టూ గల కొండ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. ప్రస్తుతం ఎస్సీ, ఓబీసీ హోదాతో ఉన్న మైటీలు నాగ కుకీ లాగా ఎస్టీ హోదా కావాలని 2012 నుంచి డిమాండ్ చేస్తున్నారు. తాజాగా మణిపూర్ హైకోర్టు ఈ డిమాండ్ ను పరిశీలించి నాలుగు వారాల్లోగా అభిప్రాయం తెలపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనిపై ప్రభుత్వం ఇంకా స్పందించాల్సి ఉంది. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తే తమకు నష్టం జరుగుతుందని నాగ,  కుకీ తెగల వారు మైటీలతో ఘర్షణ పడటం వల్ల హింస మొదలైంది.

ఇదీగాక 53శాతంగా ఉన్న మైటి ప్రజల చేతుల్లో10 శాతం భూమి మాత్రమే ఉండగా 47%  ఉన్న నాగ కుకీల చేతుల్లో 90% భూమి ఉంది. ఇంఫాల్ లోయలో తరుగుతున్న వనరులు, పెరిగిన జనాభా, నిరుద్యోగం, లోయలోకి వలసలు పెరగడం, తదితర కారణాల వల్ల మైటీయులు కొండ ప్రాంతాలకు విస్తరించాలని అనుకుంటున్నారు. కానీ ప్రస్తుత చట్టాల ప్రకారం ఎస్టీ హోదా గల వారే కొండ ప్రాంతాల్లో భూములు కొనుగోలు చేయాలి. అందువల్ల తమకు కూడా షెడ్యూల్డ్ తెగ హోదా కల్పించాలని మైటీలు ఉద్యమిస్తున్నారు. దీన్ని నాగ, కుకీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.  అయితే మే నెలలో ఇద్దరు మహిళలను ఓ గుంపు నగ్నంగా ఊరేగించిన వీడియో దేశవ్యాప్తంగా వైరల్​కావడంపై బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. పార్లమెంట్​ సమావేశాల మొదటి రోజు మణిపూర్​ అంశంపై సభ దద్దరిల్లింది. అల్లర్లకు ప్రభుత్వాలు ఎప్పుడు ఫుల్​స్టాప్​ పెడతాయో చూడాలి.

- తండ ప్రభాకర్ గౌడ్, సోషల్​ ఎనలిస్ట్​