ఎక్సర్‌సైజ్‌తో గుండెజబ్బు రిస్క్​ తగ్గుతది.. అమెరికన్ రీసెర్చర్ల స్టడీలో వెల్లడి 

ఎక్సర్‌సైజ్‌తో గుండెజబ్బు రిస్క్​ తగ్గుతది.. అమెరికన్ రీసెర్చర్ల స్టడీలో వెల్లడి 

బోస్టన్: ఎక్సర్ సైజ్ చేస్తే శరీరానికి మంచిదని, గుండెకు కూడా వ్యాయామం మేలు చేస్తుందని ఇదివరకే అనేక పరిశోధనల్లో తేలింది. అయితే, మెదడులో స్ట్రెస్ ను పెంచే యాక్టివిటీని కూడా వ్యాయామం తగ్గిస్తుందని, తద్వారా గుండె జబ్బు ముప్పు గణనీయంగా తగ్గిపోతుందని తాజాగా అమెరికాలోని మసాచూసెట్స్ జనరల్ హాస్పిటల్ రీసెర్చర్ల అధ్యయనంలో వెల్లడైంది. ‘‘మెదడులోని ప్రీఫ్రంటల్ కార్టెక్స్ భాగం నిర్ణయాలు తీసుకోవడం, లక్ష్యాలను చేరుకోవడానికి సంబంధించిన ఆలోచనలకు కేంద్రంగా ఉంటుంది. అందుకే దీనిని మెదడు స్ట్రెస్ సెంటర్ గా భావిస్తారు. సాధారణంగా మనుషులు స్ట్రెస్ కు గురైతే దానిని కంట్రోల్ చేసే క్రమంతో వారి మెదడులోని ప్రీఫ్రంటల్ కార్టెక్స్ భాగంలో యాక్టివిటీ తీవ్రంగా పెరుగుతుంది.

తద్వారా దీని ప్రభావం గుండె ఆరోగ్యంపైనా పడుతుంది. అయితే, శారీరక శ్రమ అధికంగా చేసేవారిలో మాత్రం ప్రీఫ్రంటల్ కార్టెక్స్ లో ఒత్తిడికి సంబంధించిన యాక్టివిటీ మాత్రం అంతగా పెరగదు”  అని రీసెర్చ్ లో తేలినట్టు రీసెర్చ్ లో పాల్గొన్న కార్డియాలజిస్ట్ అహ్మద్ తవకోల్ వెల్లడించారు. స్టడీలో భాగంగా 50 వేల మంది వాలంటీర్లను సర్వే చేశారు. వారి ఫిజికల్ యాక్టివిటీకి సంబంధించిన పూర్తి డేటాను సేకరించారు. వీరిలో 700కుపైగా మందికి బ్రెయిన్ స్కాన్ టెస్టులు కూడా చేసి, స్ట్రెస్ కు సంబంధించిన యాక్టివిటీని పరిశీలించారు. అలాగే వాలంటీర్ల ఆరోగ్య వివరాలను నమోదు చేశారు. వీరిలో దాదాపు 13 శాతం మంది గత పదేండ్లలో గుండె జబ్బుల బారిన పడినట్టు గుర్తించారు. మొత్తంగా శారీరక శ్రమ అధికంగా చేసిన వాళ్లకు మిగతా వాళ్లతో పోలిస్తే గుండె జబ్బులు వచ్చే ముప్పు 23% తక్కువగా ఉన్నట్టు స్టడీలో తేల్చారు. వీరి రీసెర్చ్ వివరాలు ఇటీవల ‘అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ’ జర్నల్ లో పబ్లిష్ అయ్యాయి.