ఎంబీబీఎస్‌‌ కౌన్సెలింగ్‌‌పై స్టూడెంట్ల అసంతృప్తి

ఎంబీబీఎస్‌‌ కౌన్సెలింగ్‌‌పై స్టూడెంట్ల అసంతృప్తి

హైదరాబాద్, వెలుగు: ఎంబీబీఎస్‌‌ కన్వీనర్ కోటా మాప్‌‌ అప్‌‌ రౌండ్‌‌కు కాళోజీ హెల్త్ యూనివర్సిటీ శుక్రవారం నోటిఫికేషన్ ఇచ్చింది. 10 వ తేదీ మధ్యాహ్నం  ఒంటి గంట నుంచి 12వ తేదీ మధ్యాహ్నం వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని తెలిపింది. వివిధ కాలేజీల్లో ఖాళీగా ఉన్న 125 సీట్లను ఈ రౌండ్‌‌లో భర్తీ చేయనున్నారు. కన్వీనర్ కోటా, మేనేజ్‌‌మెంట్ కోటా తొలి 2 రౌండ్లలో సీట్లు వచ్చిన స్టూడెంట్లు, సీట్లు వచ్చి కాలేజీల్లో చేరని స్టూడెంట్లు ఈ రౌండ్‌‌ కౌన్సెలింగ్​కు అర్హులు కాదని నోటిఫికేషన్‌‌లో పేర్కొన్నారు.

గత రౌండ్లలో సీట్లు రాని స్టూడెంట్లు మాత్రమే ఈ కౌన్సిలింగ్‌‌కు అర్హులని పేర్కొన్నారు. ఈ నిబంధనపై మేనేజ్‌‌మెంట్‌‌ కోటా సీట్లలో చేరిన స్టూడెంట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిబంధన వల్ల తమకంటే తక్కువ ర్యాంక్ వచ్చినోళ్లకు కన్వీనర్ కోటా సీట్లు వచ్చే అవకాశం ఉందని, తాము ఆ చాన్స్ కోల్పోతామని ఆవేదన చెందుతున్నారు. దీనిపై వర్సిటీ వీసీ కరుణాకర్‌‌‌‌రెడ్డిని సంప్రదించగా సుప్రీంకోర్టు సూచనల మేరకు ఈ ఏడాదే కొత్తగా రూల్ తెచ్చామన్నారు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం 2 నెలల కిందే ఉత్తర్వులు(జీవో125) ఇచ్చిందన్నారు. ఆ ప్రకారమే తాము కౌన్సెలింగ్ చేపడుతున్నామని, సీటు బ్లాకింగ్ దందా జరగకుండా ఉండేందుకు ఈ నిబంధన ఉపయోగపడుతుందన్నారు.