జనవరి 28 నుంచి మహబూబ్ నగర్ జిల్లాలో మన్యంకొండ’ బ్రహ్మోత్సవాలు

జనవరి 28 నుంచి మహబూబ్ నగర్ జిల్లాలో  మన్యంకొండ’ బ్రహ్మోత్సవాలు
  • 1న వేంకటేశ్వరస్వామి రథోత్సవం
  • 3న దర్బారు తర్వాత నెల రోజులపాటు జాతర
  • సీఎం రేవంత్​రెడ్డి హాజరయ్యే అవకాశం
  • ఉమ్మడి జిల్లాతోపాటు మహారాష్ట్ర, కర్నాటక, ఏపీ నుంచి     రానున్న భక్తులు
  • గుట్టపైకి మహబూబ్​నగర్​బస్టాండ్​ నుంచి15 నిమిషాలకో బస్సు

మహబూబ్​నగర్ రూరల్, వెలుగు: పేదల తిరుపతిగా ప్రసిద్ధి చెందిన మహబూబ్​నగర్​జిల్లా మన్యంకొండ వేంకటేశ్వరస్వామి క్షేత్రం బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతోంది. ఈ నెల 28(బుధవారం) నుంచి వేడుకలు ప్రారంభం కానున్నాయి. మొదటి రోజు గజవాహన  సేవ అనంతరం కోటకదిర గ్రామంలోని అళహరి వంశస్తుల ఇంటి నుంచి స్వామి, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా కొండమీదకు తీసుకురానున్నారు. 29న హంస వాహన సేవ, 30న సూర్యప్రభ వాహన సేవ, 31న ప్రభోత్సవం, ఫిబ్రవరి 1న అర్ధరాత్రి రథోత్సవం నిర్వహించనున్నారు.

2న అశ్వవాహన సేవ, ద్వితీయ ప్రభోత్సవం, 3న వసంతోత్సవం, శేష వాహన సేవ, శ్రీవారి దర్బారు జరగనున్నాయి. ఆ తర్వాత నెల రోజులపాటు జాతర ఉంటుంది. మహాశివరాత్రి తర్వాత  కొండమీదకు చేర్చిన ఉత్సవ విగ్రహాలను తిరిగి కోటకదిరకు తీసుకొచ్చి యథాస్థానంలో ప్రతిష్ఠించడంతో ఉత్సవాలు ముగుస్తాయి. అలాగే మార్చి 1న అలివేలు మంగతాయారు బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. మొదటి రోజు అంకురార్పణం చేస్తారు. 2న ధ్వజారోహణం, దేవతాహ్వానం, 3న గరుడ వాహన సేవ, విమాన రథోత్సవం, 4న అశ్వవాహన సేవ, 5న పూర్ణాహుతి, వసంతోత్సవంతో ఉత్సవాలు ముగియనున్నాయి.

సీఎంను ఆహ్వానించిన ఎమ్మెల్యే

మన్యంకొండ బ్రహ్మోత్సవాలకు సీఎం రేవంత్​రెడ్డి హాజరయ్యే అవకాశాలున్నాయి. రథోత్సవానికి ఆయన వస్తారని కాంగ్రెస్​ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇటీవల ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి సీఎంను కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. అయితే ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఏండ్లుగా జరుగుతున్న జాతర్లకు ఇంతవరకు సీఎం హోదాలో ఎవరూ రాలేదు. మొదటిసారి సీఎం రేవంత్ రెడ్డి ఏడాదిన్నర కిందట కురుమూర్తి బ్రహ్మోత్సవాలకు హాజరయ్యారు. వెయ్యేండ్ల చరిత్ర ఉన్న ఈ క్షేత్ర అభివృద్ధికి రూ.10‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోట్లు మంజూరు చేశారు. ప్రస్తుతం ఆ పనులు చకచకా జరుగుతున్నాయి. ఇప్పుడు సీఎం మన్యంకొండకు వస్తే.. ఈ ఆలయ అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేసే అవకాశం ఉంది.

చకచకా ఏర్పాట్లు

మన్యంకొండ లక్ష్మీవేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. గుట్టపైకి వెళ్లే ప్రధాన రహదారిపై ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వాహనాల పార్కింగ్ కోసం మైదాన ప్రాంతాన్ని చదును చేశారు. కోనేరును శుభ్రం చేసి కొత్త నీటిని నింపుతున్నారు. అలాగే స్నాన ఘట్టాల దగ్గర వాటర్​షవర్లను ఏర్పాటు చేస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం గతంలో నిర్మించిన మరుగుదొడ్లకు మరమ్మతు చేయిస్తున్నారు. నాటకాలు ప్రదర్శించే వారి కోసం స్టేజీని నిర్మిస్తున్నారు. ఆలయానికి సున్నం జాజుతో రంగులు వేస్తున్నారు. బ్రహ్మోత్సవాల్లో ప్రధానమైన రథోత్సవం ఆదివారం జరగనుండటంతో దాదాపు 2 లక్షల మంది భక్తులకు వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇటీవల ఆలయాన్ని సందర్శించిన కలెక్టర్ విజయేందిర బోయి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

ఇలా చేరుకోవాలి..

మన్యంకొండకు ఉమ్మడి పాలమూరు జిల్లాతోపాటు మహారాష్ర్ట, కర్నాటక, ఏపీ రాష్ట్రాల నుంచి భక్తులు తరలిరానున్నారు. ఈ క్షేత్రానికి రైలు, బస్సుల ద్వారా ఈజీగా చేరుకోవచ్చు. హైదరాబాద్ నుంచి రైలు మార్గాన వచ్చే ప్రయాణికులు మహబూబ్ నగర్​కు చేరుకోవాలి. అక్కడి నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆలయానికి ఆర్టీసీ బస్సుల్లో వెళ్లాలి. అలాగే లోకల్ ప్యాసింజర్ రైళ్ల ద్వారా నేరుగా మన్యంకొండ రైల్వే స్టేషన్ లో దిగి, ఆర్టీసీ బస్సుల్లో గుట్టపైకి చేరుకోవచ్చు. హైదరాబాద్, కర్నాటక నుంచి వచ్చే భక్తులు మహబూబ్​నగర్, మక్తల్, ఆత్మకూరు, నారాయణపేట మీదుగా బస్సుల్లో వెళ్లవచ్చు. మహబూబ్​గర్ బస్టాండ్ నుంచి ప్రతీ 15 నిమిషాలకో బస్సును గుట్టపైకి నడిపేందుకు ఆర్టీసీ ఆఫీసర్లు ఏర్పాట్లు చేశారు.