అప్పుడు పోరాటం.. ఇప్పుడు అవమానాలు .. ఉద్యమకారుల పయనం ఎటు?

అప్పుడు పోరాటం.. ఇప్పుడు అవమానాలు ..  ఉద్యమకారుల పయనం ఎటు?
  • నాడు తెలంగాణ కోసం పోరాటం.. నేడు స్వరాష్ట్రంలో అవమానాలు
  • ఇతర పార్టీల నుంచి వచ్చినోళ్లకే  పదవుల్లో పెద్దపీట
  • ఈసారి కూడా ఎమ్మెల్యే టికెట్​ రాలేదని మనస్తాపం
  • గులాబీ పార్టీకి గుడ్​బై చెప్పే యోచనలో పలువురు లీడర్లు 

మంచిర్యాల, వెలుగు :  తెలంగాణ రాష్ర్ట సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసి బీఆర్ఎస్ ​పార్టీలో కొనసాగుతున్న పలువురు ఉద్యమకారులకు మరోసారి నిరాశే ఎదురైంది. అణిచివేతలు, అవమానాలు ఎదుర్కొంటూ ఉద్యమాలు చేసి స్వరాష్ట్రాన్ని సాధించుకుంటే ఎమ్మెల్యే టికెట్​రావడమే గగనంగా మారింది. ఇటీవల బీఆర్ఎస్ ​నుంచి115 మంది అభ్యర్థులను ప్రకటించగా, ఇందులో ఉద్యమంతో సంబంధం లేనివాళ్లు, ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్లే ఉన్నారు.  లిస్టులో ప్రకటించిన పలువురు ఎమ్మెల్యేపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నట్టు సర్వే రిపోర్టు వచ్చినా సిట్టింగ్​అనే కారణంతో మళ్లీ వాళ్లకే కట్టబెట్టారు. దీంతో బీఆర్ఎస్​ టికెట్లపై ఆశలు పెట్టుకున్న ఉద్యమకారులు అధినేత కేసీఆర్​ తీరుపై ఉడికిపోతున్నారు. కొందరు బీఆర్​ఎస్​ పార్టీకి గుడ్​బై చెప్పాలనుకుంటుండగా, మరికొందరు పార్టీలోనే ఉండి అభ్యర్థులను ఓడిస్తామని వార్నింగ్​ ఇస్తున్నారు.

ఆది నుంచీ అన్యాయమే..... 

తెలంగాణ రాష్ట్రం వచ్చాక బీఆర్ఎస్ ​కొంతమందికి ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా అవకాశమివ్వగా, మరికొంతమందికి చోటామోటా కొలువులు కట్టబెట్టింది. రాష్ర్ట స్థాయిలో కార్పొరేషన్ ​చైర్మన్లుగా నియమించినా పదవీకాలం పూర్తికాగానే చాలామంది తెరమరుగయ్యారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత టీడీపీ, కాంగ్రెస్​తో పాటు ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్లకే సీఎం కేసీఆర్ ప్రాధాన్యత ఇవ్వడంతో ఆయనతో కలిసి పనిచేసిన ఉద్యమకారులు నైరాశ్యంలో మునిగిపోయారు. 

కాంగ్రెస్​తో టచ్​లోకి ‘పురాణం’.... 

