పిల్లలు అడిగిందల్లా ఇవ్వకూడదా?

పిల్లలు అడిగిందల్లా ఇవ్వకూడదా?

మేం  పొందలేని సంతోషాలు, కంఫర్ట్స్​  మా పిల్లలకి  ఇస్తున్నాం అంటుంటారు చాలామంది పేరెంట్స్​​. ఈ ఆలోచనతోనే వాళ్లు అడిగిందల్లా ఇచ్చేస్తారు. కానీ, పిల్లలపై ప్రేమతో చేసే ఈ పనులు వాళ్ల ఫ్యూచర్​ని ఎఫెక్ట్​ చేస్తాయి. పిల్లలకి అడిగిందల్లా ఇవ్వడం వల్ల వాళ్లకి  కష్టం , డబ్బు విలువ తెలియదు. దానివల్ల ఫ్యూచర్​లో కష్టమైన పనులు ఏవైనా చేయాల్సి వస్తే వెనకడుగేస్తారు. ప్రతి చిన్న అవసరానికి  పేరెంట్స్​పై ఆధారపడతారు. అందుకే వాళ్లకి అడిగిందల్లా ఇవ్వకూడదు. పిల్లల ఫ్యూచర్​ని దృష్టిలో ఉంచుకుని చిన్నప్పట్నించీ వాళ్లకి డబ్బు విలువ చెప్పాలి. అప్పుడే పెద్దయ్యాక ఇండిపెండెంట్​గా ఉంటారు. కొన్నిసార్లు స్తోమత మించినా సరే పిల్లల్ని సంతోష పెట్టే ప్రయత్నం చేస్తుంటారు పేరెంట్స్. కానీ, దానివల్ల రోజురోజుకి వాళ్ల అవసరాల లిస్ట్ పెరుగుతూ పోతుంది. అవి ఇవ్వలేనప్పుడు మొండిగా తయారవుతారు.‘నో’ అనే  ఆన్సర్​ని  యాక్సెప్ట్ చేయలేక పేరెంట్స్​తో గొడవ పడతారు. అది రానురాను పేరెంట్స్​, పిల్లల మధ్య రిలేషన్​ని దెబ్బతీస్తుంది.  పిల్లలకి అడిగిందల్లా ఇస్తే  పెద్దయ్యాక చిన్న చిన్న విషయాలకి కూడా అడ్జస్ట్​ అవ్వడానికి ఇష్టపడరు. దానివల్ల వచ్చే సమస్యల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందుకే పిల్లలు ఏదైనా అడిగినప్పుడు అది వాళ్లకి ఎంతవరకు అవసరం అన్నది ఆలోచించాలి. ఒకేసారి పదీ ఇరవై వస్తువులు అడిగితే వాటిల్లో వాళ్లకి అవసరమైన రెండుమూడింటిని మాత్రమే ఇవ్వాలి. అప్పుడే వాళ్లకి పరిస్థితులకు అనుగుణంగా బతకడం అలవాటు అవుతుంది.  పిల్లల్ని అడుగు కింద పెట్టనీయకుండా అన్నీ బెడ్​ మీదకే ఇస్తుంటారు కొందరు పేరెంట్స్. దానివల్ల పిల్లలు రానురాను బద్ధకస్తులుగా తయారవుతారు. పెరిగి పెద్దయ్యాక వాళ్ల పనులు వాళ్లే చేసుకోలేక ఇతరుల మీద డిపెండ్​ అవుతారు.  పెద్దయ్యాక వాళ్లు అలా తయారు కాకూడదంటే వాళ్లతో చిన్న చిన్నఇంటి పనులు చేయించాలి.