
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు అస్సాం కోర్టు సమన్లు జారీ చేసింది. ఆ రాష్ట్ర సీఎం హిమంత బిస్వా శర్మ దాఖలు చేసిన పరువు నష్టం కేసుకు సంబంధించి సెప్టెంబర్ 29న తమ ముందు హాజరుకావాలని కమ్రూప్ కోర్టు ఆఫ్ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ సిసోడియాను ఆదేశించింది. అస్సాం సీఎం సిసోడియాపై జూలై 1న పరువు నష్టం దావా వేశారు.
2020లో హిమంత బిస్వా శర్మ ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న టైమ్ లో పీపీఈ కిట్ల కొనుగోళ్ల కాంట్రాక్ట్‌లో అవతవకలు జరిగాయని సిసోడియా ఆరోపించారు. అధిక ధరలకు ఈ కాంట్రాక్ట్‌ను ఆయన భార్యకు చెందిన కంపెనీకి ఇచ్చినట్లు సిసోడియా పేర్కొన్నారు. మార్కెట్ లో తక్కువ ధర ఉన్నప్పటికీ ఒక్కో కిట్‌కు రూ. 990 అధిక ధరను చెల్లించారని.. అందుకు సంబంధించిన పత్రాలు తన వద్ద ఉన్నాయని సిసోడియా పేర్కొన్నారు. అయితే సిసోడియా చేసిన కామెంట్స్ ను ఖండించిన హిమంత బిస్వా శర్మ దంపతులు.. అనంతరం సిసోడియాపై శర్మ పరువునష్టం కేసు వేశారు.