మంచిర్యాల జిల్లాకు చెందిన పురాణం సతీష్​కుమార్​ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ఆయన 2009 నుంచి 2016 వరకు ఉమ్మడి ఆదిలాబాద్ ​తూర్పు జిల్లా అధ్యక్షుడుగా బీఆర్ఎస్​ బలోపేతానికి కృషి చేశారు. 2016లో ఎమ్మెల్సీగా చాన్స్​ రాగా, 2022 వరకు ఆ పదవిలో కొనసాగారు. ఎమ్మెల్సీ రెన్యువల్​పై ఆశలు పెట్టుకున్నా మంత్రి కేటీఆర్​కు క్లోజ్​ అయిన దండె విఠల్​కు చాన్స్​ ఇవ్వడంతో నారాజ్​ అయ్యారు. తన సొంత నియోజకవర్గం చెన్నూర్​ ఎస్సీ రిజర్వుడ్​కావడంతో ఈసారి జనరల్ సెగ్మెంట్​అయిన మంచిర్యాల నుంచి బరిలోకి దిగడానికి రెడీ అయ్యారు. కానీ, అక్కడ అవకాశం లేకపోవడంతో ఇటీవల కాంగ్రెస్​పార్టీతో టచ్​లోకి వెళ్లినట్టు సమాచారం. చెన్నూర్​ సిట్టింగ్​ ఎమ్మెల్యే బాల్క సుమన్​కు చెక్​ పెట్టడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. 

నల్లాల పొలిటికల్ కేరీర్​ క్లోజ్ 

ఉద్యమకారుడు నల్లాల ఓదెలు వరుసగా 2009, 2010, 2014 ఎలక్షన్స్​లో గెలిచి హ్యాట్రిక్​ ఎమ్మెల్యేగా రికార్డు సాధించారు. అయినప్పటికీ, 2018 ఎన్నికల్లో ఆయనను పక్కనపెట్టి పెద్దపల్లి సిట్టింగ్​ఎంపీగా ఉన్న బాల్క సుమన్​కు చెన్నూర్​ను అప్పగించారు. ఓదెలు భార్య భాగ్యలక్ష్మికి జడ్పీ చైర్​ పర్సన్​గా చాన్స్ ఇచ్చి ఓదెలును అగణదొక్కారు. విసిగిపోయిన ఆయన ఆమధ్య కాంగ్రెస్​లోకి వెళ్లగా అక్కడ కోవర్టులతో పొమ్మనలేక పొగపెట్టించి తిరిగి గులాబీ గూటికి వచ్చేలా చేశారు. ఈసారి కూడా బాల్క సుమన్​కే టికెట్​ కేటాయించడంతో ఇక ఓదెలు పొలిటికల్​ కేరీర్​ క్లోజ్​అయినట్టేనని అనుచరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

ప్రవీణ్​కు ప్రతిసారి నిరాశే..

బెల్లంపల్లికి చెందిన రేణికుంట్ల ప్రవీణ్​కు కేసీఆర్​ ప్రతిసారి టికెట్ ​హామీ ఇవ్వడం, ఆపై పక్కన పెట్టడం పరిపాటైంది. 2014లో టీడీపీ నుంచి వచ్చిన దుర్గం చిన్నయ్యకు టికెట్​ఇవ్వగా, 2018లోనూ ఆయనకే కేటాయించారు. ఈ మధ్య కాలంలో చిన్నయ్య పలు వివాదాల్లో కూరుకుపోవడంతో చెక్​పెట్టే చాన్స్​ ఉన్నట్టు కనిపించింది. దీంతో ఈసారి టికెట్​తనకే వస్తుందని ప్రవీణ్​ ధీమాతో ఉన్నప్పటికీ మూడోసారీ ఆశాభంగం తప్పలేదు. ఆయన జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్​ పదవితోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 

ఖమ్మం జిల్లా మధిరకు చెందిన ఉద్యమకారుడు బొమ్మెర రామ్మూర్తి 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్  నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2016లో లింగాల కమల్ రాజు చేరిక తర్వాత 2018 ఎన్నికల్లో రామ్మూర్తికి టికెట్ దక్కలేదు. ఈసారైనా అవకాశమివ్వాలని కోరినా 2018 ఎన్నికల్లో ఓడిపోయి ప్రస్తుతం జడ్పీ చైర్మన్​గా ఉన్న కమల్ రాజుకే మళ్లీ బీఆర్ఎస్​ టికెట్ ఇచ్చింది. దీంతో రామ్మూర్తి అమరవీరుల స్తూపం దగ్గర ధర్నా చేశారు. 

