
- సెక్రటేరియెట్‌తోపాటు జిల్లాల్లో పేరుకుపోతున్నయ్
- రెవెన్యూ, హెల్త్, పంచాయతీరాజ్, ఇండస్ట్రీస్ వంటి డిపార్ట్‌మెంట్లలో కుప్పలు తెప్పలుగా వినతులు
- కీలక శాఖలకు హెచ్‌ఓడీలు లేరు.. ఉన్నవాటిల్లోనూ ఆఫీసర్ల సెలవులు, పర్యటనలు
- నెలల తరబడి సెక్షన్ల చుట్టూ తిరుగుతున్న ఫైళ్లు
- సమస్యలు పరిష్కారం కాక ప్రజల అరిగోస.. కిందిస్థాయి ఉద్యోగులకూ తప్పని తిప్పలు
హైదరాబాద్, వెలుగు: సర్కార్ ఆఫీసుల్లో ఫైల్స్ ముందుకు కదలడం లేదు. ప్రజలు పెట్టుకుంటున్న అర్జీలను అసలు పట్టించుకోవడం లేదు. దీంతో రాష్ట్ర సెక్రటేరియెట్‌తోపాటు జిల్లాల్లో ఒక్కో ఫైల్ నెలల తరబడి సెక్షన్ల చుట్టూనే తిరుగుతున్నాయి. సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదు. కొన్ని డిపార్ట్ మెంట్లకు హెచ్‌ఓడీ (ప్రిన్సిపల్ సెక్రటరీ)లు లేకపోవడంతో జీవోలు, సర్క్యులర్స్ కూడా ఇవ్వడం లేదు. ప్రతినెలలో ఇద్దరు, ముగ్గురు సీనియర్ ఐఏఎస్‌లు ఢిల్లీకి చక్కర్లు కొడుతుండటం, కొందరు ఆడపాదడపా సెలవులు పెడుతుండగా, ఇటీవల ఏపీ క్యాడర్ ఇష్యూ రావడంతో ఆ ఐఏఎస్‌లు లీగల్ అడ్వైజ్ కోసం అడ్వొకేట్ల చుట్టూ తిరుగుతున్నారు. కొందరు ఆఫీసులకు వస్తున్నా.. ఎక్కువ సేపు ఉండటం లేదు. వెంటనే వెళ్లిపోతున్నారు.
ప్రధానంగా రెవెన్యూ, పంచాయతీరాజ్, ఆర్ అండ్ డీ, వెల్ఫేర్, హోం, ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్లలో ఫైల్స్ పేరుకుపోయాయి. కలెక్టరేట్లలో భూములకు సంబంధించి ధరణిలో సమస్యపై వచ్చిన అప్లికేషన్ ఫైల్స్, డబుల్ బెడ్రూం ఇండ్లు, ఇతర ప్రభుత్వ స్కీంలు, సమస్యల పరిష్కారం కోసం పెట్టుకున్న వినతులు వేల సంఖ్యలో పెండింగ్‌లో పడ్డాయి. హెల్త్ లో రీయింబర్స్ మెంట్‌కు సంబంధించిన ఫైల్స్ కూడా వేల సంఖ్యలోనే ఉన్నాయి. ఏడాది, రెండేండ్లకు కూడా వాటిని క్లియర్ చేయడం లేదు.
డిపార్ట్ మెంట్లకు సార్లు లేరు
రెవెన్యూ, రెరా, ఎక్సైజ్, సీసీఎల్ఏ, మైన్స్, స్టాంప్స్ అండ్ రిజిస్ర్టేషన్స్ వంటి కీలక శాఖలకు ప్రిన్సిపల్ సెక్రటరీని ప్రభుత్వం నియమించలేదు. కీలకమైన ఈ డిపార్ట్మెంట్లకు హెచ్ఓడీలు లేకపోవడంతో ఫైల్స్ అన్నీ మూలుగుతున్నాయి. ఉద్యోగుల సర్వీస్ దగ్గర నుంచి రెవెన్యూలో తీసుకోవాల్సిన నిర్ణయాలు, ఎప్పటికప్పుడు ధరణి, భూముల సమస్యలకు సంబంధించి జిల్లా కలెక్టర్లతో అనుసంధానం చేసుకోవాల్సినవి ఎక్కడివక్కడే ఉండిపోయాయి. అంతకుముందు ఈ శాఖలను సీనియర్ ఐఏఎస్ సోమేశ్ కుమార్ చూశారు. ఇటీవలి హైకోర్టు ఆదేశాలు, డీవోపీటీ ఉత్తర్వులతో ఏపీ క్యాడర్‌కు ఆయన వెళ్లిపోయారు. అప్పటి నుంచి ప్రభుత్వం కొత్తగా ఎవరినీ నియమించకపోవడంతో సంబంధిత ఫైల్స్ అట్లనే ఉండిపోతున్నాయి. కొత్త సీఎస్‌గా శాంతి కుమారి వచ్చినప్పటికీ.. ఆమెకు ప్రభుత్వం నుంచి శాఖల నిర్వహణపై ఎలాంటి ఆదేశాలు రాలేదు. దీంతో వివిధ ప్రభుత్వ అవసరాలకు కేటాయించాల్సిన భూములు, ఎక్స్ సర్వీస్మెన్లకు చెందిన ఫైల్స్ పెండింగ్‌లో ఉన్నాయి.
