నిద్ర సరిగ్గా లేకపోతే బాడీపై, బ్రెయిన్​పై ఎఫెక్ట్

నిద్ర సరిగ్గా లేకపోతే బాడీపై, బ్రెయిన్​పై ఎఫెక్ట్

న్యూఢిల్లీ: నిద్ర సరిగ్గా లేకపోతే బాడీపై, బ్రెయిన్​పై ఎఫెక్ట్ పడుతుందని ఇదివరకే అనేక స్టడీల్లో తేలింది. అయితే, త్వరగా నిద్ర పట్టకపోయినా కూడా బ్రెయిన్ పై తీవ్ర ప్రభావమే పడుతుందని అమెరికాలోని అప్ స్టేట్ మెడికల్ వర్సిటీ సైంటిస్టులు చెప్తున్నారు. పడుకున్న తర్వాత అరగంటలోపు నిద్ర పట్టకపోయినా, నిద్ర పోయేందుకు మందులు వాడినా దీర్ఘకాలంలో వారికి డిమెన్షియా (జ్ఞాపకశక్తి, ఆలోచనాశక్తి నశించడం, ఇతర సమస్యలతో వచ్చే వ్యాధి) వచ్చే ముప్పు పెరుగుతుందన్నారు. రీసెర్చ్​లో భాగంగా 60 ఏండ్లు, ఆపై వయసు ఉన్న వాళ్లపై పదేండ్ల పాటు జరిగిన అనేక అధ్యయనాలను స్టడీ చేశారు. ప్రధానంగా నిద్ర కోసం మందులు వాడటం(స్లీప్ మెడికేషన్), త్వరగా నిద్ర పట్టకపోవడం( స్లీప్ ఇనీషియేషన్ ఇన్ సోమ్నియా), నిద్రపోయిన తర్వాత మధ్యలో మెలకువ వచ్చాక మళ్లీ నిద్ర పట్టకపోవడం(స్లీప్ మెయింటెనెన్స్ ఇన్ సోమ్నియా) అనే అంశాలపై అధ్యయనం చేశారు. దీంతో స్లీప్ మెడికేషన్ వాడిన వాళ్లకు, పడుకున్న అరగంటలోపు నిద్ర పోవడంలో ఇబ్బంది పడినవాళ్లకు డిమెన్షియా ముప్పు పెరిగినట్లు వెల్లడైంది. అయితే, స్లీప్ మెయింటెనెన్స్ ఇన్ సోమ్నియా వల్ల మాత్రం డిమెన్షియా ముప్పు తగ్గినట్లు గుర్తించామని, ఇది సర్ ప్రైజింగ్ గా ఉందని సైంటిస్టులు పేర్కొన్నారు.