మావోయిస్టు అగ్రనేత ఆర్కే కన్నుమూత

మావోయిస్టు అగ్రనేత ఆర్కే కన్నుమూత

మావోయిస్టు అగ్రనేత, సెంట్రల్ కమిటీ మెంబర్, AOB స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి అక్కిరాజు హరగోపాల్ అలియాస్ సాకేత్ అలియాస్ రామకృష్ణ కన్నుమూశారు. చత్తీస్ గఢ్ లోని సుక్మా, బీజాపూర్ జిల్లాల మధ్య దండకారణ్యంలో తీవ్రమైన అనారోగ్యంతో ఆయన చనిపోయినట్టు తెలుస్తోంది. 65 ఏళ్ల రామకృష్ణపై వివిధ రాష్ట్రాల్లో 200కు పైగా కేసులున్నాయి. ఆయనపై కోటిన్నరకు పైగా రివార్డ్ ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చాలా ఎన్ కౌంటర్ల నుంచి ఆర్కే తృటిలో తప్పించుకున్నారు. 

గుంటూరు జిల్లా రెంటచింతల మండం తుమురుకుంటకు చెందిన రిటైర్డ్ హెడ్ మాస్టర్ సచ్చిదానందరావు, రాజ్యలక్ష్మి దంపతుల ఆరుగురు పిల్లల్లలో రెండో వాడు ఆర్కే. వరంగల్ నిట్ లో ఆయన బీటెక్ చదివారు. ఆ సమయంలో నక్సల్స్ ఉద్యమానికి ఆకర్షితుడయ్యారు. రాజేంద్రనగర్ లో 1980 నుంచి 1982 వరకు ఓ స్కూల్ లో టీచర్ గా పనిచేశారు. ఆ తర్వాత నక్సల్స్ ఉద్యమంలో చేరి, అజ్ఞాతంలోకి వెళ్లారు. ఉద్యమంలో వివిధ స్థాయిల్లో పనిచేసి కీలకమైన సెంట్రల్ కమిటీ మెంబర్ అయ్యారు. దక్షిణ భారతదేశంలో మావోయిస్టు ఉద్యమ నిర్మాణంలో కీలకపాత్ర పోషించిన అగ్రనేతల్లో ఆర్కే ఒకరు. 

ఆంధ్రా-ఒడిషా బార్డర్ లో మావోయిస్టు పార్టీ బలోపేతానికి ఆయన కృషి చేశారు.తిరుపతి అలిపిరి దగ్గర నాటి సీఎం చంద్రబాబుపై, ఐపీఎస్ మహేశ్ చంద్రా లడ్డాపై దాడుల కేసుల్లో ఆయన ప్రధాన నిందితుడు. ప్రభుత్వంతో శాంతి చర్చల్లో కీలకపాత్ర పోషించారు. ఆర్కే భార్య కందుల శిరీష అలియాస్ పద్మ కూడా మావోయిస్టు పార్టీలో పనిచేశారు. ప్రస్తుతం ఆమె లొంగిపోయి ప్రకాశం జిల్లా అలకూరపాడులో ఉంటున్నారు. 

నాలుగేళ్ల కిందట బలిమెల ఎన్ కౌంటర్ లో ఆర్కేకు బుల్లెట్ గాయమైంది. ఇదే ఎన్ కౌంటర్ లో అతని కుమారుడు శివాజీ చనిపోయాడు. ఏవోబీ ఇన్ చార్జిగా వ్యవహరిస్తున్న ఆర్కేపై ఒడిషాలో 20 లక్షలు, ఛత్తీస్ గఢ్ లో 40 లక్షలు, జార్ఖండ్ లో 12 లక్షలు, ఏపీలో 25 లక్షల రివార్డ్ ఉంది. అయితే ఆర్కే మరణించిన విషయాన్ని మావోయిస్టు పార్టీ ఇంకా ధృవీకరించలేదు.