
- మార్జిన్లపై ఒత్తిళ్లే కారణం..పెరిగిన ప్రొవిజన్లు
- లోన్ గ్రోత్ తక్కువే
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్లో ప్రైవేట్ రంగ బ్యాంకుల నికర లాభాలు పడిపోయాయి. ఆస్తుల నాణ్యత తగ్గడం, కేటాయింపులు పెరగడం, నికర వడ్డీ మార్జిన్‌లపై ఒత్తిడి ఇందుకు కారణాలు. మనదేశంలోని15 ప్రైవేట్ రంగ బ్యాంకుల నికర లాభం గత ఏడాదితో పోలిస్తే 3.3శాతం తగ్గింది. ఇందులో హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్‌తో సహా ఐదు టాప్ బ్యాంకుల మొదటి క్వార్టర్ ఫలితాలు ఉన్నాయి. నికర వడ్డీ ఆదాయం (ఎన్ఐఐ) నికర వడ్డీ మార్జిన్లు (ఎన్ఐఎం) మందగించాయి. నిఫ్టీ–-50 బ్యాంకులలో, ఐసీఐసీఐ బ్యాంక్ నికర లాభం అత్యధికంగా 15.5శాతం పెరిగింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నికర లాభం 12.2శాతం పెరిగి రూ.18,155 కోట్లకు చేరుకుంది. ఇండస్ఇండ్ బ్యాంక్ గత క్వార్టర్లో రూ.2,000 కోట్లకు పైగా నష్టాన్ని ప్రకటించిన తర్వాత రూ.684 కోట్ల నికర లాభాన్ని సాధించింది. యాక్సిస్ బ్యాంక్ నికర లాభం దాదాపు 4శాతం తగ్గింది. యెస్ బ్యాంక్ రీస్ట్రక్చరింగ్ తర్వాత అత్యుత్తమ క్వార్టర్లీ లాభాన్ని ప్రకటించింది. కోటక్ మహీంద్రా బ్యాంక్ నికర లాభం 7శాతం తగ్గింది.
లోన్ల విషయంలో ఆచితూచి..
లోన్ వృద్ధి మందగించింది. బ్యాంకులు అన్‌సెక్యూర్డ్, మైక్రోఫైనాన్స్ విభాగాలకు లోన్లు ఇవ్వడంలో జాగ్రత్తగా వ్యవహరించాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ లోన్‌గ్రోత్ 6.75శాతం తగ్గింది. లోన్-–డిపాజిట్ నిష్పత్తిని (సీడీ నిష్పత్తి) విలీనానికి ముందు స్థాయిలైన 85–-90శాతంకి తీసుకురావాలని బ్యాంక్ లక్ష్యంగా పెట్టుకుంది. కార్పొరేట్ విభాగం నుంచి లోన్లకు డిమాండ్ తక్కువగా ఉందని, 2026 ఆర్థిక సంవత్సరం రెండోభాగం నుంచి పుంజుకుంటుందని బ్యాంకులు అంచనా వేస్తున్నాయి. కేర్ఎడ్జ్ రేటింగ్స్ రిపోర్ట్ ప్రకారం, 2026 ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్లో గ్రామీణ మార్కెట్లు, వ్యవసాయ రంగం, కొన్ని ఎంఎస్ఎంఈలలో వృద్ధి కనిపిస్తుంది. రెండో క్వార్టర్, మూడో క్వార్టర్ సమయంలో పండుగల సీజన్ ప్రారంభంతో అర్బన్ రిటైల్ డిమాండ్ పెరుగుతుందని అంచనా. 2025 జూన్‌లో 50 బేసిస్పాయింట్లు రెపో రేటు కోత ప్రభావం ఈసారి రెండో క్వార్టర్లో పూర్తిగా కనిపిస్తుందని భావిస్తున్నారు. 2026 ఆర్థిక సంవత్సరం రెండో సగభాగంలో మెరుగైన లిక్విడిటీ పరిస్థితులు లోన్లను పెంచవచ్చు.
పెరగని డిపాజిట్లు...