ఉమ్మడి ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడిగా పని చేసిన తాళ్లూరి వెంకటేశ్వరరావుకు ఎమ్మెల్యే టికె ట్ ఇవ్వలేదు. జడ్పీ వైస్ చైర్మన్​గా ఉన్న కంచర్ల చంద్రశేఖర్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నాయకులు లేని టైమ్​లో టీఆర్ఎస్ కు పెద్దదిక్కుగా ఉండి ఉద్య మాన్ని నడిపారు. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. 2014లో కొత్తగూడెం టికెట్ ప్రకటించి చివరిక్షణంలో జలగం వెంకట్రావుకు  కేసీఆర్ బీఫామ్​ ఇచ్చారు. ఈసారి కూడా టికెట్ ​రాలేదు.   ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఉన్న దిండిగాల రాజేందర్​కు ఎమ్మెల్యే టికెట్​తో పాటు ఎమ్మెల్సీ ఊహాజనితమే అయింది. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవి ఇచ్చి అధిష్టానం చేతులు దులుపుకుంది. ఇల్లెందులో ఉద్యమంలో ఆది నుంచి పాల్గొన్న దేవీలాల్​ నాయక్​కు టికెట్ అందని ద్రాక్షగానే మారింది.

నిర్మల్ జిల్లా ముథోల్​ నియోజకవర్గానికి చెందిన జాదవ్ రాజేశ్​ బాబు అగ్రికల్చర్​ ఆఫీసర్​ఉద్యోగానికి రాజీనామా చేసి ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేశారు. టీఆర్ఎస్  గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. 2018లో ముథోల్ టికెట్ ఆశించినా దక్కలేదు. ఈసారి కూడా ఆయనను అధిష్టానం పక్కన పెట్టింది. బీఆర్ఎస్ అభ్యర్థిపై అసంతృప్తితో ఉన్న వారంతా రాజేశ్​బాబుకు మద్ద తు ప్రకటిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్​లో రాజే శ్​బాబుపై మంత్రి తలసాని చేయి చేసుకున్న సంఘటనను అనుకూలంగా మలచుకొని ఆయన మద్దతుదారులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. 

జగిత్యాలలో ప్రముఖ వ్యాపారవేత్త జితేందర్ రావు, కాంట్రాక్టర్  ఓరుగంటి రమణారావు కాంగ్రెస్ కంచుకోటలో తొలిసారి టీఆర్ఎస్  జెండా మోశారు. 2014 నుంచి టికెట్  ఆశిస్తున్నప్పటికీ వారి కల నెరవేరట్లేదు. 

నిజామాబాద్ జిల్లాలో బీసీ సామాజిక వర్గానికి చెందిన ఏఎస్.పోశెట్టి టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా, పొలిట్ బ్యూరో మెంబర్​గా వ్యవహరించారు. తెలంగాణ వచ్చిన తర్వాత నిజామాబాద్ అర్బన్ టికెట్ ఆశించారు. కవిత పొలిటికల్ ఎంట్రీతో ఆయన రాజకీయ జీవితం తలకిందులైంది. కవిత కోసం చేసిన సర్దుబాటుతో పోశెట్టి ఉనికి తగ్గుతూ మనుగడే కోల్పోయారు. బోధన్​లో జేఏసీ కన్వీనర్​గా ఉద్యమాన్ని నడిపించిన గోపాల్ రెడ్డిని కేసీఆర్, కవిత అందరూ మర్చిపోయారు. ఉద్యమం టైంలో కేసులతో కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. 

మెదక్​ జిల్లాకు చెందిన శేరి సుభాష్​రెడ్డి ఉద్యమం లో చురుకుగా పాల్గొని కేసీఆర్ రాజకీయ కార్యదర్శిగా ఎదిగారు. టీఎస్​ఎండీసీ చైర్మన్​గా,  ఎమ్మెల్సీగా చాన్స్​వచ్చినప్పటికీ ఎమ్మెల్యే కావాలనే కోరిక తీరలేదు. ఈసారి ఎమ్మెల్యే టికెట్ వస్తుందని ఆశించిన సుభాష్ రెడ్డికి చుక్కెదురైంది. 

