దుబాయ్: బాల్‌ను పాలిష్ చేసేందుకు దానిపై ఉమ్మి (సలైవా)ని రాయడాన్ని ఐసీసీ శాశ్వతంగా నిషేధించింది. కరోనా టైమ్‌లో దీనిపై రెండేళ్ల నిషేధం విధించగా.. ఇకపై కూడా దాన్ని కొనసాగించాలని ఐసీసీ నిర్ణయించింది. అలాగే, నాన్ స్ట్రయికర్‌ను బౌలర్ రనౌట్ చేయడాన్ని ‘అన్ ఫెయిర్’ సెక్షన్ నుంచి రనౌట్ సెక్షన్‌లోకి మార్చింది. గతంలో దీన్ని మన్కడింగ్ అని పిలిచే వాళ్లు. ఇకపై దీన్ని కూడా రనౌట్‌గా పరిగణిస్తారు. వీటితో పాటు ప్లేయింగ్ కండిషన్స్‌లో ఐసీసీ పలు మార్పులు చేసింది. బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ నేతృత్వంలోని ఐసీసీ క్రికెట్ కమిటీ చేసిన సిఫార్సులకు చీఫ్ ఎగ్జిక్యూటివ్స్ కమిటీ (సీఈసీ) ఆమోదం లభించిన తర్వాత ఈ మార్పులను ప్రకటించింది. ఇవి అక్టోబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయి.
మారిన ఇతర నిబంధనలు
- క్యాచ్ ఔట్ తర్వాత బ్యాటర్లు క్రాస్ అయిన విషయంతో సంబంధం లేకుండా కొత్త బ్యాటరే స్ట్రయికింగ్ తీసుకోవాలి.
- ఔట్ తర్వాత ఇన్‌కమింగ్ బ్యాటర్ టెస్టులు, వన్డేల్లో ఇకపై మూడు నిమిషాలు కాకుండా రెండు నిమిషాల్లోనే స్ట్రయిక్ తీసుకోవాలి. టీ20ల్లో 90 సెకండ్లలో స్ట్రయిక్ తీసుకోవాల్సిన రూల్‌లో మార్పు లేదు.
- బాల్‌ను ఎదుర్కొనేటప్పుడు స్ట్రయికర్ కానీ, అతని బ్యాట్‌లో కొంత భాగమైనా క్రీజులో ఉండాలి. లేదంటే అంపైర్ నో బాల్‌గా ప్రకటిస్తాడు. అలాగే, బ్యాటర్ పిచ్ బయటకు వచ్చి ఆడేలా బౌలర్ బాల్ వేస్తే దాన్ని నోబాల్‌గా ప్రకటిస్తాడు.
- బౌలింగ్ చేసేందుకు బౌలర్ రన్నింగ్ చేస్తుండగా.. గ్రౌండ్‌లో ఏ ప్లేయర్ అయినా అనుచితంగా, ఉద్దేశపూర్వకంగా కదిలినట్టు గుర్తిస్తే అంపైర్ దాన్ని డెడ్ బాల్‌గా ప్రకటించి.. బ్యాటింగ్ సైడ్‌కు ఐదు రన్స్ పెనాల్టీగా ఇస్తాడు.
- బౌలర్లు డెలివరీ వేసేందుకు ప్రాక్టీస్ కోసం బంతిని స్ట్రయికర్ ఎండ్ వైపు విసిరి బ్యాటర్‌ను రనౌట్ చేసే ప్రయత్నాన్ని ఇకపై పరిగణనలోకి తీసుకోరు.
- బంతి వేసేముందే బ్యాటర్ వికెట్ల ముందుకు జరిగి ఆడేందుకు ప్రయత్నించిన సందర్భాల్లో బౌలర్లు త్రో చేసి అతడిని రనౌట్ చేసేందుకు ప్రయత్నించే వాళ్లు. ఇకపై దాన్ని డెడ్ బాల్‌గా పరిగణిస్తారు.
- టీ20ల్లో బౌలింగ్ జట్టు నిర్ణీత సమయంలో ఓవర్లు పూర్తి చేయకపోతే... ఇన్ మ్యాచ్ పెనాల్టీగా సర్కిల్ అవతల నుంచి ఒక ఫీల్డర్‌ను తగ్గిస్తున్నారు. ఈ రూల్‌ను వన్డేల్లో కూడా అమలు చేయాలని ఐసీసీ నిర్ణయించింది. 2023 వన్డే వరల్డ్ కప్ సూపర్ లీగ్ తర్వాత వన్డేల్లో ఈ రూల్‌ను ప్రవేశ పెడతారు.
