మారేపల్లి ఘటన దళితజాతికే అవమానం

మారేపల్లి ఘటన దళితజాతికే అవమానం
  • ఇల్లీగల్ వైన్ షాపులపై ఉద్యమిస్తాం
  • బీజేపీ నిజ నిర్ధారణ కమిటీ చైర్మన్ చంద్రశేఖర్

సంగారెడ్డి, వెలుగు:  బెల్టుషాపుల నిర్వహణను వ్యతిరేకించిన మారేపల్లి దళితులకు ప్రభుత్వం అన్యాయం చేసిందని బీజేపీ నిజానిర్ధారణ కమిటీ బృందం నిర్ధారించింది. బెల్టుషాపులపై నిలదీసిన దళితులను అభినందించాల్సిన పోలీసులు ఉల్టా వారిపైనే చోరీ కేసు నమోదు చేసి జైలుకు పంపించారని గుర్తించింది. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మారేపల్లి గ్రామ దళితులపై అక్రమ కేసుల ఘటనకు సంబంధించి బీజేపీ రాష్ట్ర కమిటీ ఐదుగురు సభ్యులతో నిజనిర్ధారణ కమిటీ వేసిన విషయం తెలిసిందే. కమిటీ సభ్యులు చంద్రశేఖర్, చింత సాంబమూర్తి, బి.వెంకట్ రెడ్డి, ఎం.జయశ్రీ మంగళవారం బీజేపీ నేతలతో కలిసి మారేపల్లి గ్రామంలో పర్యటించారు. లిక్కర్​ వల్ల మృతిచెందిన ఐదుగురి కుటుంబసభ్యులను పరామర్శించారు. తర్వాత గ్రామంలో బెల్టుషాపుల నిర్వహణ, దళితుల పట్ల పోలీసుల వ్యవహార తీరు తదితర వివరాలను గ్రామస్తుల ద్వారా తెలుసుకున్నారు.

దళితులకు అండగా ఉంటాం

మారేపల్లి దళితులకు పోలీసులు అన్యాయం చేశారని కమిటీ సభ్యుడు, మాజీ మంత్రి చంద్రశేఖర్ చెప్పారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. మారేపల్లి ఘటన దళితజాతికి అవమానమన్నారు. ఇల్లీగల్ వైన్ షాపుల నిర్వహణపై ఉద్యమిస్తామని తెలిపారు. సీఎం కేసీఆర్ పరోక్షంగా బెల్టు షాపుల నిర్వహణను ప్రోత్సహిస్తూ తాగుబోతుల రాష్ట్రంగా మార్చారని విమర్శించారు. మారేపల్లి దళితులకు జరిగిన అన్యాయాన్ని జాతీయ ఎస్సీ కమిషన్ దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామన్నారు. 19 మంది దళితులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. కళ్లు కనిపించని మానసిక వికలాంగురాలు, 60 ఏళ్ల వృద్ధురాలిపై అక్రమ కేసులు బనాయించడం సిగ్గుచేటన్నారు. దళిత కుటుంబాలను పరామర్శించిన వారిలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నరేందర్ రెడ్డి, దళిత మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.జగన్, పార్టీ సంగారెడ్డి నియోజకవర్గ ఇన్ చార్జి రాజేశ్వరరావు దేశ్ పాండే, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు అశ్వంత్, బీజేపీ నాయకుడు శ్రీకాంత్ గౌడ్ ఉన్నారు.