మారుతీ సుజుకీ SUV కార్లలో కొత్త మార్పు.. ఇకపై CNG ట్యాంక్స్ ఎక్కడ పెడతారంటే..?

మారుతీ సుజుకీ SUV కార్లలో కొత్త మార్పు.. ఇకపై CNG ట్యాంక్స్ ఎక్కడ పెడతారంటే..?

CNG Cars: సాధారణ పెట్రోల్, డీజిల్ కార్ల కంటే సీఎన్జీ కార్లు ఎక్కువ మైలేజ్ ఇస్తుంటాయి. ఇక ఖర్చు పరంగా కూడా సీఎన్జీ తక్కువ కావటంతో చాలా మంది భారతీయులు ఇలాంటి మోడల్స్ కొంటున్నారు. పైగా పొల్యూషన్ విషయంలో ఇవి పెట్రోల్, డీజిల్ కార్ల కంటే తక్కువ ఉద్ఘారాలను విడుదల చేస్తుంటాయి. అందుకే భారతీయ కుటుంబాల నుంచి వీటికి ఎక్కువ ఆదరణ లభిస్తోంది. 

దేశంలోని ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ తన కొత్త సీఎన్జీ వాహనాలకు కీలక మార్పులను ప్రకటించింది. సెప్టెంబర్ 3న మార్కెట్లోకి విడుదల కానున్న Y17 కార్లలో సీఎన్జీ ట్యాంక్ బాడీ కింది భాగంలో ఉండనుందని పేర్కొంది. దేశీయ మార్కెట్లలో 2010 నుంచి మారుతీ తన సీఎన్జీ కార్లను విక్రయిస్తుండగా.. ఇప్పటి వరకు కారు వెనక భాగంలో సీఎన్జీ ట్యాంక్స్ ఉండేవి. అయితే టెక్నాలజీ మార్పులతో తీసుకొస్తున్న కొత్త మోడళ్లలో ట్యాంక్ కారు కింది భాగంలోకి మార్చటం వల్ల ఎక్కువ బూట్ స్పేస్ లభించనుందని మారుతీ వెల్లడించింది. 

మారుతీకి చెందిన ఎస్-సీఎన్జీ టెక్నాలజీ ప్యాసింజర్ వాహన రంగంలో ఉత్తమమైనది. అందుకే ప్రత్యర్థుల కంటే ఎక్కువ అమ్మకాలను చూస్తున్నట్లు కంపెనీ చెప్పింది. అయితే మారుతీ సీఎన్జీ కార్లలో బూట్ స్పేస్ తక్కువగా ఉన్నట్లు చాలా మంది వినియోగదారుల నుంచి వస్తున్న కంప్లెయింట్లను దృష్టిలో ఉంచుకుని కంపెనీ ప్రస్తుతం తన స్మార్ట్ సీఎన్జీలో కీలక మార్పులను తీసుకొచ్చింది.

ఇప్పటికే టాటా మోటార్స్, హుందాయ్ మోటార్స్ సంస్థలు రెండు సీఎన్జీ సిలిండర్ల టెక్నాలజీని తీసుకొచ్చాయి. గతంలో ఒకటే పెద్ద సిలిండర్ అమర్చిన కంపెనీలు ప్రస్తుతం దాని స్థానంలో రెండు చిన్న సిలిండర్లను అందుబాటులోకి తీసుకొచ్చాయి. దీంతో కొంత లగేజీకి బూట్ స్పేస్ పెరిగింది. ఇప్పటికైతే మారుతీ సుజుకీ Eeco, Alto, WagonR వేరియంట్ల కింద సీఎన్జీ మోడళ్లను విక్రయిస్తోంది. మారుతీ 2025 ఆర్థిక సంవత్సరంలో 5లక్షల 94వేల 166 సీఎన్జీ కార్లను విక్రయించింది. ఇది దేశంలోని మెుత్తం సీఎన్జీ విక్రయాల్లో 71 శాతం కావటం గమనార్హం