సెక్రటరీల ఇంటికి.. ఆఫీస్‌కు తిరుగుతున్నయ్
రాష్ట్ర సెక్రటేరియెట్‌లోని హోం, ఇండస్ర్టీస్, ఆర్ అండ్ బీతోపాటు వెల్ఫేర్ డిపార్ట్మెంట్లలోనూ వేల సంఖ్యలో ఫైల్స్ మూలుగుతున్నాయి. సెక్రటరీల ఇంటికి.. అటు నుంచి మళ్లీ ఆఫీస్‌కు బ్యాగుల్లో ఆఫీస్ సబార్డినేట్లు తిప్పుతున్నారు. జైళ్లకు సంబంధించి మరమ్మతులు, సర్వీస్ మ్యాటర్‌లో ఇబ్బందులు పడుతున్న పోలీసుల ఫైల్స్ దాదాపు 2 వేల పైనే హోం డిపార్ట్మెంట్లో పెండింగ్‌లో ఉన్నట్లు తెలిసింది. ఇప్పుడు ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ లీవ్‌లో ఉన్నారు. ఆర్ అండ్ బీలో డబుల్బెడ్రూం ఇండ్లకు సంబంధించి, సొంత జాగా ఉన్నోళ్లకు పైసలిచ్చే స్కీంపై ప్రతిపాదనలూ కాగితాల్లోనే ఉన్నాయి. రోడ్ల రిపేర్ల కోసం ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు ఇచ్చిన సిఫార్సులు, లెటర్ల ఫైల్స్ కూడా అట్లనే ఉంటున్నాయి. ఇండస్ర్టీస్‌కు సంబంధించి టీ ప్రైడ్ ఫైల్స్ ప్రాసెస్‌లోనే ఉన్నాయి. ఇన్సెంటివ్‌లకు సంబంధించి పెట్టుకున్న అప్లికేషన్లు మూలకుపడ్డాయి. టీఎస్ ఐపాస్ గురించి చెబుతున్నా.. అందులో అప్రూవల్ రావడమే కానీ.. క్షేత్రస్థాయిలో ఫైల్స్‌ను ముందుకు కదపడం లేదు. ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్.. విదేశాల నుంచి వచ్చేవాళ్లను కలవడానికి ఇచ్చే ప్రయారిటీ.. డిపార్ట్మెంట్కు వస్తున్న ఫైల్స్ చూసేందుకు ఇవ్వడం లేదన్న విమర్శలు ఉన్నాయి.
జిల్లాల్లో లక్షల్లో
జిల్లాల్లోనూ ఫైల్స్ పేరుకుపోతున్నాయి. మండల, డివిజన్ స్థాయి నుంచి కలెక్టరేట్ వరకు ధరణికి సంబంధించిన లక్షల ఫైల్స్ ఆయా కార్యాలయాల్లోనూ మూలుగుతున్నాయి. ఒక్కో జిల్లాలో 8, 9 నెలల నుంచి ఫైల్ ప్రాసెస్‌లోనే ఉంటున్నదని వాపోతున్నారు. భూములకు సంబంధించిన ఫైల్స్ ఎక్కువగా పెండింగ్‌లో పెడుతున్నారు. ఆసరా కోసం, రేషన్ కార్డుల కోసం పెట్టుకుంటున్న అప్లికేషన్లను పై స్థాయికి పంపడం లేదు. ప్రతి సోమవారం ప్రజావాణికి వచ్చే వినతులను తీసుకోవడం తప్పితే వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవడం లేదు.