గ్రేటర్ వరంగల్ కు చెందిన గుడిమల్ల రవికుమా ర్ అడ్వకేట్ గా, తెలంగాణ ఆటో డ్రైవర్స్ యూని యన్ (తాడు) రాష్ట్ర అధ్యక్షుడిగా ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు. 2014లో ఎంపీ అభ్యర్థిగా చాన్స్​ వచ్చినా చివర్లో కులం సర్టిఫికెట్ విషయంలో ఇష్యూతో పసునూరి దయాకర్ కు ఇచ్చారు. తర్వాత కేసీఆర్​ వరంగల్ పర్యటన సం దర్భంగా గుడిమల్ల ఇంటికి వెళ్లి రాజకీయ భవిష్యత్ ​తాను చూసుకుంటానని మాటిచ్చారు. ఇప్పటికీ ఎనిమిదేండ్లవుతున్నా ఎలాంటి పదవి దక్కలేదు. 

హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గాని కి చెందిన నాగుర్ల వెంకటేశ్వర్లు ఉద్యమంలో చురు గ్గా పాల్గొన్నారు. ప్రతి అసెంబ్లీ ఎన్నికల్లో పరకాల నుంచి టిక్కెట్ ఆశిస్తున్నారు. ఆయనకు రైతు రుణ విమోచన కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చారు. ఈసారి పరకాల సీటును ఆశించి ఫీల్డ్ వర్క్ చేసినా మరోసారి నిరాశ తప్పలేదు. 

సూర్యాపేట జిల్లా తుంగతుర్తికి చెందిన మందుల సామేల్​కు టికెట్​ ఇవ్వకపోవడంతో ఇటీవల బీఆర్ఎస్ కు రిజైన్ ​చేశారు. ఈసారి ఏదో ఒక పార్టీ నుంచి బరిలో నిలిచి సిట్టింగ్ ఎమ్మెల్యేను ఓడిస్తానని శపథం చేశారు. కోదాడ నియోజకవర్గానికి చెందిన కన్మంత శశిధర్ రెడ్డి 2014లో పోటీ చే సి ఓడిపోయారు. 2018లో చివరి నిమిషంలో బొల్లం మల్లయ్య యాదవ్ కు టికెట్​ కేటాయించారు. ఈసారి కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేకే దక్కడంతో అసంతృప్తి నాయకులంతా ఏకమయ్యారు.

అరవింద్ ​రెడ్డి బీసీ నినాదం 


మంచిర్యాల కోల్​బెల్ట్​ ఏరియాలో ఉద్యమాన్ని ఉర్రూతలూగించి టీఆర్ఎస్​కు పునాదులు వేసిన లీడర్​ గడ్డం అరవింద్​రెడ్డి. 2009, 2010 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. కేసీఆర్​తో విభేదాలతో కాంగ్రెస్​లో చేరారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్​ టికెట్​రాకపోవడంతో తిరిగి టీఆర్ఎస్​లో చేరి దివాకర్​రావును గెలిపించారు. ఈసారి టికెట్ తనకే వస్తుందనే ధీమాతో ఉన్నప్పటికీ కేసీఆర్ హ్యాండ్​ఇచ్చారు. ఒకదశలో ఆయన బీజేపీతో టచ్​లోకి వెళ్లి వెనక్కు తగ్గారు. బీఆర్ఎస్​లో అణిచివేతకు గురైన ఉద్యమకారులు, అనుచరులతో ఇటీవల ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసి మంచిర్యాల టికెట్​బీసీలకే ఇవ్వాలని డిమాండ్​ చేశారు. లేకుంటే వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్​అభ్యర్థికి ఓటమి తప్పదని హైకమాండ్​కు వార్నింగ్​ఇచ్చారు.