అభివృద్ధిని చూసి మరోసారి అవకాశం ఇవ్వండి : నిరంజన్ రెడ్డి

అభివృద్ధిని చూసి మరోసారి అవకాశం ఇవ్వండి : నిరంజన్ రెడ్డి

వనపర్తి/పెబ్బేరు, వెలుగు : నియోజకవర్గ అభివృద్ధిని చూసి మరో అవకాశం ఇవ్వాలని మంత్రి నిరంజన్​రెడ్డి కోరారు. శనివారం ఆయన పెబ్బేరు మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వనపర్తి నియోజకవర్గం ఎత్తు మీదుందని కాలువ నీళ్లు రావని గత పాలకులు చెబితే, మన తలరాత అనుకున్నామని అయితే కేసీఆర్  సీఎం అయ్యాక కాలువలు తవ్వి నీటిని అందిస్తున్నారని చెప్పారు. తొమ్మిదేండ్లలో నియోజకవర్గంలో 1.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందించామన్నారు. కల్వకుర్తి లిఫ్ట్​ ద్వారా పెద్దమందడి, ఖిల్లా ఘనపురం, వనపర్తి మండలాలకు నీరు తరలించినట్లు చెప్పారు.

రైతులు, రైతు కూలీలు తనకు అండగా ఉంటారనే నమ్మకం ఉందన్నారు. ప్రజల కోసం ఎన్ని ఆరోపణలు వచ్చినా పని చేశానని, ఆ ధైర్యంతోనే ఓట్లు అడుగుతున్నానన్నారు. 50 ఏండ్ల కాంగ్రెస్  పాలనలో సాగునీళ్లు, కరెంటు లేక వలస వెళ్లాల్సి వచ్చేదని, ఆ పార్టీని తరిమి కొట్టాలని కోరారు. కొల్లాపూర్ నియోజకవర్గంలోని సింగోటం నుంచి కాలువ ద్వారా గోపాల్ దిన్నె రిజర్వాయర్  చివరి ఆయకట్టుకు నీళ్లు అందించేందుకు రూ.150 కోట్లతో పనులు నడుస్తున్నాయని తెలిపారు. శ్రీశైలం రిజర్వాయర్  నిర్వాసితులకు ఉద్యోగాలు ఇస్తామన్నారు.

పెబ్బేరు మండలం పాతపల్లి, పెద్దమందడి, గుమ్మడం గ్రామాల్లో పలువురు యువకులు బీఆర్ఎస్  పార్టీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే గట్టు తిమ్మప్ప, జడ్పీటీసీ పద్మ వెంకటేశ్, పార్టీ మండల అధ్యక్షుడు వనం రాములు, బుచ్చారెడ్డి, కోదండరామిరెడ్డి, రాజశేఖర్, సత్యారెడ్డి, మహేశ్వర్ రెడ్డి, వెంకటస్వామి పాల్గొన్నారు.