డిపాజిట్ల సేకరణ కూడా బ్యాంకులకు సవాలుగా కొనసాగుతోంది, ముఖ్యంగా కరెంట్ అకౌంట్, సేవింగ్స్ అకౌంట్ డిపాజిట్లను పెంచడం కష్టమవుతోంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్‌తో సహా చాలా బ్యాంకులు డిపాజిట్లను ఆకర్షించడానికి సేవింగ్స్ అకౌంట్ రేట్లను తగ్గించాయి. ఇండస్ఇండ్ బ్యాంక్ కన్స్యూమర్ బ్యాంకింగ్ మార్కెటింగ్ హెడ్ సౌమిత్ర సేన్ మాట్లాడుతూ, సేవింగ్స్ అకౌంట్‌తో పాటు టర్మ్ డిపాజిట్ రేట్లను తగ్గించడానికి ఇంకా అవకాశం ఉందని అన్నారు. అసెట్ క్వాలిటీని చూస్తే, ఐసీఐసీఐ బ్యాంక్, యెస్ బ్యాంక్‌ల గ్రాస్ ఎన్పీఏ నిష్పత్తి వరుసగా 1.67శాతం, 1.60శాతం వద్ద స్థిరంగా ఉంది. ఈ ఏడాది జూన్ 30 నాటికి ఇండస్ఇండ్ బ్యాంక్ గ్రాస్ఎన్పీఏలు 51 బేసిస్ పాయింట్లు పెరిగి 3.64శాతానికి చేరుకున్నాయి. ఐడీబీఐ, కరూర్ వైశ్యా బ్యాంక్, సౌత్ ఇండియన్ బ్యాంక్, తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్‌ల గ్రాస్ ఎన్పీఏ నిష్పత్తులు మెరుగుపడ్డాయి. చిన్నమొత్తాల్లో లోన్లు ఇచ్చే మైక్రోఫైనాన్స్ విభాగాలలో పెద్ద మధ్యతరహా ప్రైవేట్ రంగ బ్యాంకులు ఒత్తిడిని చూశాయి. దీంతో స్లిప్పేజ్‌లు, ప్రొవిజన్లు పెరిగాయి.
వడ్డీ ఆదాయంలో తగ్గుదల
చాలా బ్యాంకుల నికర వడ్డీ ఆదాయం మందగించింది. ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ బ్యాంక్ మాత్రమే నికర వడ్డీ ఆదాయంలో 5శాతానికిపైగా వృద్ధిని సాధించాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం 5.4శాతం పెరిగి రూ.31,440 కోట్లకు చేరుకోగా, ఇండస్ఇండ్ బ్యాంక్ ఎన్ఐఐ 14శాతం పడింది.ఈసారి నికర వడ్డీ ఆదాయం ఏడాది లెక్కన 3.07శాతం పెరిగింది. గత త్రైమాసికాల్లో మాదిరిగానే ఈసారి కూడా బ్యాంకులు ఇతర ఆదాయ వనరులపై ఎక్కువగా ఆధారపడ్డాయి. ఇండస్ఇండ్ బ్యాంక్ మినహా మిగిలిన అన్ని బ్యాంకుల నికర వడ్డీ మార్జిన్లు తగ్గాయి. ఆర్బీఐ రెపో రేటు కోతలు దీనికి ప్రధాన కారణమని బ్యాంకులు పేర్కొన్నాయి. రాబోయే క్వార్టర్లో మార్జిన్లు మరింత తగ్గుతాయని, ఆ తర్వాత ఆర్థిక సంవత్సరం రెండో సగభాగం నుంచి పుంజుకుంటాయని బ్యాంకుల యాజమాన్యాలు పోస్ట్-ఎర్నింగ్స్ కాల్స్‌లో తెలిపాయి. ఐసీఐసీఐ బ్యాంక్ ఎన్ఐఎం 7 బేసిస్పాయింట్లు, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 11 బేసిస్పాయింట్లు, యాక్సిస్ బ్యాంక్ 17 బేసిస్పాయింట్లు, కోటక్ మహీంద్రా బ్యాంక్ 32 బేసిస్పాయింట్లు తగ్గాయి.